ఇమ్రాన్ ఖాన్: పాకిస్తాన్ కొత్త ‘కెప్టెన్’ ఈయనేనా

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, facebook/ImranKhanOfficial

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, ఆ దేశానికే ‘కెప్టెన్‌’ అవుతారా? మరి కాసేపట్లో స్పష్టం కానుంది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ ముందంజలో ఉంది. ఇతర పార్టీ అవసరం లేకుండానే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని స్థానిక ప్రధాన పత్రిక ‘డాన్’ వెల్లడించింది. ఇంతకీ ఈయన రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది.

ఇమ్రాన్ 1996లో పాకిస్తాన్‌ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

1992లో క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన పాక్ జట్టుకు ఇమ్రానే కెప్టెన్. అప్పటి నుంచి దేశంలో ఆయనకు ‘కప్తాన్’ అనే పేరు స్థిరపడిపోయింది. క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో లండన్‌లో ఆయన విలాసవంతమైన జీవనశైలి కారణంగా ఇమ్రాన్‌ను ‘ఇమ్ ది డిమ్’ అని కూడా పిలవడం మొదలుపెట్టారు.

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లలో తాలిబన్ ఉద్యమానికి ఇమ్రాన్ ఇచ్చే మద్దతు కారణంగా అతడిని ‘తాలిబన్ ఖాన్’ అని కూడా పిలుస్తారు.

1996లో ఆయన రాజకీయ పార్టీని స్థాపించినా, ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇమ్రాన్ స్వయంగా 9 స్థానాల్లో పోటీ చేసి, అన్ని స్థానాల్లోనూ ఓడిపోయారు.

2013సాధారణ ఎన్నికల తరవాత పీటీఐ దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నాటి నుంచి ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్’, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలతో పాటు దేశంలో మూడో ప్రధాన పార్టీగా అది మారింది.

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించాలనే ఏకైక ఎజెండాతో ఇమ్రాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ తాలిబన్ల పట్ల ఆయనకున్న సానుభూతి కారణంగా వివాదాస్పద వ్యక్తిగా మారారు.

క్రికెట్‌ నుంచి రిటైర్ అయ్యాక ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాలతో పాటు సామాజిక సేవ వైపూ అడుగేశారు.

1991లో ఆయన షౌకత్ ఖానుమ్ మెమోరియల్ ట్రస్టును స్థాపించారు. 1994లో క్యాన్సర్ కారణంగా చనిపోయిన ఆయన తల్లికి స్మారకంగా ఖానుమ్ క్యాన్సర్ ఆస్పత్రిని నెలకొల్పారు.

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వాళ్లలో ఇమ్రాన్ కూడా ఉన్నారు.

వారసత్వ రాజకీయాలను కూడా అనేక సార్లు విమర్శించారు. పాకిస్తాన్‌లో పాలనా పరమైన లోపాలకు, బలహీనమైన అధికార వ్యవస్థకు అవే కారణమని ఇమ్రాన్ అంటారు.

ఇమ్రాన్ ఖాన్ బయోగ్రఫీ

  • జననం: 25 నవంబర్ 1952, లాహోర్‌లో
  • చదువు: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
  • ఇమ్రాన్‌ ఖాన్‌కు ముగ్గురు భార్యలు. మొదటి భార్య, యూకేకు చెందిన జేమీమా గోల్డ్ స్మిత్. (విడాకులు తీసుకున్నారు)
  • పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ఇమ్రాన్ మాజీ కెప్టెన్. ఆయన సారథ్యంలోనే పాకిస్తాన్ 1992 క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకుంది.
  • రాజకీయ పార్టీ: 1996లో తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించారు.
  • 1991లో షౌకత్ ఖానుమ్ మెమొరియల్ ట్రస్ట్‌ను ఇమ్రాన్ స్థాపించారు. 1994లో క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స అందించేందుకు ఓ ఆస్పత్రినీ నెలకొల్పారు.
  • 2008లో ‘నమల్’ పేరుతో ఓ కాలేజీని మొదలుపెట్టారు.
  • ‘ఇమ్రాన్- ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్’, ‘ఇండస్ జర్నీ- ఏ పర్సనల్ వ్యూ ఆఫ్ పాకిస్తాన్’, ‘ఆల్ రౌండ్ వ్యూ’ లాంటి ఆరు పుస్తకాలను ఇమ్రాన్ రచించారు.
  • పాకిస్తాన్‌లో రెండో అతిపెద్ద పౌర పురస్కారం ‘హిలాల్-ఇ-ఇమ్తియాజ్‌’ను అందుకున్నారు.
  • యూకేలోని బ్రాడ్‌ఫర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గానూ ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

దేశ రాజకీయాల్లో సైనిక జోక్యాన్ని ఇమ్రాన్ ఎప్పుడూ కొట్టి పారేయలేదు. మంచి పాలనతోనే పౌరులకూ సైన్యానికీ మధ్య ఉన్న సున్నితమైన బంధాన్ని నియంత్రించొచ్చని ఆయన చెబుతారు.

‘సరైన ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనతోనే బలమైన దేశం నిర్మితమవుతుంది. మన దేశ పాలనలో సైనిక ప్రమేయం అంతగా ఉండటానికి కారణం అత్యంత చెత్త పాలనను అందించిన ప్రభుత్వాలే. ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడే ఏదో ఒకటి వచ్చి చేరుతుంది. ఇక్కడ పాలనా లోపాల కారణంగానే సైన్యం ఆ స్థానాన్ని ఆక్రమించింది’ అని డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ చెప్పారు.

పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలపైనా ఖాన్ గతంలో కామెంట్ చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమని ఇమ్రాన్ ఆరోపించారు. ‘పాక్‌ను ఒంటరి చేయడమే మోదీ ప్రభుత్వ పాలసీ కావొచ్చు. వాళ్లు పాకిస్తాన్‌కు చాలా వ్యతిరేకం. కశ్మీర్‌లో వాళ్లు చేసే పనులకు పాక్‌ను నిందించాలన్నదే మోదీ ఉద్దేశం’ అని ఆయన అన్నట్లు డాన్ పత్రిక పేర్కొంది

‘సంక్షేమ ఇస్లాం రాజ్యాన్ని’ నిర్మిస్తామని హామీ ఇస్తూ ఇమ్రాన్ 2018 ఎన్నికల్లో బరిలో దిగారు. ఆయన ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘నయా పాకిస్తాన్’(ఆధునిక పాకిస్తాన్) అనే నినాదమే ప్రధానంగా కనిపిస్తుంది. అన్ని రంగాల్లోనూ సంస్కరణలు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.

పాకిస్తానీ యువతలో, సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ మంచి ఫాలోయింగ్‌ను సాధించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)