మాజీ గర్ల్ ఫ్రెండ్, మాజీ బాయ్ ఫ్రెండ్ : బంధాలపై గతాల నీలినీడలు

ప్రేమ సంబంధాలు

గర్ల్‌ఫ్రెండ్‌కి సంబంధించిన గత లైంగిక అనుభవాల గురించి మితిమీరిన ఆలోచనలు బ్రేకప్‌కు దారి తీస్తాయా? జాకరి స్టాకిల్‌ అనే వ్యక్తి అనుభవం చూస్తే అవుననే అనిపిస్తుంది.

ఇతను గర్ల్‌ఫ్రెండ్ గత అనుభవాల గురించి ఆలోచించి.. ఆలోచించి ఆమెను దూరం చేసుకున్నారు.

అయితే తనలాగే ఇంకా అనేకమంది అలాంటి సమస్యతో బాధ పడుతున్నారని తెలుసుకోవడానికి అతనికి కొంత సమయం పట్టింది. ఆ వివరాలు అతని మాటల్లోనే..

అప్పుడు నేను 20 ఏళ్ల ప్రాయంలో ఉన్నాను. మొదటిసారిగా ప్రేమలో కూడా పడ్డాను.

కొత్తగా ప్రేమలో పడిన వాళ్లంతా ఏం చేస్తారో ఓ సాయంత్రం నేను.. నా గర్ల్‌ఫ్రండ్ అదే చేశాం.

మా గతం గురించి మాట్లాడుకోవడం ప్రారంభించాం. క్రమంగా మా సంభాషణ మా ఇద్దరికీ ఉన్న సంబంధాల వైపు మళ్లింది.

ఆమె చెప్పిన కొన్ని విషయాలు విని నాకు షాక్ తగిలినట్లు అనిపించింది.

తను చెప్పిందేమీ కొత్త విషయం కాదు. అదేమీ అసహజమైన విషయం కూడా కాదు. కానీ అది విన్నాక నాలో ఏదో మార్పు కలిగింది.

తను ఆ మాట చెప్పాక నేను ఆమె రొమాంటిక్ చరిత్ర గురించి తప్ప వేరే ఏదీ ఆలోచించలేకపోయాను.

నేను ఉత్తర ఆంటారియో(కెనడా)లోని ఒక చిన్న పట్టణంలో మంచి కుటుంబంలో పెరిగాను.

నాకెలాంటి మానసిక సమస్యలూ లేవు. నాకు ఎనిమిదేళ్లు అంటే మూడో తరగతిలోనే ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవాళ్లు.

హైస్కూలులో కూడా నాకు కొంతమంది గర్ల్‌ఫ్రెండ్స్‌తో సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత నేను అండర్ గ్రాడ్యుయేట్‌గా యూనివర్సిటికీ వెళ్ళినపుడు ఓ వినూత్నమైన వ్యక్తిత్వం కలిగిన మహిళతో ప్రేమలో పడ్డాను.

ఆమె చాలా అందంగా ఉండేది, తెలివైనది, ఆసక్తికరమైన వ్యక్తి.

కానీ నా గర్ల్‌ఫ్రెండ్ గత జీవితాన్ని గురించి చెప్పినపుడు ఏదో తెలీని భావన నన్ను చుట్టుముట్టింది.

మనందరికీ 'అసూయ' గురించి తెలుసు. ఏదైనా హోటల్లో మన భాగస్వామి ఎవరి దృష్టినైనా ఆకర్షిస్తే మనకు అది అనుభవంలోకి వస్తుంది.

నిజానికి నా రొమాంటిక్ చరిత్ర చాలా 'కలర్‌ఫుల్'. కానీ ఆమె వేరెవరితోనో దగ్గరగా ఉండేదన్న భావం నన్ను వేధించడం ప్రారంభించింది.

ఆమె తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్నట్లు నా మెదడులో ఏవేవో చిత్రాలు మెదలడం ప్రారంభించాయి. ఆమె నన్ను మోసం చేస్తున్నట్లు అనిపించింది.

హఠాత్తుగా.. ఆమె గతం నా వర్తమానంగా మారింది.

నేను ఆమె గతాన్ని గురించి ఏవేవో ఆలోచించడం ప్రారంభించాను. వాటి గురించి ఏవో ఊహాగానాలు చేశాను.

మేమిద్దరం కలిసి బయట డిన్నర్‌కు వెళ్లినపుడు, ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్‌తో అదే రెస్టారెంట్‌కు వచ్చి ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చేది.

ఏదైనా హోటల్ పక్కనుంచి వెళ్తుంటే బహుశా వాళ్లిద్దరూ ఆ హోటల్‌లో సెక్స్‌లో పాల్గొన్నారేమో అనిపించేది.

రోజులో నా మొదటి చివరి ఆలోచనలు ఆమె గత సంబంధాల గురించే.

ఈ సమస్యను సోషల్ మీడియా మరింత తీవ్రతరం చేసింది. నేను నా గర్ల్‌ఫ్రెండ్ పాత పోస్టులు, ఫొటోలు, కామెంట్లు పరిశీలించడం ప్రారంభించాను.

నేనో ఆన్‌లైన్ డిటెక్టివ్‌గా మారిపోయాను.

నేను ప్రైవేట్‌గా చేసే ఈ పనులన్నీ నా నిజ జీవితంలో ప్రభావం చూపడం ప్రారంభించాయి.

అప్పుడు నేనెలా ప్రవర్తించానో తల్చుకుంటే ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది.

నేను నిరంతరం నా గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రశ్నల వర్షం కురిపించేవాడిని. ఆమె గత సంబంధాలను ప్రస్తావించి, వాటి గురించి ఆమె పశ్చాత్తాప పడేలా చేయడానికి ప్రయత్నించేవాణ్ని.

ఆమె గతం కూడా నా గతంలాంటిదే అన్న విషయాన్ని మర్చిపోయి ఒక హిపోక్రాట్‌గా మారిపోయాను.

ఆమె నాకు భిన్నంగా.. నా గతానుభవాలపై కొంచెం కూడా ఆసక్తి చూపేది కాదు.

అయితే నా ప్రవర్తన ఆమెకు చాలా కష్టం కలిగించేది. అయినా కూడా ఆమె చాలా ప్రశాంతంగా ఉండేది. నన్ను ప్రేమించేది. తన హృదయంలో నాకు ఒక ప్రత్యేకమైన చోటు ఉందని తెలియజెప్పడానికి ప్రయత్నించేది.

ఆమె ప్రయత్నాలు కొంతసేపు సత్ఫలితాలు ఇచ్చి, నేను మామూలుగా మారేవాణ్ని. ఆ తర్వాత మళ్లీ అలాంటి భావనలు విజృంభించేవి. అలా అది ఒక విషవలయంలా మారిపోయింది.

అలా మా సంబంధం కొన్నేళ్ల పాటు కొనసాగినా, చివరకు మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. నా ప్రవర్తనే దానికి ప్రధాన కారణం అని స్పష్టంగా చెప్పగలను.

మేమిద్దరం విడిపోయిన తర్వాత నన్ను చాలా రోజులు అపరాధభావం పట్టి పీడించింది. మా ఇద్దరి మధ్యా గతంలో జరిగిన కొన్ని సంఘటనలను తల్చుకుని నేను ముడుచుకుపోయేవాణ్ని.

ఆమెతో అలా ప్రవర్తించిన వ్యక్తి నేనేనా అని ఆశ్చర్యం కలిగేది. అప్పుడు నన్నేదో దెయ్యం ఆవహించిందని అనుమానం కలిగేది.

నా బాధను స్నేహితులతో, బంధువులతో, థెరపిస్టులతో, కౌన్సెలర్లతో పంచుకున్నా ఫలితం కనిపించలేదు. ఎవరూ నన్ను సరిగా అర్థం చేసుకున్నట్లు అనిపించలేదు.

తర్వాత నేను 'గర్ల్‌ఫ్రెండ్ గతం గురించి ఆలోచించడం ఆపేయడం ఎలా?' లాంటి వాటికి సమాధానాల కోసం గూగుల్‌లో శోధించాను.

ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్న వారు ఆలోచనల వలయంలో ఇరుక్కుపోతారు. బాధాకరమైన అనుభవాలు, అర్థం లేని పనులు, చివరగా వాళ్లను వాళ్లు అసహ్యించుకోవడం జరుగుతాయి.

ఇది ఒక అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) కిందకు వస్తుందని సైకాలజిస్టులు పేర్కొంటారు.

నా బాధను కొన్ని ఇంటర్నెట్ ఫోరమ్‌లలో పంచుకున్నపుడు, కొంతమంది నాపై జాలి చూపించారు.

కొంతమంది దీనికి ఆడాళ్లే కారణమంటూ వాళ్లపై ద్వేషాన్ని వెళ్లగక్కారు.

మరికొందరు - ప్రియురాలి గతం గురించి ఆలోచించి బాధపడేవాళ్లు అవివేకులంటూ నన్ను తప్పుబట్టారు. కానీ నేను దానితో కూడా అంగీకరించను.

ఆ తర్వాత నేను కొన్ని ఆధ్యాత్మిక కోర్సులకు హాజరయ్యాను. నా ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి ఒక ఆన్‌లైన్ బ్లాగ్ కూడా ప్రారంభించాను.

గత ఏడాది కాలంలో దాన్ని దాదాపు లక్షా 20 వేల మంది వీక్షించారంటే అలాంటి వారు ఎంత మంది ఉన్నారో ఊహించుకోవచ్చు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే వాళ్లలో సగం మంది ఆడవాళ్లే.

ఈ ఈర్ష్య, అసూయ సమస్య కేవలం మగాళ్లకే పరిమితం కాదని తెలుస్తోంది. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడని భారతదేశం, సౌదీ అరేబియాలాంటి దేశాల నుంచి కూడా నాకు అనేక మంది రాయడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత నేను యూట్యూబ్ వీడియోలు కూడా చేయడం ప్రారంభించినపుడు వాటికి ఇంకా ఎక్కువ ప్రతిస్పందన వచ్చింది.

తమ భాగస్వామి కూడా అలాంటి సమస్యతోనే బాధపడుతూ తమను ఇబ్బంది పెడుతున్నానని నాకు మెయిల్స్ వస్తుంటాయి.

అందరికీ నేను ఒక్కటే చెబుతా. ఈ సమస్య మీది కాదు. మీ భాగస్వామిది. ఆ సమస్యను వాళ్లే పరిష్కరించుకోనివ్వాలి. నా అనుభవం ద్వారా ఇది నాకు స్పష్టంగా తెలిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌)