నిఖాబ్‌ ధరించడాన్ని నిషేధించిన డెన్మార్క్: ఆగ్రహించిన ముస్లిం మహిళలు

  • 4 ఆగస్టు 2018
నిఖాబ్ Image copyright Getty Images

మహిళలు బహిరంగ ప్రదేశాల్లో నిఖాబ్ అంటే ముఖానికి ముసుగు ధరించడాన్ని డెన్మార్క్ ఇటీవల నిషేధించింది. ఎవరైనా మహిళలు ముఖంపై ముసుగుతో కనిపిస్తే 150 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అయితే, కొందరు మహిళలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

గత బుధవారం నిషేధం అమలైన తర్వాత మొదటిసారి బహిరంగంగా నిఖాబ్ ధరించిందంటూ ఉత్తర కోపెన్‌హేగెన్‌లో ఒక మహిళపై ఆరోపణలు నమోదు చేశారు.

నిఖాబ్ తొలగించడానికి ప్రయత్నించిన మరో మహిళతో పెనుగులాడినందుకు 28 ఏళ్ల యువతికి జరిమానా విధించినట్టు స్థానిక మీడియా తెలిపింది.

సీసీటీవీలో ఆ దృశ్యాలు కనిపించడంతో మహిళను పిలిపించామని పోలీసులు తెలిపారు. నిఖాబ్ తొలగించడానికి నిరాకరిస్తే ఆమెపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

బహిరంగ స్థలాల్లో నిఖాబ్ ధరించడాన్ని డెన్మార్క్ ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కొందరు మహిళలు వీధుల్లోకి వచ్చారు. ఇది తమ భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని వారంటున్నారు.

‘‘మమ్మల్ని ఎవరో అణచివేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. కానీ, డెన్మార్క్‌లో మహిళలను నిఖాబ్ ధరించాలని ఎవరో ఒత్తిడి చేస్తున్నట్లు నిరూపించే ఆధారాలేవీ వాళ్ళ వద్ద లేవు. నిఖాబ్‌ వేసుకుని నేరాలకు పాల్పడిన సంఘటనలేవీ లేకపోయినా దీనివల్ల దేశ భద్రతకు ప్రమాదమని అంటున్నారు’’ అని సబీనా అనే మహిళ బీబీసీతో అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: బహిరంగంగా నిఖాబ్ ధరించొద్దంటున్న డెన్మార్క్

కాగా, కోపెన్‌హేగెన్ వీధుల్లో మహిళలు చేపట్టిన నిరసనపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

‘‘నేను ఏం ధరించాలో ఒకరు చెప్పనక్కర్లేదు. వారేం ధరించాలో మేం చెప్పడం లేదు కదా?’’ అని ఒక మహిళ అభిప్రాయపడ్డారు.

‘‘ముఖంపై నిఖాబ్ లేకపోతే ఎంతో ఉపయోగం. ఒకరి ముఖాన్ని మరొకరు చూసుకోవచ్చు. ఎందుకంటే కళ్లు, ముఖంలో హావభావాలు చాలా విషయాలు చెబుతాయి’’ అని మరొక మహిళ వ్యాఖ్యానించారు.

ఫ్రాన్స్ వంటి ఇతర యూరప్ దేశాల మాదిరిగానే డెన్మార్క్ కూడా ఈ ఏడాది మేలో ముసుగు ధరించడాన్ని నిషేధించింది.

Image copyright Getty Images

అయితే, తమ అభిప్రాయాలను తీసుకోకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, తమను లక్ష్యంగా చేసుకున్నారనీ నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

నిబంధనలను ఉల్లంఘిస్తే 150 డాలర్లు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముసుగు వేసుకున్న వాళ్లను బహిరంగ ప్రదేశాల్లో తిరగనీయకుండా అడ్డుకునే అవకాశమూ ఉంది.

‘‘రాజకీయ నాయకులు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మేం శక్తిమంతమైన, స్వతంత్ర మహిళలం. మేం ఏం ధరించాలో నిర్ణయించుకునే హక్కు మాకే ఉండాలి. దాన్ని మేం వదులుకోం. మాపై వివక్ష, ద్వేషాన్ని చూపాలని వారు ఎంతగా ప్రయత్నిస్తారో అంతగా మేం శక్తిమంతులమవుతాం‘‘ అని సబీనా పేర్కొన్నారు.

నిషేధం ఉన్నప్పటికీ డెన్మార్క్‌లోని ముస్లింలు, ముస్లిమేతర ప్రజలు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ ముఖాలపై ముసుగులతోనే నిరసన తెలిపే అవకాశం ఉంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionహిందూ పష్తోలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)