కొలంబియా: కుక్కను చంపితే రూ. 50 లక్షలు.. తలకు వెల కట్టిన డ్రగ్ మాఫియా.. కుక్కకు భద్రత పెంచిన పోలీసులు

  • 28 జూలై 2018
కుక్క తలకు వెల Image copyright Colombian police
చిత్రం శీర్షిక సోంబ్రా పిల్లలతో స్నేహంగా ఉంటుందని దాని సంరక్షకురాలు చెబుతారు

కొలంబియాలో యాంటీ-నార్కోటిక్స్ పోలీసు దళానికి చెందిన ఒక కుక్క తలకు, డ్రగ్ మాఫియా సుమారు 50 లక్షల రూపాయల బహుమతి ప్రకటించింది.

సోంబ్రా (నీడ) అనే ఈ కుక్క తన విధుల్లో భాగంగా రికార్డు స్థాయిలో ఎన్నో టన్నుల మత్తు పదార్థాలను పట్టించింది. నిఘావర్గాల సమాచారం ప్రకారం ఉడాబెన్యాస్ డ్రగ్స్ గ్యాంగ్.. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ కుక్కపై 200 మిలియన్ కొలంబియా పెసో(సుమారు యాభై లక్షల రూపాయలు) బహుమతి ప్రకటించింది.

ఉడాబెన్యాస్‌ను కొలంబియాలోనే చాలా శక్తివంతమైన క్రిమినల్ ఆర్గనైజేషన్‌గా భావిస్తారు.

ప్రాణాలకు ప్రమాదం ఉండడంతో సోంబ్రాను ఇప్పుడు ముఠా ఉన్న ప్రాంతం నుంచి తప్పించి బగోటా విమానాశ్రయం విధుల్లో ఉంచారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వహించడం కుక్కకు సురక్షితమని భావిస్తున్నారు. కుక్క ప్రాణాలకు ఎలాంటి హానీ రాకూడదని యాంటీ-నార్కోటిక్స్ దళం దాన్ని భద్రంగా కాపాడుకుంటోంది. ఈ కుక్క విధులు నిర్వర్తించే సమయాల్లో అదనపు పోలీసు బలగాలను కూడా దీనితో పాటు పంపిస్తున్నారు.

ఆరేళ్ల వయసుగల సోంబ్రా ఉడాబెన్యాస్ ముఠాకు చెందిన పది టన్నుల కొకైన్ పట్టించింది. దాంతో ఈ కుక్కను చంపిన వారికి బహుమతి ఇస్తామని ఆ ముఠా ప్రకటించింది.

టర్బోతో పాటు పసిఫిక్ కోస్ట్ పోర్టులో సోంబ్రా విధులు నిర్వహించింది. టర్బో నగరం నుంచి స్పీడ్ బోట్స్, సబ్ మెరైన్ల ద్వారా మధ్య అమెరికా, యునైటెడ్ స్టేట్స్‌కు కొకైన్ స్మగ్లింగ్ చేసేవారు.

Image copyright Colombian police
చిత్రం శీర్షిక సోంబ్రా కౌంటర్-నార్కోటిక్స్ పోలీసులతో 300 ఆపరేషన్లలో పాల్గొంది

కారు భాగాలలో డ్రగ్స్ అక్రమ రవాణా

టర్బోలో 5.3 టన్నుల కొకైన్‌ను సోంబ్రా పట్టించింది. ఇటీవల కారు భాగాల్లో దాచి నాలుగు టన్నుల కొకైన్ విదేశాలకు పంపిస్తుంటే ఈ స్నిఫర్ డాగ్ దాన్ని కూడా పసిగట్టింది.

డ్రగ్స్ అక్రమ రవాణా ఉడాబెన్యాస్ ద్వారా జరిగేది. ఈ గ్యాంగ్‌ను గల్ఫ్ క్లాన్ అని కూడా అంటుంటారు.

గ్యాంగ్ చీఫ్‌ దయిరో ఆంతోనియో ఉసుగాను ఒతోనియెల్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. తను కొలంబియా మోస్ట్‌ వాంటెట్ లిస్టులో ఒకరు.

ఈ గ్యాంగ్ తమ దారికి అడ్డొచ్చిన వారిని చంపడానికి డబ్బులు ఆఫర్ చేయడం సర్వ సాధారణం.

2012లో గ్యాంగ్ కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు కొన్ని పోలీసులకు దొరికాయి. అందులో ఒక పోలీసును చంపిన ఎవరికైనా సరే 500 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.35 వేలు) వరకూ బహుమతి ప్రకటించినట్టు తెలిసింది.

సోంబ్రాను చంపటానికి 70 వేల అమెరికన్ డాలర్ల (సుమారు రూ.50 లక్షలు) భారీ మొత్తం నగదు బహుమతి ప్రకటించడానికి కారణం ఈ కుక్క ఉడాబెన్యాస్ ముఠాకు కలిగించిన ఆర్థిక నష్టాలే అని స్పష్టమవుతోంది.

సోంబ్రా చాలా చిన్నదిగా ఉన్నప్పుడే అది కౌంటర్-నార్కోటిక్స్ పోలీసు దళంలోకి వచ్చింది. అది ఇప్పటివరకూ డ్రగ్స్ అన్వేషణలో 245 మంది అనుమానితులను పోలీసులకు పట్టించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు