పుట్టిన మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? ఆ పాలకు అంత ప్రాధాన్యం ఎందుకు?

  • 3 ఆగస్టు 2018
బిడ్డకు తల్లిపాలు Image copyright Getty Images

తల్లి పాలు బిడ్డకు వరం లాంటివి. కానీ పిల్లలకు ఆ వరం పుట్టిన మొదటి గంటలో లభించకపోతే ఆ బిడ్డ జీవితమే ప్రమాదంలో పడవచ్చు.

యునిసెఫ్ సర్వే ప్రకారం తక్కువ, మధ్యస్థ ఆదాయం వచ్చే చాలా దేశాల్లో ఐదుగురిలో ఇద్దరు శిశువులకు మాత్రమే పుట్టిన గంటలోనే తల్లిపాలు తాగే అదృష్టం దక్కుతోంది. అలా తల్లి పాలు తాగలేని పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వారి ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశాలు పెరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లో జరిగిన అధ్యయనం ఆధారంగా జులై 31వ తేదీన ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం 2017వ సంవత్సరంలో సుమారు 7 కోట్ల 80 లక్షల మంది శిశువులకు పుట్టిన గంటలోనే తల్లి పాలు అందలేదు.

ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిన మొదటి గంటలోనే స్తన్యం ఇవ్వకపోతే ఆ బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఈ నివేదిక ప్రకారం బిడ్డ పుట్టిన తర్వాత తొలి గంటలో వారికి స్తన్యం లభించకపోతే బిడ్డ చనిపోయే అవకాశాలు 33 శాతం పెరుగుతాయి.

ఒకవేళ బిడ్డ పుట్టిన 24 గంటల్లో కూడా తల్లి పాలు అందకపోతే, ఆ శిశువు మరణించే ప్రమాదం రెట్టింపు అవుతుంది.

Image copyright Getty Images

పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగిన పిల్లలు, మిగతా పిల్లల కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. వాళ్లకు రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. తల్లి, బిడ్డల బంధం బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్‌కు ఒక కారణం కూడా అవుతుంది. తల్లీబిడ్డల మధ్య మొదటి స్పర్శ కొలొస్ట్రమ్ ఏర్పడడానికి కూడా సాయం చేస్తుంది.

సైన్స్ డైలీ ప్రకారం.. కొలొస్ట్రమ్‌ను తల్లి తొలి పాలని కూడా చెబుతారు. తల్లి అయిన తర్వాత కొన్ని రోజుల వరకూ కొలొస్ట్రమ్ ఉత్పత్తి అవుతుంది. కొలొస్ట్రమ్ చిక్కగా, జిగటగా, పసుపుగా ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్, ప్రొటీన్, యాంటీ-బాడీస్ నిండి ఉంటాయి. ఇందులో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు వీటిని సులభంగా జీర్ణం చేసుకోగలరు. పిల్లల మొదటి స్టూల్(మెకోనియం)కు కూడా అవి చాలా అవసరం.

యునిసెఫ్ రిపోర్టు ప్రకారం తల్లి మొదట ఇచ్చే పాలను, పిల్లలకు మొదటి వ్యాక్సిన్‌గా కూడా భావిస్తారు.

Image copyright Getty Images

భారత్‌లో పరిస్థితి ఏంటి?

76 దేశాల్లో చేసిన సర్వే ప్రకారం యునిసెఫ్ ఈ రిపోర్ట్ తయారు చేసింది. దీని ప్రకారం తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో బ్రెస్ట్ ఫీడింగ్‌ గురించి ఎక్కువ అవగాహన(65శాతం) ఉంది. అదే తూర్పు ఆసియాలో ఇది అత్యంత తక్కువగా(32 శాతం) ఉంది.

ఈ 76 దేశాల జాబితాలో భారతదేశం 56వ స్థానంలో ఉంటే, పాకిస్తాన్ 75వ స్థానంలో ఉంది. శ్రీలంక ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

సీ-సెక్షన్ వల్ల కూడా ప్రభావం ఉంటుందా?

సీ-సెక్షన్ అంటే ఆపరేషన్ వల్ల జరిగే ప్రసవాలు పెరగడం వల్ల కూడా చాలాసార్లు తల్లి గంటలోపే బిడ్డకు పాలు తాగించలేకపోతోందని ఈ నివేదికలో ప్రస్తావించారు.

2017 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సీ-సెక్షన్ కేసులు 20 శాతం పెరిగాయి. ఈజిఫ్టును ఉదాహరణగా తీసుకుంటే, ఇక్కడ సి-సెక్షన్ ద్వారా పుట్టిన 19 శాతం మంది శిశువులు మాత్రమే తొలి గంటలో తల్లిపాలు తాగగలిగారు. నార్మల్ డెలివరీ అయిన 39 శాతం మంది పిల్లలు పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగగలిగారు.

సి-సెక్షన్ కాకుండా మరో పెద్ద కారణం వల్ల కూడా పిల్లలకు పుట్టిన తొలి గంటలోనే తల్లి పాలు అందడం లేదు.

రిపోర్టులో ఉన్న ఆయా దేశాలు నవజాత శిశువులకు సిద్ధంగా ఉన్న పాలు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని, పుట్టిన తొలి గంటలో బిడ్డకు తల్లి పాలు అందించడానికి చట్టపరంగా ప్రాధాన్యం ఇవ్వాలని యునిసెఫ్ ప్రభుత్వాలను కోరింది.

Image copyright Getty Images

భారతీయ మహిళలు ఏమంటున్నారు?

యునిసెఫ్ నివేదికపై తమ అనుభవాలను పంచుకోవాలంటూ మహిళలను బీబీసీ కోరింది.

ఎక్కువ మంది మహిళలు తల్లి మొదటి గంటలో బిడ్డకు పాలు తాగించాలా, లేదా అనేది ఎక్కువగా ఆ ఆస్పత్రిలోని డాక్టర్, నర్స్, లేదా ఆ సమయంలో అక్కడ ఉన్న వారిపై ఆధారపడి ఉంటుందని రాశారు. "భారత్‌లోని ఎక్కువ ఆస్పత్రుల్లో అలా జరగడం లేదు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో బిడ్డను పుట్టగానే తల్లి చేతికి అప్పగిస్తారు. ఆ తర్వాతే శుభ్రం చేస్తారు. అక్కడ, ఇక్కడ చాలా తేడా ఉంది" అని అనూమేధా ప్రసాద్ చెప్పారు.

"పాలు తాగించడానికి మాత్రమే తల్లి తన బిడ్డను ఛాతికి అదుముకోదు. వారి మధ్య తల్లీబిడ్డ బంధం ఏర్పడడం కూడా చాలా అవసరం" అంటారు అనుమేధా.

అనుమేధా ఇద్దరు పిల్లలు నార్మల్ డెలివరీ ద్వారా పుట్టారు. తండ్రి డాక్టర్ కావడంతో బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లి పాలు ఇవ్వడం చాలా అవసరమని తనకు ముందే తెలుసని ఆమె చెప్పారు. అనుమేధాలాగే చాలా మంది తల్లులు బిడ్డకు మొదటి గంటలోనే స్తన్యం ఇచ్చామని చెప్పారు.

ఖదీజా ఇద్దరు పిల్లలు సి-సెక్షన్‌ ద్వారా పుట్టారు. "సి-సెక్షన్ జరిగితే పిల్లలకు పాలు పట్టడం కష్టంగా ఉంటుంది. కానీ పిల్లలకు ఎలా బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి అనేది తెలుసుకుంటే.. అది అంత సమస్య కాదు" అని ఆమె చెప్పారు.

Image copyright Getty Images

మొదటి పాలు అంత ముఖ్యం ఎందుకు?

దిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్న పిల్లల డాక్టర్ దినేష్ సింఘాల్ మాట్లాడుతూ.. "తల్లి పాలు పిల్లలకు చాలా అవసరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. కానీ ఏదైనా కారణంతో పిల్లలు పాలు తాగలేకపోతుంటే, సక్షన్ పంప్‌తో పాలు తీసి డ్రిప్ ద్వారా తాగించవచ్చు. అలా కాకుండా తల్లే పాలు ఇచ్చే స్థితిలో లేనప్పుడు బిడ్డకు ఫార్ములా మిల్క్ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది" అన్నారు.

యునిసెఫ్ రిపోర్టులో మరో విషయం కూడా ఉంది. "ఎక్కువ దేశాల్లో కొందరు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడానికి బదులు తేనె, చక్కెర నీళ్లు, ఫార్ములా మిల్క్ లాంటి ఇవ్వడమే మంచిదని భావిస్తారు. కానీ అలా చేయడం వల్ల తల్లి, బిడ్డ మధ్య బంధం ఏర్పడడం ఆలస్యం అవుతుంది."

డాక్టర్ సింఘల్ మాట్లాడుతూ.. "తల్లి పాలు బిడ్డను జీవితాంతం వ్యాధుల నుంచి రక్షిస్తాయి అనేది పూర్తిగా నిజం కాదు. కానీ పుట్టిన తర్వాత చాలా రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు తల్లి పాలు ఇవ్వడం మంచిదే" అన్నారు.

తల్లి పాలు లేకపోతే బిడ్డకు పూర్తి రక్షణ ఉండదని అనుకోకుండా, బిడ్డకు తల్లి తొలి పాలు అందించగలిగేలా ప్రయత్నించాలని ఆయన చెబుతారు.

"కొన్నిసార్లు వేరేలా జరగచ్చు. బిడ్డకు తల్లి పాలు కాకుండా వేరే పాలు ఇస్తే, ఆ బిడ్డ తల్లి పాలకు అలవాటు కాలేదు. స్తన్యం తాగలేదు. అలాంటి స్థితి మరింత ప్రమాదకరం కావచ్చు" అని డాక్టర్ సింఘల్ చెబుతారు.

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)