బంగారం, వజ్రాల గనులున్నా.. ఈ దేశంలో పేదరికం పోవట్లేదు

ప్రపంచంలో విలువైన ఖనిజ సంపద కలిగిన దేశాల్లో కాంగో ఒకటి. ఆ సహజ వనరులను బట్టి చూస్తే అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉండాల్సింది. కానీ.. అలా లేదు. ఇప్పటికీ దేశంలో అనేకమంది దారిద్ర్య రేఖకు దిగువన బతుకెళ్లదీస్తున్నారు. నిత్యం భయాందోళనతో గడుపుతున్నారు. ఎందుకు?

చరిత్రలో లక్షలాది మంది జీవితాలను 'పెద్దలు' ఎలా చిన్నాభిన్నం చేశారో చెప్పడానికి ఈ దేశమే అతిపెద్ద ఉదాహరణ.

ఈ దేశంలో అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి.

బంగారం, వజ్రాలు, రాగి, యురేనియంతో పాటు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, జెట్ విమానాల ఇంజిన్ల తయారీలో వాడుతున్న కోబాల్ట్.. కోల్టాన్ లాంటి ఖనిజాల గనులు ఇక్కడ దండిగా ఉన్నాయి.

ఇక్కడి మట్టిలో దాగి ఉన్న ఖనిజ సంపద విలువ దాదాపు 24 ట్రిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా.

ఇంత విలువైన సహజ వనరులు ఉన్నా.. ఇక్కడి ప్రజలు ఇప్పటికీ పేదరికంలోనే మగ్గిపోవడానికి కారణం ఏమిటో తెలియాలంటో శతాబ్దాల చరిత్రలోకి తొంగిచూడాలి.

వలస పాలనలో కోట్ల మంది చనిపోయారు

19, 20 శతాబ్దాల్లో సాగిన బెల్జియన్ల వలస పాలనలో ఇక్కడ దాదాపు కోటి మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

కాంగో విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర్య సమర యోధుడు ప్యాట్రిస్ లుముంబా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు.

1960 జూన్ 30న కాంగోకు స్వాతంత్ర్యం వచ్చింది. లుముందా ప్రధానిగా, జోసెఫ్ కసవుబు అధ్యక్షుడిగా ప్రభుత్వం ఏర్పడింది.

కానీ.. బెల్జియన్లు దాన్ని జీర్ణించుకోలేదు. కొన్ని రోజులకే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులను ఉసిగొల్పారు. ఖనిజ సంపద దండిగా ఉండే తూర్పు కాంగోలో తిరుగుబాటును ప్రోత్సహించారు.

దాంతో సోవియట్ యూనియన్ సాయం కోరిన లుముంబాను హత్య చేసేందుకు సీఐఏతో కలిసి బెల్జియం కుట్ర పన్నింది.

1961 ఫిబ్రవరిలో ఆయన్ను ఉరితీశారు.

పదేళ్లు సాగిన యుద్ధంలో 50 లక్షల మంది మృతి

అనంతరం మూడు దశాబ్దాల పాటు(1965- 1997) సైన్యాధ్యక్షుడు మొబుటు సాగించిన పాలనలో అవినీతి రాజ్యమేలింది.

మరోవైపు.. పొరుగున ఉన్న రువాండాలో హింసాకాండ చెలరేగడంతో లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకుని కాంగో వచ్చారు.

అయితే కాంగోలోనూ వారిని యుద్ధం వెంటాడింది. కాంగో అధ్యక్షుడు మొబుటును గద్దె దించేందుకు రువాండా, యుగాండాలు తిరుగుబాటును ప్రోత్సహించాయి. పదేళ్లపాటు జరిగిన ఆ యుద్ధంలో 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఆ తర్వాత కాంగోలో కబిలా కుటుంబం అధికారం చేపట్టింది. ఏం జరిగినా.. ఇక్కడి సంపద కోసమే.

రూ.5,000 కోట్ల సంపద లూటీ

టెక్నాలజీ రంగంలో బూమ్‌ మొదలయ్యాక.. కాంగోలో దొరికే కోల్టాన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం అనేక సంస్థలు గాడ్జెట్ల తయారీ కోసం అత్యంత చవగ్గా దొరికే ఇక్కడి కోల్టాన్‌నే దిగుమతి చేసుకుంటున్నాయి.

2001 నుంచి జోసెఫ్ కబిలా కాంగో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పాలనా కాలంలో రూ. 5000 కోట్ల విలువైన ఖనిజ సంపద లూటీ అయినట్టు మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ దేశంలో 70 శాతానికి పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. మహిళలపై లైంగిక హింస అత్యధికంగా ఉన్న దేశాల్లో కాంగో ఒకటి.

ఫొటో క్యాప్షన్,

కాంగో అధ్యక్షుడు కబిలా

మరోవైపు.. కాంగో రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేదు. కానీ.. ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్ కబిలా మాత్రం ఆ పరిమితి దాటిపోయినా ఇంకా పదవిలో కొనసాగుతున్నారు.

అధ్యక్ష పదవి నుంచి ప్రశాంతంగా వైదొలగాలని ఆయనకు ఈ ఏడాది జనవరిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ కోరారు.

ఇంకా ఆయన అలాగే పదవిని పట్టుకుని వేలాడుతారా? లేక ఎన్నికలు నిర్వహిస్తారా? అని దేశం వేచిచూస్తోంది. ప్రస్తుతం 7.8 కోట్ల మంది భవితవ్యం డోలాయమానంలో ఉంది.

ఎవరు పదవిలో ఉన్నా.. విస్తారంగా ఉన్న సహజ వనరులను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించినప్పుడే ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది.

(రచయిత: ఫెర్గల్ కీనె, బీబీసీ ఆఫ్రికా ఎడిటర్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)