యాపిల్ కంపెనీ విలువ రూ.68,61,000,00,00,000

  • 2 ఆగస్టు 2018
ఐఫోన్ Image copyright Getty Images

ప్రపంచంలో లక్ష కోట్ల డాలర్ల విలువను అందుకున్న మొట్టమొదటి పబ్లిక్ కంపెనీగా యాపిల్ రికార్డు సృష్టించింది.

ఐఫోన్ తయారీ సంస్థ అయిన యాపిల్ మార్కెట్ విలువ.. న్యూయార్క్‌లో గురువారం మధ్యాహ్నం ట్రేడింగ్ తర్వాత ఈ సంఖ్యను చేరుకుంది.

ట్రిలియన్ డాలర్లు.. అంటే లక్ష కోట్ల డాలర్లు.. భారత కరెన్సీలో గురువారం నాటి డాలర్ విలువను బట్టి 68.61 లక్షల కోట్ల రూపాయలు.

ఆ సంస్థ షేరు విలువ 207 డాలర్లకు (సుమారు రూ. 14,207) పెరిగింది. మంగళవారం నుంచి షేరు విలువ 9 శాతం మేర పెరిగింది.

1980లో మొదటిసారి షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయినప్పటి నుంచీ యాపిల్ షేర్ ధర 50,000 శాతానికి పైగా పెరిగింది.

1976లో యాపిల్ సహ సంస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తన షెడ్డులో ఈ కంపెనీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట్లో మాక్ కంప్యూటర్లతో పేరు తెచ్చుకున్న యాపిల్ సంస్థ తర్వాత స్మార్ట్ ఫోన్లతోను, తదరంతరం యాప్‌లతోనూ లాభాల బాట పట్టింది.

2011లో స్టీవ్ జాబ్స్ మరణించటంతో టిమ్ కుక్ ఈ కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఐఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా మలచి యాపిల్ లాభాలను గణనీయంగా పెంచారు.

యాపిల్ తన సరికొత్త ఐఫోన్ మోడల్‌ను ప్రవేశపెట్టడం వల్లనే గతేడాది దాని లాభాలు పెరిగాయని బీబీసీ ఉత్తర అమెరికా టెక్నాలజీ రిపోర్టర్ డేవ్ లీ తెలిపారు. స్టాక్‌మార్కెట్లలో అస్థిరత్వం, చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో యాపిల్ లాభాలు తగ్గొచ్చని ఆయన తెలిపారు.

‘‘యాపిల్ కంపెనీ, దాని ఉత్పత్తుల పట్ల ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ.. యాపిల్ ఉత్పత్తులు ప్రపంచాన్ని మార్చాయి. ఇప్పుడు సరికొత్త ఆర్థిక చరిత్రను సృష్టించాయి’’ అని డేవ్ లీ అభిప్రాయపడ్డారు.

ఇలాంటివే మరికొన్ని వార్తలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు