ఫేస్‌బుక్‌లో కొత్త ఆప్షన్: ఎంత సేపు చూడాలో మీరే నిర్ణయించుకోండి

  • 2 ఆగస్టు 2018
సోషల్ మీడియా Image copyright ORANGE LINE MEDIA

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లలో కొత్తగా టైం లిమిట్ టూల్‌ అందుబాటులోకి వస్తోంది. ఈ టూల్ ద్వారా ఎంతసేపు సోషల్ మీడియాలో గడపాలో వినియోగదారులే తమకు తాము పరిమితి(టైం లిమిట్) పెట్టుకోవచ్చు.

సోషల్ మీడియాలో అతిగా గడపడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ టూల్‌ ద్వారా వినియోగదారులు తాము ఎంతసేపు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లలో గడుపుతున్నామో తెలుసుకోవచ్చు. ఎంతసేపు ఫేస్‌బుక్ వాడాలనుకుంటున్నారో.. అంతకే టైం పరిమితి సెట్ చేసుకోవచ్చు.

ఆ పరిమితిని చేరుకోగానే.. ఫేస్‌బుక్కే మీకు గుర్తుచేస్తుంది. అలాగే నోటిఫికేషన్‌న్లను మ్యూట్(చప్పుడు రాకుండా) చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.

Image copyright facebook
చిత్రం శీర్షిక ఫేస్‌బుక్ యాప్‌ సెట్టింగ్స్‌ పేజీలోకి వెళ్లి 'యువర్ టైం' అని, ఇన్‌స్టాగ్రామ్‌లో 'యువర్ యాక్టివిటీ' పేరుతో టైం లిమిట్ టూల్ కనిపిస్తుంది.

అతిగా సోషల్ మీడియాలో గడపడం మానసిక సమస్యలకు దారితీస్తుందన్న విషయాన్ని గతేడాది డిసెంబర్‌లో ఫేస్‌బుక్ ధ్రువీకరించింది.

ఫేస్‌బుక్‌లో స్క్రోల్ చేస్తూ.. అనేక రకాల పోస్టులు చూసేవారి మీద ఆ ప్రభావం అధికంగా ఉంటోందని తెలిపింది.

ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థులు 10 నిమిషాల పాటు ఫేస్‌బుక్‌ పేజీలను స్క్రోల్ చేశారు. మరికొందరు తమకు నచ్చిన కొత్త పోస్టులు పెడుతూ గడిపారు. ఇంకొందరు సరదాగా తమ స్నేహితులతో చాటింగ్ చేశారు. ఆఖరికి వీళ్లందరినీ పరిశీలించగా స్క్రోల్ చేస్తూ గడిపిన వారి మానసిక స్థితి చాలా దారుణంగా తయారైందని పరిశోధకులు గుర్తించారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన అధ్యయనంలోనూ ఇలాంటి ఫలితాలే కనిపించాయి.

రాత్రివేళ ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడిపితే అది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ అలవాటే సరిగా నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుందని వెల్లడైంది. రాత్రివేళల్లో అతిగా సోషల్ మీడియా వాడకంతో ఉద్యోగుల్లో పని సామర్థ్యం కూడా తగ్గుతుందని తేలింది.

Image copyright Alamy
చిత్రం శీర్షిక మానసిక నిపుణులు, పరిశోధనా సంస్థల సలహాతో టైం లిమిట్ టూల్‌ను రూపొందించామని ఫేస్‌బుక్ తెలిపింది.

అయితే.. టైం లిమిట్ టూల్ తీసుకొచ్చినంత మాత్రాన పూర్తిగా మార్పు వచ్చేస్తుందని చెప్పలేమని ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణులు గ్రాంట్ బ్లాంక్ అంటున్నారు.

"ఫోన్ తెరిచేది మనం, అందులో సోషల్ మీడియా వాడేది మనం. కాబట్టి ఈ సమస్యను అధిగమించే బాధ్యత ఫేస్‌బుక్‌దో, మరో సంస్థదో అని అనలేం. ముందు మన ఆరోగ్యం గురించి, మనలో మార్పు రావాలి" అని డిజిటల్ మార్కెటింగ్ సంస్థ 'ది గోట్ ఏజెన్సీ' సహ వ్యవస్థాపకుడు హ్యారీ యూగో అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)