కరణ్ థాపర్: ‘మోదీ ముఖంలో కోపం, అడ్వాణీ కళ్లలో నీళ్లు, భుట్టో చూపులో ప్రేమ.. అన్నీ చూశా’

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
కరణ్ థాపర్

‘పెళ్లికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదంటున్నారు కదా, మరి ఆ పని చేయడానికి మీరు సిద్ధమా?’ ఇది భారతదేశానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్, పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టోను అడిగిన ప్రశ్న.

నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. కరణ్ థాపర్ 1977లో బ్రిటన్‌లో చదువుకునేప్పుడు కేంబ్రిడ్జ్ యూనియన్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ యూనియన్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

వీళ్లిద్దరూ అంతకు కొన్ని నెలల ముందే కలుసుకున్నారు.

‘‘నాకిప్పటికీ బాగా గుర్తు. ఓసారి బేనజీర్ ఒక మీటింగ్‌లో పాల్గొనేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వచ్చారు. అప్పుడు ఆమె మాట్లాడుతూ, ‘పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనడంలో ఎలాంటి తప్పూ లేదనే అంశంపై మనం ఎందుకు చర్చించకూడదు?’ అని నాతో అన్నారు. పాకిస్తాన్‌లాంటి దేశంలో రాజకీయ నేతగా ఎదగాలని కోరుకునే బేనజీర్ లాంటి మహిళ, అలాంటి విషయం గురించి మాట్లాడటం నిజంగా సాహసమే.

ఆమె అడిగినట్లుగానే ఆ అంశంపైన చర్చ జరిగింది. అందులో నేను మాట్లాడుతూ, ‘పెళ్లికి ముందు సెక్స్‌‌లో పాల్గొనడం తప్పు కాదంటున్నారు కదా, మరి నిజ జీవితంలో మీరు ఆ పని చేయడానికి సిద్ధమా?’ అని బేనజీర్‌ను అడిగా. ఆ ప్రశ్న వింటూనే చుట్టూ ఉన్నవాళ్లంతా చాలా సేపు చప్పట్లు కొట్టారు.

వాళ్లు చప్పట్లను ఆపే వరకూ బేనజీర్ మాట్లాడలేదు. ఆ తరవాత ఆమె కళ్ల జోడు తీసేసి, నేరుగా నా కళ్లలోకి చూసి మాట్లాడుతూ.. ‘కచ్చితంగా సిద్ధమే.. కానీ మీతో మాత్రం కాదు’ అని బదులిచ్చారు’’ అంటూ నాటి ఘటనను థాపర్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

‘నువ్వు దుష్ట భారతీయుడిగా మిగిలిపోతావు’

ఓసారి ఈస్టర్ సెలవుల్లో కరణ్‌ థాపర్‌కు బేనజీర్ భుట్టో నుంచి ఫోనొచ్చింది. అప్పుడు ఇద్దరూ యూనివర్సిటీ యూనియన్లకు అధ్యక్షులుగానే ఉండేవారు. ‘నేను మా ఫ్రెండ్‌ అలీసియాతో కలిసి కొన్నాళ్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉండొచ్చా?’ అని బేనజీర్, కరణ్ థాపర్‌ను అడిగారు.

సెలవులు కావడంతో హాస్టల్లో చాలామంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. దాంతో అక్కడికి వచ్చి ఉండటానికి తనకు అభ్యంతరం లేదని థాపర్ బేనజీర్‌తో చెప్పారు.

‘‘బేనజీర్ తన ఫ్రెండ్‌తో కలిసి కొన్ని రోజులు మా యూనివర్సిటీలో ఉన్నారు. ఆమె వెళ్లిపోయే చివరి రోజున మా అందరికీ తన చేత్తోనే చాలా మంచి భోజనాన్ని వండి పెట్టారు. తరవాత అందరం కాఫీ తాగుతుంటే, ఆమె ఐస్‌క్రీం తిందామని చెప్పి తీసుకెళ్లారు. తన చిన్న కారులోనే అందరం ఇరుక్కొని వెళ్లాం. యూనివర్సిటీలోనే ఆమె ఐస్‌క్రీం తినడానికి తీసుకెళ్తుందనుకున్నా. కానీ ఆమె కారును లండన్‌వైపు మళ్లించింది. రాత్రి పది గంటలకు ఐస్‌క్రీం తినడానికి లండన్ వెళ్లి, మళ్లీ అర్ధరాత్రి ఒంటిగంటకు తిరిగి యూనివర్సిటీకి వచ్చాం.

మరుసటి రోజు ఉదయం ఆమె ఆక్స్‌ఫర్డ్‌కు తిరిగి వెళ్లేముందు నాకొక ఆడియో రికార్డును ఇచ్చారు. అందులో ‘యు ఆర్ మోర్ దెన్ ఏ నంబర్ ఇన్ మై లిటిల్ రెడ్ బుక్’ అనే పాట ఉంది. ‘నేను నీకు ఈ రికార్డు ఇచ్చినట్టు నువ్వు అందరికీ డప్పు కొట్టి చెబుతావని నాకు తెలుసు. ఒకవేళ నువ్వలా అందరికీ చెబితే మాత్రం నా దృష్టిలో నువ్వొక దుష్ట భారతీయుడిగా ఉండిపోతావు’ అని బేనజీర్ నాతో నవ్వుతూ అన్నారు’’ అంటూ థాపర్ నాటి సంఘటనను వివరించారు.

ఫొటో సోర్స్, AFP

‘అందుకే కౌగిలించుకోలేదు’

చదువు పూర్తయ్యాక థాపర్ జర్నలిస్ట్ అయ్యారు. మొదట లండన్‌లోనే ‘ది టైమ్స్’లో ఆ తరువాత ‘ఎల్‌డబ్ల్యుటీ’ టీవీలో రిపోర్టర్‌గా చేశారు.

బేనజీర్‌ను పాకిస్తాన్‌ నుంచి బయటకు పంపినప్పుడు ఆమె లండన్‌కే తిరిగొచ్చారు. థాపర్, బేనజీర్‌ల స్నేహం, చదువు ఆ తరువాత కూడా కొనసాగింది. ‘‘ఒకసారి బేనజీర్ ఫోన్ చేసి ‘నన్ను మీ ఇంటికి ఎందుకు పిలవవు?’ అని అడిగారు. ఆ తరవాత నుంచి తను మా ఫ్లాట్‌కు తరచూ వచ్చేవారు.

నా భార్య నిషకు కూడా బేనజీర్ బాగా దగ్గరయ్యారు. ఓ రోజు మేం ముగ్గురం మా బాల్కనీలో కూర్చొని చాలా సేపు వైన్, సిగరెట్ తాగుతూ మాట్లాడుకున్నాం. అప్పట్లో బేనజీర్‌ కూడా సిగరెట్ తాగేవారు. వైన్ కూడా మేం ఎక్కువగా తాగడంతో నేను కారులో తనని ఇంటి దగ్గర దింపడం అంత మంచిది కాదని ఆమె అన్నారు.

పోలీసులెవరైనా ఆ పరిస్థితిలో మమ్మల్ని చూసినా అది మరుసటి రోజు పత్రికల్లో హెడ్‌లైన్‌గా మారుతుందని చెప్పారు. దాంతో ఆమె క్యాబ్‌ని బుక్ చేసుకున్నారు. వెళ్తూ వెళ్తూ ఆమె నా భార్యను హత్తుకున్నారు. కానీ, నాకు మాత్రం చేయి ఊపి టాటా చెప్పారు. అంతకు ముందు నాకు ఎప్పుడు వీడ్కోలు చెప్పినా ఆప్యాయంగా హత్తుకునేవారు.

అందుకే, నాకది కాస్త కొత్తగా అనిపించింది. నా చూపును గమనించిన బేనజీర్ నా దగ్గరకు వచ్చి.. ‘ఆ క్యాబ్ డ్రైవర్ పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిలానే కనిపిస్తున్నాడు. నేను ముస్లిం దేశానికి చెందిన పెళ్లి కాని యువతిని. అందుకే, అతడి ముందు నేను నా చనువును ప్రదర్శించలేకపోయాను’ అని మెల్లగా చెవిలో చెప్పారు’’ అంటూ తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి థాపర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

సంజయ్‌తో స్నేహం

కేంబ్రిడ్జ్‌లో చదువుకోవడానికి వెళ్లక ముందు నుంచే సంజయ్ గాంధీ, కరణ్ థాపర్‌లు స్నేహితులు.

నిజానికి సంజయ్, థాపర్ అక్క శోభకు ఫ్రెండ్. ఆమె కోసం తరచూ ఇంటికి వస్తూ థాపర్‌కు కూడా సంజయ్ దగ్గరయ్యారు. ‘స్కూల్ అయ్యాక రోజూ సంజయ్ మా ఇంటికొచ్చేవారు. అతడు పెద్దగా మాట్లాడేవాడు కాదు. టీ అంటే సంజయ్‌కు చాలా ఇష్టం. అది తప్ప మరేదీ తాగేవాడు కాదు.

మా అక్క పెళ్లయ్యాక కూడా సంజయ్ మా ఇంటికి వస్తుండేవారు. వచ్చినప్పుడల్లా మా అమ్మ అతనితో చిన్న చిన్న వస్తువుల రిపేర్లు చేయించేది. అతడు కింద కూర్చొనే వాటిని బాగు చేసిపెట్టేవాడు. సంజయ్‌కు పార్టీలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కుక్కలు, గుర్రాలంటే అతడికి చాలా ఇష్టం. ఓసారి నన్ను కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకొని విమానం నడిపారు.

ఆ రోజు పొలాల్లో రైతులను సరదాగా ఆటపట్టిద్దామని సంజయ్ విమానాన్ని వాళ్లవైపు నడిపించారు. వాళ్లు భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. కాసేపటికి మళ్లీ విమానాన్ని ఆయన పైకి తీసుకెళ్లారు. విమానం నడపడం అంటే అతడికి చాలా సరదా’ అని సంజయ్‌తో తన అనుబంధాన్ని థాపర్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

రేఖ గురించి అమితాబ్‌ను థాపర్ ఏం అడిగారు?

థాపర్ లండన్ నుంచి తిరిగి భారత్‌కు వచ్చాక అమితాబ్‌ను ఇంటర్వ్యూ చేశారు. తాను మరచిపోలేని ఇంటర్వ్యూల్లో అదీ ఒకటంటారు థాపర్.

‘‘అమితాబ్‌కు 50 ఏళ్లు వచ్చిన సందర్భంగా ఓ పెద్ద ఇంటర్వ్యూ చేశాం. ‘పెళ్లయ్యాక మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా?’ అని అమితాబ్‌ను అడిగా. దానికి ఆయన తడబడకుండా ‘లేదు’ అని జవాబిచ్చారు.

నేను మళ్లీ ‘రేఖను కూడా ఇష్టపడలేదా?’ అని అడిగా. దానికి ఆయన మళ్లీ లేదనే సమాధానమిచ్చారు. ‘అమితాబ్ నిజమే చెబుతున్నారంటారా?’ అని నేను పక్కనే కూర్చున్న ఆయన భార్య జయ బాధురిని అడిగా.

‘నా భర్తపై నాకు పూర్తి నమ్మకముంది’ అని ఆమె చెప్పారు. కానీ, మా సంభాషణ అక్కడితో ఆగలేదు. ఇంటర్వ్యూ అయ్యాక అమితాబ్ నన్ను భోజనానికి పిలిచారు.

మేం ముగ్గురం డైనింగ్ రూమ్‌కు వెళ్లాం. భోజనానికి కూర్చోగానే ‘అన్నం తింటారా?’ అని జయ అమితాబ్‌ను అడిగారు. ‘నేను అన్నం తినను’ అని అమితాబ్ కోపంగా బదులిచ్చారు.

