BBC SPECIAL: చైనాలో బాహుబలి, దంగల్ సినిమాలు ఎందుకంత హిట్టయ్యాయంటే...

  • వినీత్ ఖరే
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

చైనాలో దక్షిణ భారత సినిమాలకు చాలా ఆదరణ ఉంది

చైనా ప్రజలు క్రమంగా బాలీవుడ్, దక్షిణాది సినిమాలకు వీరాభిమానులుగా మారిపోతున్నారు. ఆ సినిమాల్ని చూసి నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, స్ఫూర్తి పొందుతున్నారు.. మొత్తంగా వాటిని తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు.

దంగల్, హిందీ మీడియం, త్రీ ఇడియట్స్, పీకే, టాయిలెట్, బాహుబలి లాంటి సినిమాలు చైనా గ్రామాలూ, పట్టణాల్లో భారతదేశంతో పాటు భారత ప్రజల ఇమేజ్‌ను విపరీతంగా పెంచుతున్నాయి. భారతదేశ పరిస్థితులను చైనీయుల కళ్లకు కట్టడంలో ఈ సినిమాలే అన్నిటికంటే ముందుంటున్నాయి.

కరెన్ చెన్ అనే ఓ అమ్మాయిని నేను షాంఘైలో కలిశాను. ఆమె ఆమిర్‌ఖాన్‌కు పెద్ద అభిమాని. ఏదైనా బాలీవుడ్ పాట పాడమని అడిగితే, ఆమె ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమాలోని ‘మై చాంద్ హూ’ పాటను హమ్ చేశారు. చెన్‌కు హిందీ రాదు. అయినా సరే ఆ పాట అర్థం తనకు తెలుసని చెప్పారు.

వీడియో క్యాప్షన్,

చైనాలో భారతీయ సినిమాల హవా - లక్షల్లో అభిమానులు

చెన్ మొదట చూసిన బాలీవుడ్ సినిమా దంగల్. అది తన జీవితంపైన చాలా ప్రభావం చూపిందని ఆమె అంటున్నారు.

‘దంగల్ సినిమా చూసినప్పుడు నా బరువు 98కిలోలు. కానీ ఆ సినిమా చూశాక నేను కూడా కష్టపడితే బరువు తగ్గొచ్చని అనిపించింది. ఇప్పుడు చూడండి నేను ఎలా ఉన్నానో’ అని చెన్ చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

దంగల్ చూశాకే తనలో సన్నగా అవ్వాలన్న తపన మొదలైందంటారు కరెన్ చెన్

చెన్‌తో పాటు టీనా, లీఫ్ అనే మరో ఇద్దరు యువతులున్నారు. వాళ్లు కూడా బాలీవుడ్ అభిమానులే. మొదట్లో సీడీల్లో హిందీ సినిమాలు చూసేవాళ్లమని, తరవాత థియేటర్‌కు వెళ్లడం మొదలుపెట్టామని చెప్పారు.

‘భారతీయ సినిమాలు ఆ దేశ ప్రగతి, నాగరికతకు అద్దం పడతాయి. వాళ్ల డాన్సులు, పాటలు, సెంటిమెంట్ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి’ అని లీఫ్ అన్నారు.

బాలీవుడ్ సినిమాలతో పాటు వివియన్ అనే అమ్మాయికి దక్షిణ భారత సినిమాలు కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమా ఆమెకు పిచ్చిగా నచ్చేసింది. ఎంతలా అంటే.. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఇతర బొమ్మలను ఆమె జపాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు.

‘బాహుబలి చూసి నా మతి పోయింది. అందులో కథను చెప్పిన విధానం, పాటలు, ఫైట్లు చాలా బాగుంటాయి. భారతీయ సంస్కృతి, నాగరికతలను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా చూపించారు’ అంటారు వివియన్.

‘ప్రభాస్ ఓసారి షాంఘై రావాలి. అతడి ఫిట్ బాడీ, గుండ్రని ముఖం, రింగు రింగుల జుట్టు, కొనతేలిన మీసం, అందమైన చిరునవ్వు, గంభీరమైన స్వరం.. వీటి కారణంగా మేం అతడిని చైనీస్‌లో ‘చో చో’ అని ముద్దుగా పిలుచుకుంటాం. ప్రభాస్‌ను చూశాకే నాకు మీసంపైన ఇష్టం మొదలైంది’ అని వివియన్ చెప్పారు.

2016లో బాహుబలి-1, పీకే, ఫ్యాన్ సినిమాలు చైనాలో విడుదలయ్యాయి. కానీ గతేడాది ‘దంగల్’ మాత్రమే విడుదలైంది. డోక్లామ్ సరిహద్దు వివాదమే సినిమాల సంఖ్య తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు.

కానీ ఈ ఏడాది ఆ సంఖ్య బాగా మెరుగైంది. ఇప్పటికే ‘సీక్రెట్ సూపర్‌స్టార్’, ‘హిందీ మీడియం’, ‘బజరంగీ భాయిజాన్’, బాహుబలి-2, టాయిలెట్.. ఇలా 5 సినిమాలు విడుదలయ్యాయి. సుల్తాన్, ప్యాడ్‌మ్యాన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

భారతీయ సినిమాల కథాంశాలు అక్కడి వాళ్లను ఎంతగా ఆకర్షిస్తున్నాయంటే.. ఇప్పుడు వాటితో పోల్చి చూస్తూ తమ సినిమా కథలను ప్రశ్నించడం, విమర్శించడం మొదలుపెట్టారు.

‘భారతీయ సినిమాల్లో ప్రేమ, కుటుంబ అనుబంధాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. కానీ చైనీస్ సినిమాల్లో అవి కనిపించవు. వీళ్లెందుకు అలా తీయరో అర్థం కాదు. అందుకే నాకు మా సినిమాలు కనెక్ట్ కావట్లేదు. వాటి బదులు హిందీ సినిమాలు చూసి ఆనందిస్తున్నా’ అంటారు చియాంగ్ పిన్ లీ. ఆయన భారతీయ సినిమాలను చైనీస్ భాషలోకి అనువదించి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. చియాంగ్‌లా భారతీయ సినిమాలను అనువదించి విడుదల చేసేవాళ్లు అక్కడ చాలామంది ఉన్నారు.

తనకు దక్షిణాది సినిమాలంటే చాలా ఇష్టమని, చాలా కాలంపాటు ఆ సినిమాల్లో హీరోల్లా రంగురంగుల దుస్తులు వేసుకునేవాడినని చియాంగ్ చెబుతారు.

ఏటా చైనాలో 800-900 సినిమాలను తీస్తారు. అందులో 300-400మాత్రమే థియేటర్లకు చేరతాయి. మిగతావి టీవీలోనో, ఆన్‌లైన్‌లోనో విడుదలవుతాయి. కొన్నయితే అసలు విడుదలకే నోచుకోవని అంటారు చియాంగ్.

ఫొటో క్యాప్షన్,

దంగల్ సినిమాలో ఓ పాటకు స్టెప్పులేస్తున్న చైనా యువత

బీజింగ్‌లో ఉండే అలెన్ ల్యూ కూడా భారతీయ సినిమాలకు పెద్ద అభిమాని. ‘దంగల్’ సినిమాను చైనాకు తీసుకొచ్చింది ఆయనే. మొదటిసారి అలెన్ ఆ సినిమాను ముంబయిలో ఆమిర్ ఖాన్ ఇంట్లో ఆయనతో కలిసే చూశారు.

‘ఆ సినిమా పూర్తవగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. మా దేశం వాళ్లు కూడా తమను తాము ఆ సినిమాలో చూసుకుంటారని అనిపించింది. అందుకే ఆది హిట్టవుతుందన్న నమ్మకం కలిగింది’ అంటారు అలెన్.

దంగల్ చైనాలో విడుదలైనప్పుడు కనీసం 200కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పంపిణీదారులు భావించారు. కానీ అది అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 1300కోట్ల రూపాయలు వసూలు చేసింది.

గతంలో ఆమిర్ ఖాన్ నటించిన ఓ సినిమాను అలెన్ ప్రస్తుతం చైనీస్ భాషలో రీమేక్ చేస్తున్నారు.

‘భారతీయులను కూడా బాగా ఆకట్టుకోగలిగే చైనీస్ సినిమాలు చాలా ఉన్నాయి. నా తరవాతి లక్ష్యం కూడా అదే. ఎలాగైనా మంచి చైనీస్ సినిమాలను భారత్‌కు తీసుకొస్తా’ అంటారు అలెన్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)