అప్పుడు బంగారం వేట.. ఇప్పుడు కోబాల్ట్ రష్
- నటాలీ షెర్మన్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
డీఆర్సీలో కోబాల్ట్ గనులు
ఒకప్పుడు అమెరికాలోని పశ్చిమ ప్రాంతం బంగారాన్ని అన్వేషించే వారిని ఆకర్షించేది. ఇప్పుడు సరిగ్గా కోబాల్ట్ కూడా అలాగే అందరినీ ఆకర్షిస్తోంది.
అందుకే అమెరికా మైనింగ్ కంపెనీలు ఇడాహో, మోంటానా, అలస్కాలో నీలం రంగులో మెరిసే ఈ ఖనిజం కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నాయి.
అమెరికాలో కోబాల్ట్ మైనింగ్ ఎప్పుడూ భారీస్థాయిలో జరగలేదు.
కానీ కోబాల్ట్‌కు ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే లిథియమ్-అయాన్ బ్యాటరీలలో కోబాల్టే ప్రధానమైనది.
ఫొటో సోర్స్, Getty Images
హెటిరోజెనైట్ - కోబాల్ట్ దీని నుంచే ఉత్పత్తి అవుతుంది
గతంలో రాగి, నికెల్లను వెలికి తీసేటప్పుడు కోబాల్ట్ ఒక ఉప ఉత్పత్తిగా ఉండేది.
కానీ క్రమంగా కోబాల్ట్ ధరలు పెరిగాయి. దాని వినియోగం ఏటా 8 నుంచి 10 శాతం పెరుగుతోంది. కోబాల్ట్ ఇప్పుడు ఒక ఉప ఉత్పత్తి స్థాయి నుంచి దానికదే ప్రధాన ఖనిజంగా మారింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 300 కంపెనీలు కోబాల్ట్ కోసం అన్వేషిస్తున్నాయని లండన్‌కు చెందిన పరిశోధనా సంస్థ సీఆర్‌యూ వెల్లడించింది.
ప్రముఖ మైనింగ్ సంస్థ గ్లెన్‌కోర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ)లో తన ఉత్పత్తిని పెంచుతోంది.
ప్రపంచంలోనే అత్యధికంగా కోబాల్ట్ లభించేది డీఆర్సీలోనే. ప్రపంచంలో మొత్తం కోబాల్ట్ ఉత్పత్తిలో 60 శాతం అక్కడే జరుగుతోంది.
ఫొటో సోర్స్, First Cobalt
అమెరికాలో కోబాల్ట్ ఉత్పత్తి మొదట 2014లో ప్రారంభమైంది.
కెనడాకు చెందిన ఫస్ట్ కోబాల్ట్ అనే సంస్థ ఇడాహోలో కోబాల్ట్ ఖనిజ సేకరణ ప్రారంభించి, మూడేళ్లలో దానిని అభివృద్ధి చేసింది.
2011లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 75 వేల టన్నుల కోబాల్ట్‌ను వినియోగిస్తే, సీఆర్‌యూ అంచనా ప్రకారం ఈ ఏడాది కోబాల్ట్ వినియోగం 1.22 లక్షల టన్నులు దాటిపోయే అవకాశం ఉంది.
కోబాల్ట్ ధర కూడా 2011లో పౌండ్‌కు రూ.1372 ఉండగా, అది నేడు సుమారు 2 వేలకు చేరింది.
ప్రస్తుతం కోబాల్ట్ ఉత్పత్తి డిమాండ్‌కు తగినట్లుగానే ఉన్నా, 2022 నాటికి డిమాండ్ ఉత్పత్తిని దాటి పోతుందని భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
శుద్ధి చేయడానికి ముందు దశలో కోబాల్ట్
కోబాల్ట్ ఏ విధంగా సేకరిస్తారు?
గనుల్లోంచి నుంచి పేలుడు పదార్థాల ద్వారా కోబాల్ట్ ముడి ఖనిజాన్ని సేకరిస్తారు. దానిని శుద్ధి చేసి, లోహంగా మార్చి ఇతర లోహాలతో కలిపి జెట్ ఇంజెన్లు, డ్రోన్లు, బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు.
కోబాల్ట్ ఉత్పత్తిలో డీఆర్సీ మొదటి స్థానంలో ఉన్నా, రిఫైన్డ్ కోబాల్ట్ ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. యూరప్‌లో, ఉత్తర అమెరికాలో, ఆసియాలో సరికొత్త ఉత్పత్తిదారులు పుట్టుకొస్తున్నా చైనా మాత్రం రిఫైన్డ్ కోబాల్ట్ ఉత్పత్తిలో తన ఆధిక్యతను కొనసాగిస్తోంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కోబాల్ట్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అమెరికా తన కోబాల్ట్ దిగుమతులపై ఆందోళన చెందుతోంది.
అయితే ట్రంప్ స్వదేశీ విధానాల వల్ల కోబాల్ట్‌ను వెలికి తీసే ప్రక్రియకు అనుమతులు వేగంగా మంజూరు అవుతాయని అమెరికా సంస్థలు ఆశిస్తున్నాయి.
ప్రస్తుతం మిస్సోరి కోబాల్ట్ అనే సంస్థ మాడిసన్ కౌంటీ నుంచి కోబాల్ట్‌ను ఉత్పత్తి చేసే యోచనలో ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 35 మిలియన్ పౌండ్లను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకసారి ఉత్పత్తి ప్రారంభమైతే ఉత్తర అమెరికాలో ఇదే అతిపెద్ద కోబాల్ట్ ఉత్పత్తి కేంద్రంగా మారుతుంది.
ఫొటో సోర్స్, Getty Images
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మట్టి, రాళ్ల నుంచి కోబాల్ట్‌ను సేకరిస్తున్న మహిళ
అయితే అమెరికా కోబాల్ట్ పరిశ్రమను చాలా సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గనుల తవ్వకానికి అయ్యే ఖర్చు వాటిలో ప్రధానమైనది. కోబాల్ట్ ధరల్లో ఒడిదుడుకులు మరో సమస్య.
అంతే కాకుండా కోబాల్ట్ ధరల పెరుగుదలతో దానికి ప్రత్యామ్నాయాలను కనుగొనే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కోబాల్ట్‌ను తక్కువగా ఉపయోగించుకొనే బ్యాటరీలను కనుగొనే ప్రయత్నాల్లో ఉంది.
అయితే అలాంటి టెక్నాలజీ కనిపెట్టడానికి కనీసం పదేళ్లు పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతవరకు కోబాల్ట్ రష్ కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్)