‘రోటీ రావడానికి టైం పడుతుంది. ఈలోపు అన్నం తింటారా?’ అని జయ మళ్లీ అడిగారు. ‘నేనెప్పుడూ అన్నం తిననని నీకు తెలుసు కదా’ అని అమితాబ్ మరింత కోపంగా జవాబిచ్చారు.

నేను అడిగిన ప్రశ్నలకు అమితాబ్‌కు కోపం వచ్చిందని, దాన్ని అప్పుడు డైనింగ్ టేబుల్‌ దగ్గర బయటకు తీస్తున్నారని నాకు అర్థమైంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఆ సమయంలో ఆయనతో కలిసి భోజనం చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఆ పదిహేను నిమిషాలూ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా తినేశాం.

మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లగానే, అమితాబ్ ప్రేమకు సంబంధించిన ప్రశ్నలను ఇంటర్వ్యూ నుంచి తొలగించమని మా బాస్ శోభనా భార్తియా నాతో చెప్పారు. దాంతో నాకు విషయం అర్థమైంది’ అని అమితాబ్ ఇంటర్వ్యూ గురించి థాపర్ చెప్పారు.

వీడియో క్యాప్షన్,

జయకు కోపం వచ్చిన వేళ

జయలలితకు కోపం వచ్చిన వేళ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో ఇంటర్వ్యూను కూడా తాను ఎప్పటికీ మరచిపోలేనని థాపర్ చెబుతారు.

చాలా రోజులు వెంటబడితే కానీ జయలలిత ఇంటర్వ్యూకు ఒప్పుకోలేదు. తీరా ఒప్పుకున్నాక, అందులో అడిగిన ప్రశ్నలు ఆమెకు చాలా కోపం తెప్పించాయి.

‘‘జయలలిత ముందు ఓ పుష్పగుచ్ఛాన్ని పెట్టారు. అది ఎందుకు పెట్టారో మొదట నాకు అర్థం కాలేదు. ఆమె ఆ బొకే చాటున ఉన్న కొన్ని పేపర్లను చూస్తూ జవాబులు చెప్పాలనుకున్నారని నాకు తరువాత తెలిసింది. అయితే, ముందే ఆ విషయం తెలియకపోవడంతో నేను వాటిని తీసేయమని చెప్పాను. అది నా తప్పే.

దానికి జయ బదులిస్తూ, ‘నేను మీ కళ్లలోకి నేరుగా చూస్తూ జవాబులు చెబుతాను, అడగండి’ అన్నారు. ఒక దశలో ఈ ఇంటర్వ్యూకు ఒప్పుకొని తప్పు చేశానని ఆమె చెప్పారు. ఇంటర్వ్యూ పూర్తవగానే ఆమె వైపు చేయి జాపి, ‘మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రిగారు’ అన్నా. కానీ జయ మాత్రం, ‘మిమ్మల్ని కలవడం నాకు అస్సలు బాలేదు. నమస్తే’ అంటూ కోపంగా మైక్ తీసేసి గదిలో నుంచి బయటకు వెళ్లిపోయారు’’ అని ఆ ఇంటర్వ్యూ గురించి వివరించారు థాపర్.

ఫొటో సోర్స్, PTI

అడ్వాణీ సీక్రెట్ మీటింగ్ - కళ్లలో నీళ్లు

భారత్‌లో పాకిస్తాన్ హై కమిషనర్‌గా 2000 సంవత్సరం మొదట్లో అష్రాఫ్ జహంగీర్ ఖాజీ నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన భారత ఉప ప్రధాని ఎల్‌.కె. అడ్వాణీకి దగ్గరవ్వాలని అనుకున్నారు.

వాళ్లిద్దరినీ దగ్గర చేసే బాధ్యత థాపర్‌పైనే పడింది. ‘ఓ రోజు రాత్రి 10 గంటల సమయంలో నేను అష్రాఫ్‌ను కార్లో కూర్చోబెట్టుకొని అడ్వాణీ ఇంటికి తీసుకెళ్లా. వాళ్ల సమావేశం దాదాపు గంటన్నరపాటు సాగింది. ఆ తరవాత 18నెలల కాలంలో వాళ్లిద్దరూ ఇలానే రహస్యంగా కనీసం 20-30 సార్లు కలిశారు.

ఆ తరవాత 2001లో ప్రభుత్వం జనరల్ ముషారఫ్‌ను భారత్‌కు ఆహ్వానించింది.

ఓ రోజు ఉదయం 6.30 సమయంలో నాకో పోన్ వచ్చింది. అడ్వాణీ లైన్లో ఉన్నారు. ‘ముషారఫ్ వార్త గురించి నీకు తెలిసే ఉంటుంది. మా రహస్య సమావేశాల వల్లే అది సాధ్యమైందని మీ ఫ్రెండ్‌కు చెప్పండి’ అంటూ అష్రాఫ్ గురించి చెప్పారు.

కానీ 2002లో జమ్మూ దగ్గర కాలూచక్ హత్యాకాండ జరిగిన అనంతరం అష్రాఫ్ జహంగీర్‌ను తిరిగి పాకిస్తాన్‌కు పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

అష్రాఫ్ పాకిస్తాన్‌ వెళ్లడానికి ఒక్కరోజు ముందు అడ్వాణీ భార్య కమల నాకు ఫోన్ చేశారు. అష్రాఫ్‌ను ఆయన భార్యను ఒక్కసారి టీ తాగడానికి తమ ఇంటికి తీసుకురావడం కుదురుతుందా అని ఆమె అడిగారు.

ఓ పక్క ప్రభుత్వం ఆ వ్యక్తిని దేశం నుంచి బయటకు పంపిస్తుంటే, మరోపక్క ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్న అడ్వాణీ అదే వ్యక్తిని తమ ఇంటికి ఆహ్వానించడం ఆశ్చర్యం కలిగించింది.

నేను వెంటనే అష్రాఫ్‌ను తీసుకొని అడ్వాణీ ఇంటికెళ్లా. టీ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాం. అష్రాఫ్ బయల్దేరడానికి సిద్ధమవుతూ అడ్వాణీకి షేక్‌హ్యాండ్ ఇవ్వబోయారు. కానీ కమల కల్పించుకొని ఇద్దరినీ ఆలింగనం చేసుకోమని సూచించారు. వాళ్లిద్దరూ మొదట ఆశ్చర్యపోయినా, తరవాత ఆమె చెప్పినట్లే చేశారు. అష్రాఫ్ తిరిగి వెళ్లేప్పుడు అడ్వాణీ కళ్లు నీళ్లతో నిండిపోవడం నేను చూశాను’ అంటూ ఆ రోజు జరిగిన విషయాలను థాపర్ పంచుకున్నారు.

కరణ్‌కు తన టై బహుకరించిన ముషారఫ్

1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్ హైజాక్ అయిన కొన్ని వారాల తరవాత జనరల్ పర్వేజ్ మషారఫ్, కరణ్ థాపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.

థాపర్ ఆ ఇంటర్వ్యూను దూరదర్శన్‌ కోసం చేయాలి. అందుకే, అది కాస్త దూకుడుగానే ఉండాలని థాపర్‌కు ఆదేశాలందాయి.

‘ఆ ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే నేను ముషారఫ్‌పైన మాటల దాడి మొదలుపెట్టా. ఆయన కూడా అదే స్థాయిలో జవాబిస్తూ వచ్చారు. మధ్యలో బ్రేక్ సమయంలో వాతావరణాన్ని కాస్త తేలిక పరిచే ఉద్దేశంతో ‘మీ టై చాలా బాగుంది’ అని ముషారఫ్‌తో చెప్పా. ఆ పొగడ్త ఆయనకు బాగా నచ్చింది. అందుకే ఇంటర్వ్యూ పూర్తవగానే ఆ టైను నా చేతిలో పెట్టారు.

నేను వద్దని ఎంత చెప్పినా వినకుండా, ‘ఈ క్షణం నుంచి ఈ టై నీదే’ అని చెప్పారు. ‘మీరిలా బాగున్నాయని చెప్పినవన్నీ ఇస్తానంటే మీటైకి ఉన్న బంగారు పిన్‌ బావుందని చెప్పేవాడిని’ అని నేను అన్నా.

దానికి.. ‘నా షూ బావున్నాయని చెప్పినా కూడా ఇచ్చేసేవాణ్ణి’ అని ముషారఫ్ బదులిచ్చారు’ అని థాపర్ చెప్పుకొచ్చారు.

ఫొటో క్యాప్షన్,

2007నాటి ఇంటర్వ్యూలో మోదీ

మోదీ మాట్లాడటం మానేశారు

2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ కూడా తన ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారని థాపర్ గుర్తు చేసుకున్నారు.

''నాకు గుర్తున్నంత వరకూ నేను మోదీని అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే.. ‘మీరు ముఖ్యమంత్రిగా ఉండగా రెండోసారి జరిగే ఎన్నికలకు కేవలం ఆరు వారాలే గడువుంది. ఇండియా టుడే, రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లు మిమ్మల్ని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా గుర్తించాయి. కానీ, వేలాది మంది ముస్లింలు మిమ్మల్నో హంతకుడిగా చూస్తున్నారు. ఇప్పుడు మీ ముందు ఏదైనా ఇమేజ్ ప్రాబ్లం ఉందా?' అని. దానికి మోదీ జవాబిస్తూ.. చాలా కొద్ది మందే తనని అలా చూస్తారనీ, ఎక్కువ శాతం ఆ దృష్టితో చూడరని చెప్పారు'' అని థాపర్ వివరించారు.

థాపర్ మళ్లీ ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ, మోదీని ఆ దృష్టితో చూసే వారి సంఖ్య మరీ తక్కువేం కాదని అన్నారు. 'సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మిమ్మల్ని ఆధునిక నీరోగా అభివర్ణించారు. చిన్నపిల్లలు, అమాయక మహిళల హత్యలు జరుగుతున్నప్పుడు ముఖాన్ని పక్కకు తిప్పుకున్న వ్యక్తిగా పేర్కొన్నారు కదా' అని థాపర్ అన్నారు.

దానికి మోదీ బదులిస్తూ, తనను హంతకుడిగా భావించేవారు కూడా సంతోషంగా ఉండాలని అన్నారు. ఆ తరువాత ఆయన థాపర్‌ను మంచినీళ్లు అడిగారు.

'మంచినీళ్లు మోదీ పక్కనే ఉన్నాయి. మంచినీళ్లు కేవలం ఒక సాకేనని, మోదీ ఇంటర్వ్యూను ముగించాలని అనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఆ వెంటనే ఆయన మైక్ తీసేసి ఇంటర్వ్యూను ముగించేశారు' అని థాపర్ గుర్తుచేశారు.

'ఇంటర్వ్యూ ఆపేశాక కూడా మోదీ నాతో బానే మాట్లాడారు. టీ, స్వీట్లు లాంటివి తెప్పించారు. కానీ ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వలేదు. దాదాపు గంటసేపు ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేశా. అయినా కుదరకపోవడంతో అక్కడి నుంచి వచ్చేశా' అని థాపర్ చెప్పారు.

ఆ రోజు సాయంత్రం మోదీ నాకు ఫోన్ చేసి, ‘మనం స్నేహితులుగా ఉందాం. నేను దిల్లీకి వచ్చినప్పుడు కలిసి భోంచేద్దాం’ అన్నారు. కానీ ఆ తరువాత ఆయన నా మొహం చూడలేదు. 2017 తరువాత మొత్తం బీజేపీ నాయకులంతా నాతో మాట్లాడటం మానేశారు’ అని కరణ్ వివరించారు.

(కరణ్ థాపర్ రచించిన ‘డెవిల్స్ అడ్వకేట్’ పుస్తకం ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆయన బీబీసీ ప్రతినిధి రేహాన్ ఫజల్‌తో మాట్లాడారు.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)