జింబాబ్వే ఎన్నికలు: ‘అణచివేత అడ్డుగోడలను బద్దలుకొట్టడానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు’

  • 30 జూలై 2018
మహిళా ఓటరు Image copyright AFP

రాబర్ట్ ముగాబే పదవీచ్యుతుడయ్యాక జింబాబ్వేలో జరిగిన మొదటి ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఎన్నికలు.. గతం తాలూకు అణచివేత అడ్డుగోడలను బద్దలుకొట్టడానికి జింబాబ్వేకి దొరికిన అవకాశం అని విదేశీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఈ అధ్యక్ష ఎన్నికల్లో.. ఎమర్సన్ నంగాగ్వా, నెల్సన్ చామిసాల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే.. ప్రతిపక్ష నేత చామిసాపై అధికార పార్టీ నేత నంగాగ్వా స్వల్ప ఆధిక్యత సాధిస్తారని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.

ఇది ఇలా ఉండగా, ఆదివారం నాడు మాజీ అధ్యక్షుడు ముగాబే మాట్లాడుతూ.. ఒకప్పుడు తనకు మిత్రుడిగా ఉన్న నంగాగ్వాకు ఎట్టిపరిస్థితుల్లో ఓటు వేయబోనని అన్నారు. ఆఫ్రికా రాజకీయాల్లో అత్యంత బలవంతుడైన తనను, నంగాగ్వా.. గత నవంబర్ నెలలో పదవీచ్యుతుడిని చేశాడని, అందుకు సైన్యం సాయం తీసుకున్నాడని ముగాబే అన్నారు.

ఈ ఎన్నికలు భిన్నమైనవి

బీబీసీ ప్రతినిధి ఫమ్జా ఫిలాని ఈ ఎన్నికల గురించి తన మాటల్లో ఏమన్నారంటే..

రాజధాని హరారేకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ప్రాథమిక పాఠశాలను పోలింగ్ కేంద్రంగా మార్చారు. సూర్యోదయం కంటే ముందుగానే ప్రజలు ఓటు వేయడానికి బారులు తీరారు. వారెంతో సరదాగా మాట్లాడుతూ, నవ్వుతూ ఉన్నారు. అక్కడున్న వారిలో ఎక్కువ మంది వయసు పైబడినవారే. యువకులు కొందరే ఉన్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటి ఎన్నికల వాతావరణం చాలా భిన్నంగా ఉంది. గతంలో ఓటర్లు భయం భయంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం ఇక్కడ ఆశాజనక వాతావరణం కనిపిస్తోంది.

''ఈ ఎన్నికలు భిన్నమైనవి. ఎక్కడా హింస చెలరేగలేదు. ఇది ఓ శుభపరిణామం'' అని ఒక ఓటరు అన్నారు. ''ఇన్నాళ్లు మేం చాలా అనుభవించాం. మేము కోరుకునేదల్లా ఒకటే.. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి'' అని మరో ఓటరు నాతో అన్నారు.

Image copyright AFP

ప్రతిపక్ష పార్టీకి చెందిన 40ఏళ్ల చామిసా తన ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు రాగానే ఆయనకు మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

''ఈ ఎన్నికల్లో మేం తప్పకుండా గెలుస్తాం. ఇది కచ్చితం'' అని చామిసా బీబీసీతో అన్నారు. మరోవైపు.. 75ఏళ్ల నంగాగ్వా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్వేక్వే నగరంలోని ఓ పోలింగ్ బూత్‌కు వచ్చారు.

ఓటు వేయడానికి లోనికి వెళ్లిన ఆయన.. ఒక దశలో, తాను ఓటు వేయాల్సింది ఎక్కడో పోలింగ్ బాక్స్ బయటకు తల పెట్టి, బ్యాలెట్ పేపర్‌ను ఒకటికి రెండు సార్లు పరిశీలించారు.

''ఈ ఎన్నికల్లో నేను మునిగిపోతానో.. లేక ప్రజలతో కలిసి ఈ నదిని దాటేస్తానో కానీ, జింబాబ్వే ప్రజలు మాత్రం శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి'' అని ట్వీట్ చేశారు.

Image copyright Reuters

ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నవారిలో దాదాపు సగం మంది 35 సంవత్సరాల లోపువారే.

ఎన్నికలు సజావుగా సాగేందుకు వందలాది మంది అంతర్జాతీయ పరిశీలకులను రంగంలోకి దింపారు. కానీ ప్రతిపక్షం మాత్రం.. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను భయపెడుతున్నారని, బ్యాలెట్ పేపర్ల రక్షణ పట్ల కూడా తమకు అనుమానాలున్నాయని ఆరోపిస్తోంది.

అయితే.. తాము చట్టానికి లోబడి ఉన్నామని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించామని జింబాబ్వే ఎన్నికల కమిషన్ తెలిపింది.

90% పోలింగ్ బూత్‌లు సకాలంలోనే తెరుచుకున్నాయని ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారి తెలిపారు.

''ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాయంకాలం 7గంటలకు (స్థానిక సమయం ప్రకారం) పోలింగ్ ప్రక్రియను ముగిస్తామని భావిస్తున్నా'' అన్నారు.

అభ్యర్థుల గురించి మీకు తెలుసా?

