అమెరికా: 2014 తర్వాత వేగవంతమైన వృద్ధి రేటు సాధించిన ఆర్థిక వ్యవస్థ

  • 29 జూలై 2018
ట్రంప్ Image copyright Getty Images

నాలుగేళ్ల తర్వాత అమెరికా ఆర్థిక వృద్ధి వేగవంతమైంది. అధికారిక గణాంకాల ప్రకారం రెండో త్రైమాసికంలో వార్షిక రేటు 4.1 శాతానికి విస్తరించింది.

కొత్త వ్యాపార సుంకాలు ఎదుర్కొనేందుకుగాను.. వినియోగదారులు భారీగా ఖర్చు చేయడం, ఎగుమతులు హఠాత్తుగా పెరగడంతో లాభాలు వచ్చాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని అద్భుత వృద్ధి అంటూ అభివర్ణించారు. పరిపాలనలో తన విధానాలు పనిచేస్తున్నాయని ఇది నిరూపించిందన్నారు.

కానీ చాలా మంది విశ్లేషకులు మాత్రం రాబోవు నెలల్లో ఈ వృద్ధి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

వృద్ధికి కారణం ఏంటి

రెండో త్రైమాసికంలో వినియోగదారుల వ్యయం 4 శాతం పెరిగినట్టు జులై 27వ తేదీ శుక్రవారం విడుదలైన వాణిజ్య విభాగం నివేదిక తెలిపింది. అంతకు ముందు మూడు నెలల కంటే ఇది 0.5 శాతం పెరిగింది.

ఎగుమతులు కూడా 9 శాతానికి పైగా పెరిగాయి. 2013 నాలుగో త్రైమాసికం తర్వాత అత్యంత వేగవంతమైన వృద్ధిరేటు నమోదైంది ఈ సారే.

జీడీపీ లాభాలకు ఇది ఒక శాతానికిపైగా దోహదపడుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. సోయాబీన్స్ లాంటి వాటిపై కొత్త వాణిజ్య పన్నుల నుంచి బయటపడాలని రైతులు అనుకోవడం కూడా లాభాలకు ఒక కారణం.

జులైలో అమెరికా, చైనాలు ఒకరి ఎగుమతులపై మరొకరు 34 బిలియన్ డాలర్ల మేర పన్నులు విధించాయి. ఉక్కు, అల్యూమియంపై అమెరికా పన్నులు విధించడంతో.. అమెరికా ఎగుమతులపై కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్‌లు కొత్త పన్నులు వేశాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ ఏడాది పన్నుల్లో భారీగా కోత, వ్యాపార సంస్థలు, వినియోగదారులు భారీగా ఖర్చు చేయటం వల్ల వృద్ధిరేటు పెరిగిందని, వచ్చే ఏడాది ఇవి లేకపోతే వృద్ధిరేటు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు

ఇది అద్భుతమేనా?

అమెరికా ఆర్థిక రంగం వార్షిక వృద్ధి 2012-2017 సంవత్సరాల మధ్య సగటున 2.2 శాతం మేర ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అరికట్టేందుకు, పాలనా యంత్రాంగం చాలా చర్యలు తీసుకుంది.

ఆర్థికవ్యవస్థ వృద్ధికి వైట్ హౌస్ మరింత కష్టపడాల్సి ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

కొత్త పన్నుల కోతలు, సడలింపులు, ప్రభుత్వ వ్యయాన్ని పెంచటం, వాణిజ్య సంప్రదింపులు కొనసాగించటం తమకు మేలు చేసిందని ఆయన చెప్పారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు తాజా నివేదిక చెబుతోంది. అయితే, గతంలోనూ కొన్ని సంవత్సరాల్లో వ‌ద్ధి రేటు వేగంగా ఉంది. ఉదాహరణకు 2014 రెండో త్రైమాసికంలో 5.1 శాతం, మూడో త్రైమాసికంలో 4.9 శాతం మేరకు పెరిగింది.

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 రెండో త్రైమాసికంతో పోలిస్తే.. ఏప్రిల్-జూన్‌లో ఆర్థిక వృద్ధి 2.8 శాతం పెరిగింది.

కనిపించేది ఏంటి?

2018లో జీడీపీ వృద్ధి 3 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరగడం తాను చూడాలనుకుంటున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

2005 నుంచి మొత్తం ఏడాదిలో అమెరికా 3 శాతానికి పైగా జీడీపీ వృద్ధిని చూడలేదు. కానీ ఆర్థిక వేత్తలు మాత్రం పెరిగిన ప్రభుత్వ వ్యయం, 1.5 ట్రిలియన్ పన్నుల కోత వల్లే ఈ ఏడాదిలో ఇది పెరిగిందని చెబుతున్నారు. వ్యాపార సంస్థలు, వినియోగదారులు మరింత ఖర్చు చేసేందుకు అవి కారణం అయ్యాయని తెలిపారు.

వచ్చే ఏడాది ఈ పన్ను కోతలు, ఖర్చులు లేకపోతే వృద్ధి రేటు మళ్లీ క్షీణిస్తుందని, ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)