ఇండోనేసియాలో తీవ్ర భూకంపం: పర్యాటక దీవి లంబోక్‌లో 14 మంది మృతి

  • 29 జూలై 2018
ఇండోనేసియా భూకంపం Image copyright Reuters
చిత్రం శీర్షిక భూకంపంతో చాలా భవనాలు దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇండోనేషియాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాన్ని తీవ్ర భూకంపం కుదిపేసింది. 14 మంది మృతి చెందారు.

మధ్య ఇండోనేసియాలోని లంబోక్ దీవిలో ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.00 గంటల (భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటల) ముందు 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది.

పర్యాటకుల్ని అత్యధికంగా ఆకర్షించే బాలీకి తూర్పుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లంబోక్ దీవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తోంది.

తీవ్ర భూకంపంతో దీవిలో ఉన్న చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.

ఉత్తర లంబోక్‌లోని మటరం నగరానికి 50 కిలోమీటర్లు ఈశాన్యంగా భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియాలజికల్ సర్వే చెప్పింది.

భూకంపం తర్వాత 60కి పైగా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వీటిలో అత్యధికంగా 5.7 తీవ్రత నమోదైంది.

"భూ ప్రకంపనల్లో 40 మంది గాయపడ్డారు, పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి" అని దేశ డిజాస్టర్ ఏజెన్సీ ప్రతినిధి సుటోపో పర్వో నుగ్రోహో తన ప్రకటనలో తెలిపారు.

"ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే మేం ఇంకా గణాంకాలు సేకరించలేదు" అని ఆయన తెలిపారు.

"ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై దృష్టి పెట్టాం. గాయపడ్డవారు కొంతమంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు."

కూలిన భవనాలు, వీధుల్లో నిండిన శిథిలాలతో ఆయన కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు.

భూకంపం రాగానే అందరూ పరుగులు తీశారని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

"భూకంపం చాలా బలంగా వచ్చింది. మా ఇంట్లో ఉన్న అందరం భయపడిపోయాం. అంతా బయటకు పరిగెత్తాం. మా పక్కింటి వాళ్లు కూడా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. హఠాత్తుగా కరెంటు పోయింది" అని చెప్పారు.

రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న ఇండోనేసియాలో భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

పసిఫిక్ మహా సముద్రం చుట్టూ భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను, అగ్ని పర్వతాలు పేలే ప్రదేశాలను రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు.

ప్రపంచంలో సముద్ర మట్టానికి పైన ఉన్న క్రియాశీల అగ్నిపర్వతాల్లో సగానికి పైగా ఈ రింగ్ లోనే ఉన్నాయి.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)