Image copyright AFP

ఎమర్సన్ నంగాగ్వా - 'జాను-పీఎఫ్ పార్టీ'

  • తన రాజకీయ చతురత కారణంగా నంగాగ్వాను ‘క్రొకొడైల్’(మొసలి) అని పిలుస్తారు.
  • 2008 ఎన్నికల అనంతరం, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులపై దాడులు చేసినట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి.
  • వయసు బహుశా 75 సంవత్సరాలు. ఎన్నికల సందర్భంగా ఉద్యోగాలు ఇస్తానన్నది ఈయన ప్రధాన హామీ. ఆర్థిక సంస్కరణల పట్ల సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
  • తనపై జరిగిన పలు హత్యాయత్నాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ నంగాగ్వా.. ఆ దాడులు చేసింది ముగాబే మనుషులేనని ఆరోపించారు.
Image copyright Reuters

నెల్సన్ చామిసా - 'ఎండీసీ కూటమి'

  • 2007లో స్టేట్ సెక్యూరిటీ ఏజెంట్లు తనపై దాడి చేసిన ఘటనలో చామిసా తలకు తీవ్ర గాయమైంది.
  • 25 ఏళ్లకు ఎంపీ అయ్యారు. 31ఏళ్లకు మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తన 40 ఏళ్లలో అత్యంత పిన్నవయస్కుడిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినవారవుతారు.
  • ఈమధ్యకాలంలో పాస్టర్‌గా అర్హత సాధించిన చామిసా.. ‘గాడ్ఈజ్ఇన్ఇట్’ (దేవుడు ఇందులోనే ఉన్నాడు) అన్న హ్యాష్‌ట్యాగ్‌ను తన ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు.
  • దేశంలో కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తానని చామిసా హామీ ఇచ్చారు. కానీ జింబాబ్వేలో ఒలింపిక్స్ నిర్వహిస్తానని, దేశానికి హైస్పీడ్ బుల్లెట్ రైలు తీసుకొస్తాను అంటూ చామిసా చేసిన మితిమీరిన హామీలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి.

అంతర్జాతీయ పరిశీలకులు ఏమంటున్నారు?

‘ఓటు వేయడానికి బారులు తీరిన జనాన్ని చూస్తుంటే.. వారు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో లాగా ఎలాంటి బెరుకు వారిలో కనిపించడం లేదు’ అని.. అమెరికాకు చెందిన నేషనల్ డెమొక్రటిక్ ఇన్‌స్టిట్యూట్ తరపున ఎన్నికలను పరిశీలిస్తున్న లైబీరియా మాజీ అధ్యక్షుడు ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ బీబీసీతో అన్నారు.

Image copyright AFP

''జింబాబ్వే ప్రజలకు ఇది ఓ ఉద్వేగభరితమైన సందర్భం. తమ ఓటుతో దేశ గతిని మార్చే సమయమిది'' అన్నారు.

యూరోపియన్ యూనియన్ చీఫ్ అబ్జర్వర్ ఎల్మార్ బ్రోక్ మాట్లాడుతూ.. ''పారదర్శకంగా, విశ్వసనీయతతో జరిగే ఎన్నికలు జింబాబ్వేకు చాలా కీలకం'' అన్నారు.

అమెరికా, యూరోపియన్ యూనియన్ పరిశీలకులను జింబాబ్వే ఎన్నికలను పర్యవేక్షించేందుకు అనుమతివ్వడం గత 16 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి.

ఇతర దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పేందుకు, పతనమైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం కోసం.. నంగాగ్వానే విదేశీ పరిశీలకులను ఆహ్వానించారు.

మాజీ అధ్యక్షుడు ముగాబేకు పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలు లేవు. తనను అధ్యక్ష స్థానం నుంచి కూలదోయడానికి విదేశాలు కుట్రపన్నుతున్నాయన్నది అప్పట్లో ముగాబే ఆరోపణ.

Image copyright Getty Images

ముగాబే ప్రభావం ఏమేరకు ఉంది?

94ఏళ్ల ముగాబేకు ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన యువతతో సంబంధాలు లేవు. జింబాబ్వే జన్మించడానికి సిద్ధంగా ఉంది.. అని బీబీసీ ప్రతినిధి తెలిపారు.

తన భార్య గ్రేస్ ముగాబే, కూతురుతోపాటుగా హరారే నగరంలో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో తనకు కాకుండా ఇతరులకు ఓటెయ్యడం ముగాబేకు ఇదే తొలిసారి.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా ఉన్నపుడు అధికారాన్ని తన భార్య గ్రేస్ ముగాబేకు కట్టబెట్టేందుకు తాను ప్రయత్నించానన్న ఆరోపణలను మరోసారి ఖండించారు.

ఈ ఎన్నికల్లో తనను వేధించిన వారికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయనని ముగాబే అన్నారు. అధ్యక్ష ఎన్నికలు.. సైనిక పాలనను తరిమిగొట్టి, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని తిరిగి తీసుకొస్తాయని భావిస్తున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో చామిసా పట్ల సానుకూలతను, నంగాగ్వా పట్ల ప్రతికూలతను తెలియజేశారు.

ముగాబే వ్యాఖ్యలపై నంగాగ్వా స్పందిస్తూ.. ‘ఆయన ప్రతిపక్షాలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారు’ అని ఆరోపించారు.

''ముగాబే, చామిసా.. ఇద్దరూ చేతులు కలిపారని అందరికీ అర్థమైంది. దేశాన్ని మారుస్తానని, జాతిని తిరిగి నిర్మిస్తానన్న చామిసా మాటలను ఇక నమ్మలేం..'' అని నంగాగ్వా తెలిపారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: జింబాబ్వే ఇంత అధ్వాన స్థితిలో ఉండడానికి కారణమేంటి?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం