అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు

ప్రేమ జంట

ఫొటో సోర్స్, Thinkstock

ఫొటో క్యాప్షన్,

ప్రేమ సందేశాల కొత్త చిరునామా

నవ దంపతులు తమ ప్రేమను అంతరిక్షంలోనూ ప్రదర్శించుకునే వినూత్న అవకాశం కల్పిస్తామని జపాన్‌కు చెందిన ఓ సంస్థ చెబుతోంది. వధూవరుల పేర్లు, ప్రేమ సందేశాలు రాసిన ఫలకాలను అంతరిక్షంలోకి తీసుకు వెళ్లి వదిలే సేవలను ప్రారంభిస్తున్నామని తెలిపింది.

జపాన్‌లోని త్సుకుబా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు ప్రారంభించిన 'వార్ప్ స్పేస్' అనే స్టార్టప్ సంస్థ ఈ సేవలను ప్రారంభిస్తోందని జపనీస్ పత్రిక యోమియురి శింబున్ పేర్కొంది.

16 మిల్లీ మీటర్ల పొడవు, 8 మిల్లీ మీటర్ల వెడల్పు ఉండే టిటానియం ఫలకాల మీద నవ దంపతుల పేర్లను, ప్రేమ సందేశాలను రాసి ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్తామని సంస్థ నిర్వాహకులు వివరించారు.

ఆ ఫలకాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నుంచి వ్యోమగాములు బయటకు వదిలిపెడతారు. అంతేకాదు, వాటిని విడిచి పెడుతున్నప్పుడు ఫొటోలు తీసి ఆ దంపతులకు పంపిస్తారు.

ఇక అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలతో పాటే ఈ ఫలకాలు కూడా కక్ష్యలో తిరుగుతాయి.

అవసరమైతే ఆ ఫలకాల పరిమాణాన్ని పెంచుతామని కూడా నిర్వాహకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్,

ప్రణయ సందేశాల సేవలను 2019లో ప్రారంభించనున్నవార్ప్ స్పేస్

అంతరిక్ష సందేశం ఖరీదు రూ. 18,543

ఈ సేవలు అందించేందుకు 'వార్ప్ స్పేస్' సంస్థ జపాన్‌‌కు చెందిన ప్రయోగాత్మక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (కిబో)తో కలిసి పనిచేస్తోంది.

2019లో తొలిసారిగా ఫలకాలను పంపించనున్నట్టు వార్ప్ స్పేస్ సంస్థ తెలిపింది. ఒక్కో ఫలకానికి 30,000 యెన్‌లు(రూ. 18,543) చార్జి చేస్తారట.

అయితే, తొలుత ప్రత్యేకంగా త్సుకుబా నగరంలోని ఒకురా ఫ్రాంటియర్ హోటల్‌లో పెళ్లి చేసుకున్న దంపతులకు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నారు. అందులోనూ 2019 ఫిబ్రవరి లోగా వివాహం చేసుకున్నవారికి మాత్రమే ఆ అవకాశం ఇస్తున్నారు.

ఒక్కోసారి కొన్ని వందల ఫలకాలను ఆ ఉపగ్రహం ద్వారా తీసుకెళ్లవచ్చని సంస్థ చెబుతోంది.

కొంత జంటలకు చిరకాల జ్ఞాపకం మిగిల్చాలన్న ఆలోచనతో ఇలా చేస్తున్నామని వార్ప్ స్పేస్ అధ్యక్షులు తోషిహిరో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)