భారతీయ మహారాజు కానుకగా ఇచ్చిన ఆవులు, ఎద్దులు బ్రెజిల్ దశ మార్చాయి. ఇలా..

  • 27 జూలై 2018
ఎద్దుతో రైతు, మహారాజు

బ్రెజిల్‌లోని పరాన రాష్ట్రంలోగల ఒక పశువుల షెడ్డులో ఇలాబెలా ఆవు ఉంటోంది. గర్భంతో ఉన్న ఈ ఆవుకు ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని దశాబ్దాల కిందట భారత్ నుంచి ఇక్కడకు వచ్చిన 'కృష్ణ' అనే గిర్ జాతి ఎద్దు వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆవు ఇది.

’కృష్ణ లేగదూడగా ఉన్నప్పుడు దాని ఫొటోను మా తాత సెల్సో గార్గియా సిద్ చూశారు. అది ఆయనకు ఎంతగానో నచ్చింది. అది భారతదేశంలోని భావ్‌నగర్ మహారాజు వజ్సుర్ ఖచర్‌కు చెందినది. మా తాత భారతదేశం వెళ్లి దాన్ని తీసుకొచ్చారు’ అని వివరించారు ఇలాబెలా ఆవు యజమాని రిలియర్మ సచెతిమ్.

మహారాజు, రైతు మంచి మిత్రులయ్యారు. రైతుకు ఐదు ఆవులు, మూడు ఎద్దుల్ని ఇచ్చి పంపించారు. అలా కృష్ణ అనే ఎద్దు బ్రెజిల్‌లో అడుగుపెట్టింది.

ఆ ఎద్దు 1961లో మరణించింది. దాన్ని అమితంగా ఇష్టపడే ఆ రైతు.. ఎద్దు కళేబరాన్ని ఎంబామ్ చేసి భద్రపరుచుకున్నారు.

బ్రెజిల్‌లోని 80శాతం గిర్ జాతి ఎద్దులు, ఆవుల్లో కృష్ణ రక్తం ఉన్నట్లు ఆ రైతు మనవడు రిలియర్మ చెబుతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: 1961 చనిపోయిన క‌ృష్ణ అనే ఈ ఎద్దు కళేబరాన్ని ఇప్పటికీ ఇలా భద్రపరిచారు

బయట కూడా వీటిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. మినాస్ జెరాయిస్ రాష్ట్రంలో ఓ పరిశోధన కేంద్రానికి మేం వెళ్లాం. గిర్ జాతి జన్యువులను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు.

కొన్ని దశాబ్దాలుగా గిర్ జాతి వీర్యం, అండాలు, పిండాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు.

‘‘గత 20 ఏళ్లలో పాల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. బ్రెజిల్‌లో నేడు 80శాతం పాలు గిరోలాండో జాతి ఆవుల నుంచి వస్తున్నాయి. గిర్, హోలిస్టీన్‌ల కలయిక ద్వారా గిరోలాండో వచ్చింది’’ అని పరిశోధకుడు మార్కోస్ ది సిల్వ చెప్పారు.

బ్రెజిల్‌లో గిర్ జాతి వల్ల భారీ స్థాయి వ్యాపారం జరుగుతోంది.

మినాస్ జెరాయిస్ రాష్ట్రంలోని పశువుల షెడ్డులో దాదాపు 2,200 గిర్ జాతి ఆవులున్నాయి.

మంచి ఆవు ధర సుమారు రూ.9 లక్షలు ఉంటుంది. ఒక్కో ఆవు సగటున రోజుకు 60 లీటర్ల పాలు ఇస్తుంది. కొన్ని ఆవులు దాదాపు 20 ఏళ్ల వరకు దూడలకు జన్మను ఇవ్వగలవు.

‘‘గిర్ జాతి అద్భుతమైనది. ఇక్కడి వాతావరణానికి బాగా అలవాటుపడింది. స్థానిక బ్యాక్టీరియాలు, వైరస్‌లను తట్టుకొని ఎక్కువ కాలం జీవిస్తున్నాయి’’ అని పశు వైద్యుడు లూయిజ్ ఫెర్నాండో తెలిపారు.

కొన్ని దశాబ్దాల కిందట గుజరాత్ నుంచి వచ్చిన గిర్ జాతి ఎద్దులు, ఆవులు అనేక దేశాల్లో కామధేనువులుగా మారాయి.

బ్రెజిల్‌లో చాలా మందికి ఇవి ఆదాయ వనరుగా కనిపిస్తోంటే, ఇతర దేశాల్లో ఆకలి తీర్చే అన్నపూర్ణగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు