ఇండియా Vs ఇంగ్లాండ్: కోహ్లీ సేన సీరీస్‌ గెలిచేనా?

  • సైమన్ హఘెస్
  • క్రీడా విశ్లేషకులు
విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, AFP

ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డో... క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ.

ఈ ఇద్దరూ తమ జట్లను ముందుండి నడిపించే బలమైన శక్తులు.

దూకుడుగా అడే నైజం, భావోద్వేగంతో చెలరేగే తత్వం వీరిద్దరి సొంతం. వైఫల్యం ఎదురైతే కుంగిపోరు. ఓటమిని ఒక అనుభవంగా తీసుకుంటారు.

ప్రస్తుతం తనతో పాటు, తన టీంను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నదే కోహ్లీ మిషన్.

అయితే, 2014లో ధోనీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కోహ్లీకి ప్రతికూల పరిస్థితి ఎదురైంది.

జేమ్స్ అండర్సన్ స్వింగ్‌ బౌలింగ్‌తో బాగా ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆ టెస్టు సీరీస్‌లో విరాట్ సగటున 13 పరుగులు మాత్రమే చేశారు.

భారత్ ఆ సీరీస్‌ను 3-1 తేడాతో చేజార్చుకుంది.

నాటి ఓటమికి నేటి విజయంతో బదులివ్వాలన్న పట్టుదలతో కోహ్లీ ఉన్నారు. అది నిజమైతే, అతని కెరీర్‌లో గొప్ప విజయమే అవుతుంది.

అయిదు మ్యాచ్‌ల సీరీస్‌లో ఇంగ్లాండ్‌ పిచ్‌ల మీద కోహ్లీ వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టగలిగితే.. భారత్‌ విజయానికి మార్గం సుగమం అయినట్టే.

అలా చేయగలిగితే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని కూడా విరాట్‌ కైవసం చేసుకునే అవకాశముంది.

ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానంలో ఉన్నాడు కోహ్లీ.

'చబ్బీ' బ్యాట్స్‌మెన్ నుంచి.. జిమ్ బాడీ

టీనేజీ వయసులోనే శతకాల పంట పండించిన ఆటగాడు కోహ్లీ. 2008లో భారత జట్టుకు కెప్టెన్‌గా అండర్- 19 వరల్డ్ కప్‌లో విజయం సాధించాడు.

అయితే.. ఆ తర్వాత చాలా కాలంపాటు కోహ్లీ వన్డే ప్లేయర్‌ అన్న అభిప్రాయమే ఉండేది. తొలి 20 టెస్టు ఇన్నింగ్స్‌లలో 30కి అటు ఇటుగానే పరుగులు చేశారు.

కానీ.. 2012 ఐపీఎల్‌ నిరుత్సాహపరచడంతో అతనిలో కీలకమైన మార్పు వచ్చింది. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని గ్రహించాడు.

"అప్పటి దాకా ఏది పడితే అది తినేవాడిని. రోజూ డ్రింకులు తాగేవాడిని. ఒక రోజు స్నానం చేస్తూ.. షవర్ కింద నుంచి వచ్చి అద్దంలో నన్ను నేను చూసుకున్నా. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలంటే ఇలా ఉండకూడదని అనిపించింది. అప్పటి నుంచి ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడ్డాను. ఇప్పటితో పోల్చితే గతంలో 11 నుంచి 12 కిలోలు అధిక బరువు ఉండేవాడిని. నిజంగా చబ్బీ బోయ్‌లా ఉండేవాడిని. అద్దంలో చూసుకున్న మరుసటి రోజు నుంచి తిండిని నియంత్రణలో పెట్టాను. రోజూ గంటన్నర పాటు జిమ్‌లో గడిపేవాడిని. తీవ్రమైన కసరత్తులు చేసేవాడిని. కూల్‌డ్రింకులు, స్వీట్లు పూర్తిగా ఆపేశాను. చాలా ఇబ్బందిగానే అనిపించినా.. అలాగే ప్రయత్నించాను." అంటూ తన గతాన్ని గుర్తుచేసుకుంటాడు విరాట్ కోహ్లీ.

ఫొటో సోర్స్, Getty Images

టీమిండియా కెప్టెన్‌గా

2014 చివరిలో ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీని స్వీకరించిన విరాట్.. స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆ తర్వాత మళ్లీ ఫిట్‌నెస్ పై దృష్టిపెట్టాడు. ఈసారి ఎక్కువగా బరువును నియంత్రించుకోవడంపై దృష్టి సారించాడు.

తన జట్టు సభ్యులు తనలాగే చేయాలని సూచించేవాడు. ఆ కసరత్తుల ఫలితం తర్వాతి విజయాల్లో స్పష్టంగా కనిపించింది.

ఫొటో సోర్స్, AFP

కోహ్లీ దూకుడుని ఇంగ్లాండ్ ఎలా అడ్డుకోగలదు?

టెస్ట్ క్రికెట్‌లో తొలినాళ్లతో పోల్చితే కోహ్లీ స్కోర్ రేటు అసాధారణ రీతిలో పెరిగింది. అతను 112 టెస్టు ఇన్నింగ్స్‌లలో 21 శతకాలు సాధించాడు. ఇంతకు మించిన నిష్పత్తిలో శతకాలు సాధించింది ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మ్యాన్ మాత్రమే.

ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టు సారధి జోయ్ రూట్ 126 ఇన్నింగ్స్‌లలో 13 శతకాలు మాత్రమే చేశాడు.

కోహ్లీని తొందరగా పెవిలియన్‌కు పంపించగలిగితేనే భారత్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది.

ఇంగ్లాండ్ జట్టులో అండర్సన్‌, స్టువర్ట్ బ్రాడ్ లాంటి బౌలర్లు బంతిని స్వింగ్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడతారు. 2014 పర్యటనలో కోహ్లీ ఆ స్వింగ్ వల్లనే ఆడలేకపోయారు. అయితే.. ఇప్పుడు విరాట్ పూర్తి విశ్వాసంతో కనిపిస్తున్నారు.

భారత జట్టులోని టాప్ 3 బ్యాట్స్‌మెన్‌లు సగటున 50 పరుగులు చేయగలిగితే ఈ సీరీస్ కోహ్లీ సేన కైవసం కావచ్చు. టీమిండియా కొత్త క్రికెట్ 'కింగ్‌'గా కోహ్లీ పేరు మారుమోగిపోవచ్చు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)