కళ్ల ముందే బాయ్ ఫ్రెండ్ చనిపోతుంటే వీడియో తీసిన ‘స్నాప్‌చాట్‌ రాణి’

  • 29 జూలై 2018
స్నాప్‌చాట్ Image copyright Metpolice

ప్రేమికుడు రక్తపు మడుగులో పడి చనిపోతే ఓ యువతి వీడియో తీసి 'స్నాప్‌చాట్‌'లో పెట్టింది.

రెండేళ్ల కిందట లండన్‌లోని నార్త్ అక్టన్‌లో జరిగిన ఈ సంఘటన కోర్టు విచారణ సందర్భంగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఫాతిమా ఖాన్(21), ఖలీద్ సఫీ(18)లు ప్రేమికులు. రెండేళ్లుగా వారిద్దరికి పరిచయం ఉంది.

2016 డిసెంబర్‌లో నార్త్ అక్టన్‌లో రజా ఖాన్ అనే వ్యక్తి సఫీపై దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలు కావడంతో సఫీ అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ ఘటన జరుగుతుంటే అక్కడే ఉన్న ఫాతిమా ఖాన్ ప్రేమికుడిని కాపాడాల్సింది పోయి వీడియో తీసి అభ్యంతరకర మెసేజ్‌తో స్నాప్‌చాట్‌లో పోస్ట్ చేశారు.

Image copyright Metpolice
చిత్రం శీర్షిక 2016 డిసెంబర్‌లో సఫీ ఖలీద్ హత్యకు గురయ్యారు

స్నాప్ చాట్‌లో పెట్టిన వీడియో 24 గంటల తర్వాత దానంతట అదే డిలీట్ అవుతుంది. అయితే, ఫాతిమాను స్నాప్‌చాట్‌లో అనుసరిస్తున్న ఆమె స్నేహితులు ఆ వీడియోను సేవ్ చేయడంతో అదిప్పుడు కోర్టుకు కీలకంగా మారింది.

మంగళవారం ఓల్డ్ బెయిలే కోర్టులో ఈ హత్య కేసు విచారణకు రాగా, ధర్మాసనం 10-1 ఆధిక్యంతో ఫాతిమా నేరం చేసినట్లు పేర్కొంది.

కోర్టు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ కేట్ బెక్స్ క్యూసీ వాదనలు వినిపిస్తూ,

''తనకు సఫీ అడ్డుగా ఉన్నాడని భావించి అతడ్ని చంపేందుకు ఫాతిమా పథకం ప్రకారం హత్య చేయించారు'' అని చెప్పారు.

ఖాన్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ, ''హత్య ఘటనను వీడియో తీసి స్నాప్ చాట్‌లో పెట్టడంపై ఫాతిమా సిగ్గుపడుతున్నట్లు చెప్పారు'' అని కోర్టుకు నివేదించారు.

జులై 30న అంటే సోమవారం ఫాతిమాకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

Image copyright Metpolice
చిత్రం శీర్షిక రజా ఖాన్ ఆచూకీ ఇంకా తెలియడం లేదు

'డిజిటల్' హత్య

కోర్టులో విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం.. సఫీ, ఫాతిమాల ప్రేమ వ్యవహారం వారి కుటుంబ సభ్యులకు తెలియదు. ఈ నేపథ్యంలో ఖలీద్ సఫీ ముందస్తు సమాచారం లేకుండా ఒక రోజు ఫాతిమా ఇంటికి వచ్చారు.

ఆమెకు ఒక వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. అయితే, చెప్పకుండా ఇంటికి వచ్చాడనే ఆగ్రహంతో ఫాతిమా ఆ వాచ్‌ను బయటకు విసిరేశారు. ప్రేమ వ్యవహారం ఇంట్లోవాళ్లకు తెలియడంతో ఆందోళన చెందారు.

సఫీ తీరు నచ్చక అతడ్ని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తన మాజీ ప్రియుడు రజా ఖాన్‌ను కలిశారు.

ముందే వేసుకున్న పథకం ప్రకారం ఫాతిమా ఒక రోజు తాను పనిచేసే విజిలంట్ సెక్యూరిటీ కార్యాలయం సమీపంలోని కోస్టా కాఫీ షాపుకి సఫీని తీసుకొచ్చారు.

అదే సమయంలో ఓ మినీ క్యాబ్‌లో అక్కడికి వచ్చిన రజా ఖాన్.. సఫీపై కత్తితో దాడికి దిగారు. అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో వారిద్దరి దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

ఛాతితో సహా చాలా చోట్ల కత్తిపోట్లకు గురవడంతో సఫీ అక్కడికక్కడే చనిపోగా, రజా ఖాన్ చిన్న గాయాలతో అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియరాలేదు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)