పాకిస్తాన్: ఈ అమ్మాయి 24 ఏళ్లకే ఎంపీ అయ్యారు

  • 28 జూలై 2018
పాకిస్తాన్ ఎన్నికలు మహిళల విజయం Image copyright TWITTER/FACEBOOK

మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ పార్లమెంట్‌లో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. జులై25న ఓటింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అధికారిక ఫలితాల ప్రకటన ఇంకా కొనసాగుతోంది.

అయితే, ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని పీటీఐ( పాకిస్తాన్ తెహ్రీక్ -ఈ- ఇన్సాఫ్) అతి పెద్ద పార్టీగా అవతరించింది.

క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ ప్రధాని అయ్యే అవకాశాలుండటం ఒక విషయం అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో అత్యధిక మంది మహిళా అభ్యర్థులు పోటీపడటం మరో ముఖ్య అంశం.

2017లో తెచ్చిన చట్టం ప్రకారం పాకిస్తాన్‌లోని పార్టీలన్నీ ఎన్నికల్లో 5 శాతం టికెట్లను మహిళలకు కేటాయించాలి.

ఈ కారణంతోనే తాజా ఎన్నికల్లో 171 మంది మహిళలు వివిధ పార్టీల నుంచి బరిలో దిగారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అత్యధికంగా 19 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా, ఎంఎంఏ పార్టీ 14 మందికి, పీటీఐ 11 మందికి టికెట్లు ఇచ్చింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఇమ్రాన్ ఖాన్

దేశ చరిత్రలో ఇదే తొలిసారి

2013 ఎన్నికల్లో 135 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది.

ఇక్కడ అలీ బేగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పురుషుల ఆధిక్యత ఎక్కువగా ఉన్న గిరిజన ప్రాంతం నుంచి పోటీ చేసిన ఏకైక గిరిజన మహిళ ఈమె.

ఎన్నికల్లో మహిళలకు టికెట్ల కేటాయింపుపై చట్టం చేయడంతో అన్ని పార్టీలు తమ ప్రతినిధులుగా వారిని ఎన్నికల బరిలో నిలుపుతున్నాయి.

అయితే, బలహీనమైన నియోజకవర్గాల్లోనే తమకు పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని మహిళలు అంటున్నారు.

కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మహిళలు విజయం సాధిస్తున్నారు.

Image copyright FACEBOOK
చిత్రం శీర్షిక మోహసిన్

జుగ్ను మోహిసిన్

పంజాబ్ ప్రావిన్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి జుగ్ను మోహిసిన్ గెలుపొందారు. ఈమె పాకిస్తాన్‌లోని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి నజమ్ సేథి భార్య.

నజమ్ సేథి ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

జుగ్ను మోహిసిన్ రాజకీయవేత్త మాత్రమే కాదు, జర్నలిస్టు కూడా. ‘ది ఫ్రై డే టైమ్స్’ పత్రిక సహా వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు.

నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆమె భర్త నజమ్ సేథిని అరెస్టు చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. అప్పటికి జుగ్ను పాత్రికేయురాలిగానే ఉన్నారు.

సేథి అరెస్టు తరువాత జుగ్ను వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

Image copyright TWITTER/ZARTAJ GUL
చిత్రం శీర్షిక గుల్

జరతజ్ గుల్

పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థిగా దక్షిణ పంజాబ్ నుంచి జరతజ్ గుల్ గెలుపొందారు.

పాకిస్తాన్ ముస్లిం లీగ్‌కు చెందిన సర్దార్ ఓవైసీని ఆమె ఓడించారు.

తన గెలుపు అనంతరం పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

జరతజ్ గుల్ 1994 నవంబర్‌లో ఫట్వా ప్రావిన్స్‌లో జన్మించారు. ఆమె తండ్రి వాజీర్ అహ్మద్ ప్రభుత్వ అధికారి.

పీపీపీ పార్టీలో క్రియాశీల సభ్యురాలిగా ఉన్న శ్మాస్ ఉన్ నిసా తన సీటును నిలబెట్టుకున్నారు.

వరుసగా రెండోసారి థటా ప్రాంతం నుంచే పోటీ చేసి గెలుపొందారు. 2013లోనూ ఆమె ఇక్కడి నుంచే పోటీ చేశారు.

Image copyright FACEBOOK/NA225
చిత్రం శీర్షిక ఫామిదా మిర్జా

డాక్టర్ ఫామిదా మిర్జా

నేషనల్ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఫామిదా మిర్జా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సింధ్ ప్రావిన్స్ నుంచి మరోసారి గెలుపొందారు. గ్రాండ్ డెమొక్రటిక్ అలియెన్స్ (జీడీఏ) నుంచి ఆమె పోటీ చేశారు.

వరుసగా ఐదు పర్యాయాలు ఒకే స్థానం నుంచి పాకిస్తాన్ పార్లమెంట్‌కు ఎన్నికవుతూ ఆమె రికార్డు సృష్టించారు.

1997లో మొదటిసారిగా ఆమె పీపీపీ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు.

జూన్‌లోనే ఆమె పీపీపీని వీడి జీడీఏ తరఫున బరిలోకి దిగారు.

పాకిస్తాన్‌లో ఎన్నికలను పరిశీలిస్తే మహిళల ప్రాతినిధ్యం ప్రతిసారీ పెరుగుతూనే ఉంది.

దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యానికి చాలా చరిత్ర ఉంది.

బెనజిర్ భుట్టో దేశ ప్రధానిగా పనిచేయగా, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్, మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ దేశంలోని ముఖ్యమైన పదవులు చేపట్టారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)