కొరియా యుద్ధం: చనిపోయిన 65 ఏళ్ల తర్వాత అస్థికల అప్పగింత

  • 28 జూలై 2018
1950లో ప్రారంభమైన కొరియా యుద్ధం 1953 జులై 27న ముగిసింది. Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1950లో ప్రారంభమైన కొరియా యుద్ధం 1953 జులై 27న ముగిసింది.

కొరియా యుద్ధ సమయంలో ప్రాణాలు కోల్పోయిన 55 మంది అమెరికా సైనికులవిగా భావిస్తున్న అస్థికలను ఉత్తరకొరియా అమెరికాకు అప్పగించింది. కొరియా యుద్ధం ముగిసి సరిగ్గా 65 ఏళ్లయిన సందర్భంగా వీటిని అప్పగించారు.

దక్షిణకొరియాలోని అమెరికా వైమానిక స్థావరం ఒసాన్‌కు వీటిని తీసుకొచ్చారు. ఆగస్టు 1న ప్రాథమిక పరీక్షలు, ఇతర లాంఛనాలు పూర్తిచేసి అమెరికాకు వాటిని తీసుకెళ్తారు. అమెరికా, ఉత్తరకొరియాల మధ్య దౌత్య సంబంధాలు మొదలవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య జూన్‌లో జరిగిన సమావేశంలోనే ఈ విషయంపై ఒప్పందం కుదిరింది.

ఈ అస్థికల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొరియా యుద్ధ మృతుల కుటుంబాలు తాజా పరిణామంతో సంతోషిస్తున్నాయి.

''మనం ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులకు ఏమైందో కూడా తెలియకుండా బతకడం కష్టం'' అని ఆ యుద్ధంలో కనిపించకుండాపోయిన సైనికుడి కుమార్తె ఒకరు 'బీబీసీ'తో చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక దక్షిణ కొరియాలోని అమెరికా వైమానిక స్థావరంలో అప్పగిస్తున్న అవశేషాలు

కాగా సింగపూర్‌లో జరిగిన ట్రంప్, కిమ్‌ల సమావేశంలో కొరియా ద్వీపకల్పాన్ని పూర్తి అణ్వస్త్ర రహితంగా మార్చే దిశగా పనిచేయడానికి అంగీకారం కుదిరింది. అయితే ఉత్తరకొరియా ఎప్పటిలోగా అణ్వాయుధాలను త్యజించాలనే విషయంలో స్పష్టత లోపించిందన్న విమర్శలున్నాయి.

జూన్‌లో జరిగిన ఇద్దరు దేశాధ్యక్షుల సమావేశం అనంతరం చేసిన ప్రకటనలోని నాలుగు అంశాల్లో ఈ యుద్ధ మృతుల అస్థికల అప్పగింత అంశం కూడా ఉంది.

ప్రస్తుతం అప్పగించిన అస్థికలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి నిర్ధారించాల్సి ఉంది. దీనికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

మరోవైపు ఇవి ఆ యుద్ధంలో కనిపించకుండాపోయిన అమెరికా సైనికులవేనన్న నమ్మకమేమీ లేదని.. ఫోరెన్సిక్ పరీక్షల తరువాతే నిర్ధారణ అవుతుందని... ఆ యుద్ధ మృతుడి కుమారుడు జాన్ జిమ్మర్లీ బీబీసీతో అన్నారు.

కొరియా యుద్ధ సమయంలో శత్రుసేనలకు చెందినవారి అస్తికలుగా వీటిని ఉత్తరకొరియా భద్రపరిచిఉండొచ్చు.. అంతమాత్రాన వీరంతా అమెరికా సైనికులే అనుకోలేమని ఆయన అంటున్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక అవశేషాలు తీసుకొస్తున్న వాహనాలకు సెల్యూట్ చేస్తున్న అమెరికా సైనికులు

1950లో ప్రారంభమైన కొరియా యుద్ధం 1953 జులై 27న ముగిసింది.

ఈ యుద్ధంలో దక్షిణకొరియాకు మద్దతుగా అమెరికాకు చెందిన 3,26,000 మంది సైనికులు పోరాడారు.

వీరిలో వేలాది మంది ఏమయ్యారో తెలియలేదు. సుమారు 5,300 మంది అమెరికా సైనికులు ఉత్తర కొరియాలో యుద్ధం చేస్తూ కనిపించకుండాపోయారు. ఇప్పటికీ వారికి సంబంధించిన వివరాలు తెలియవు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionట్రంప్-కిమ్ సదస్సు: చరిత్రాత్మక కరచాలనం ఇదే

ఇంతకుముందు 1990, 2005 మధ్య 229 మంది అస్థికలను అప్పగించారు. కానీ, అణ్వాయుధాల వివాదంతో అమెరికా, ఉత్తరకొరియా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించడంతో ఈ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు