పాక్ ఎన్నికల్లో పదనిసలు: బిర్యానీ తినండి.. ఓటేయండి

ఫొటో సోర్స్, EPA
ఎన్నికలంటే ప్రచారం, పోలింగ్, లెక్కింపు, గెలిచాక సంబరాలే కాదు మరెన్నో సిత్రాలూ ఉంటాయి. పాకిస్తాన్ ఎన్నికల్లోనూ ఇలాగే ఎన్నో సిత్రాలను అక్కడి మీడియా బాహ్య ప్రపంచానికి తెలియచెప్తోంది.
పోలింగ్ పర్వంలోని ఆ పదనిసలను మీరూ చూడండి.
జెండా రంగుల్లో బ్యాలట్ పత్రాలు
పాకిస్తాన్లో ప్రస్తుతం పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రెండింటికీ రెండు వేర్వేరు రంగుల్లో బ్యాలట్ పత్రాలు ఉపయోగించారు. పార్లమెంటు అభ్యర్థులకు ఓట్లేసేవారు ఆకుపచ్చ రంగు బ్యాలట్, అసెంబ్లీ అభ్యర్థులకు ఓటేయడానికి తెల్లని బ్యాలట్ పేపర్లు ఉపయోగించారు. పాకిస్తాన్ జెండాలోనూ ఆ రెండు రంగులే ఉంటాయి.
తేనెటీగల దాడి.. తుర్రుమన్న ఎలక్షన్ సిబ్బంది
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న బహవాల్పూర్ పోలింగ్ స్టేషన్లో తేనెటీగలు ఎన్నికల సిబ్బందిని పరుగులు తీయించాయి. పలువురు ఓటర్లు కూడా తేనెటీగల దాడిలో గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. తేనెటీగల కారణంగా పోలింగ్‌కు అంతరాయమేర్పడిందని అక్కడి మీడియా తెలిపింది.
ఓటర్లకు బిర్యానీ
ఉదయం పోలింగ్ మొదలుకాగానే చాలా చోట్ల అభ్యర్థులు ఓటర్లకు, కార్యకర్తలకు అల్పాహారంగా బిర్యానీ అందించారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడానికి ముందే పెద్ద సంఖ్యలో ఓటర్లు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో బిర్యానీ ఆరగించడం కనిపించిందని 'సమా' టీవీ తెలిపింది. అవామీ ముస్లింలీగ్ నేత షేక్ రషీద్ తన మద్దతుదారులు, కార్యకర్తలకు బిర్యానీ పెట్టగా.. తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ నేత అలీంఖాన్ ఓటర్లకు బిర్యానీ పంచిపెట్టారు.
ఫొటో సోర్స్, Samma tv
పాకిస్తాన్లో పోలింగ్ రోజున బిర్యానీ ఏర్పాట్లు
పహిల్వాన్లకు 'ఎక్స్ట్రా మీల్స్'
కరాచీలోని పోలింగ్ సిబ్బంది కోసం పులావ్ సిద్ధం చేసి వడ్డించారు. గుజ్రన్‌వాలా, పంజాబ్ ప్రాంతాల్లోనూ పోలింగ్ స్టేషన్లలో, పోలింగ్ కేంద్రాల వద్ద పులావ్, బిర్యానీలు అందుబాటులో ఉంచారు. గుజ్రన్‌వాలాలో అయితే భారీగా సిద్ధం చేశారు. ఈ ప్రాంతం పహిల్వాన్లు, కుస్తీ యోధులకు ప్రసిద్ధిగాంచడంతో మిగతావారి కంటే వారు ఎక్కువ తింటారన్న ఉద్దేశంతో వారి కోసం ఇలా పెద్ద మొత్తంలో వంటలు చేశారని సమా టీవీ వెల్లడించింది.
గడ్డం.. ఓటుకు అడ్డం
సింధ్ ప్రావిన్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఒక ఓటరును ఎన్నికల సిబ్బంది అడ్డుకున్నారు. అందుకు కారణం గుర్తింపు కార్డుల్లోని ఫొటోకు, ఆయనకు ఏమాత్రం పోలిక లేకపోవడమే. గుర్తింపు కార్డులో క్లీన్ షేవ్‌తో ఉండగా పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు పెద్ద గడ్డంతో రావడంతో రెండింటికీ పోలిక కనిపించక అధికారులు ఆయన్ను ఓటేయకుండా అడ్డుకున్నారు.
ఫొటో సోర్స్, Samaa tv
దానమిచ్చేందుకు తీసుకెళ్తున్న మేకలు
ఎన్నికల కవరేజిలో ఎద్దులు, మేకలు
పాకిస్తాన్ ఎన్నికల కవరేజిలో ఎద్దులు, మేకలకూ స్థానం దక్కింది. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ 5 మేకలను దానమిచ్చాక కానీ ఓటయడానికి వెళ్లలేదట. దుష్టశక్తుల ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి తాను అలా చేసినట్లు ఆయన చెప్పారు.
హఫీజాబాద్లో ఓటేయడానికి వచ్చిన ఓ వ్యక్తి తనతో పాటు ఎద్దును కూడా తీసుకొచ్చాడని, కానీ, ఓటేయడానికి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేటప్పుడు దాన్ని అక్కడ కట్టేసి లోనికి వెళ్లకతప్పలేదని టీవీ ఛానళ్లు చూపించాయి.
మా ఇతర కథనాలు:
- భర్త పాకిస్తాన్లో, భార్య భారత్‌లో
- మరో 10వారాల్లో పాకిస్తాన్ ఖజానా ఖాళీ!
- బిహార్: 'సంరక్షణ గృహంలో 29 మంది బాలికలపై అత్యాచారం'
- పండరీపుర యాత్ర: 'ఈ ఒక్క నెలే మాకు స్వేచ్ఛ, ఇంటికెళ్తే మళ్లీ అవే భయాలూ, బాధలు, బాధ్యతలు’
- ఈ లక్షణాలు కనిపిస్తే, అది మధుమేహం కావొచ్చు... జాగ్రత్త!
- వచ్చేస్తోంది.. మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో
- శానిటరీ న్యాప్కిన్లపై జీఎస్టీ రద్దు వెనకున్నది ఈ అమ్మాయే
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)