చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం

  • వినీత్ ఖరే
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

40 ఏళ్ల క్రితం షెంజెన్

దక్షిణ చైనాలోని షెంజెన్ 40 ఏళ్ల కిందట మత్స్యకారుల గ్రామంలా ఉండేది. అక్కడ ఉన్న వాళ్లు పనుల కోసం నీళ్లలో ఈదుతూ, ప్రాణాలకు తెగించి పక్కనే ఉన్న హాంగ్‌కాంగ్ చేరుకునేవారు.

1980లో చైనా నేత డెంగ్ శ్యావోపింగ్, షెంజెన్‌లో చైనా మొట్టమొదటి స్పెషల్ ఎకనామిక్ జోన్( ఎస్ఈజెడ్) స్థాపించారు. దాంతో షెంజెన్ స్వరూపం మారిపోవడం మొదలైంది.

షెంజెన్ మ్యూజియంలో ఆ నాటి ఫొటోలున్నాయి. వాటిలో షెంజెన్ నలువైపులా ఖాళీ భూములు, ఫ్యాక్టరీల్లో జనం పనిచేస్తూ ఉండడం కనిపిస్తోంది.

ఫొటో క్యాప్షన్,

షెంజెన్ నగరాన్ని చైనా 'సిలికాన్ వ్యాలీ' లేదా 'ప్రపంచ హార్డ్ వేర్ కేంద్రం' అని చెబుతారు

మ్యూజియంలో డెంగ్ శ్యావోపింగ్ ఫొటోలతోపాటు ఆయన వైన్, పడక లాంటి ఎన్నో వ్యక్తిగత వస్తువులు కూడా ఉన్నాయి.

80, 90 దశకాల్లో చైనాలో సుదూర గ్రామాలకు చెందిన పేద ప్రాంతాల ప్రజలు షెంజెన్ ఫ్యాక్టరీల్లో తక్కువ వేతనాలకు పనిచేసేవారు.

పన్నులు, కార్మిక చట్టాల నుంచి మినహాయింపు పొందడానికి ఇక్కడ ఉత్పత్తి చేయడం కంపెనీలకు చౌకగా ఉండేది. దాంతో ఇది త్వరలోనే ప్రపంచానికే ఫ్యాక్టరీ అనిపించుకుంది.

ఫొటో క్యాప్షన్,

షెంజెన్‌లో డెంగ్ శ్యావోపింగ్

యువత అధికంగా ఉన్న ఆధునిక నగరం

ప్రస్తుతం షెంజెన్‌ను ఒకసారి చైనా సిలికాన్ వ్యాలీ అంటే, ఇంకోసారి ప్రపంచ హార్డ్‌వేర్ కేంద్రంగా చెబుతున్నారు.

ప్రపంచంలో యువత అత్యధికంగా ఉన్న నగరాల్లో ఒకటైన షెంజెన్ ప్రస్తుతం ఇన్వెన్షన్, టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్స్, బయోటెక్ రంగాలకు కేంద్రంగా మారింది.

గణాంకాల ప్రకారం షెంజెన్ ఆర్థిక వ్యవస్థ హాంకాంగ్, సింగపూర్‌తో సమానంగా ఉంది. ఇక్కడ ఉన్న ఓడరేవు ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండే కంటైనర్ పోర్టుల్లో ఒకటిగా నిలిచింది.

స్కై స్క్రేపర్ సెంటర్ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత ఎత్తైన 100 భవనాల్లో ఆరు షెంజెన్‌ నగరంలోనే ఉన్నాయి.

షెంజెన్ స్కైలైన్, నాణ్యమైన గాలి, విశాలంగా ఉన్న రహదారులపై పరుగులు తీసే ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు అన్నీ ఆ నగరాన్ని చైనాలోనే కాదు మొత్తం ఆసియాలోనే ప్రత్యేక నగరంగా మార్చాయి.

షెంజెన్‌లో ఆవిర్భవించిన టెన్సెంట్, జడ్‌టీఈ, వేవ్ లాంటి ఎన్నో కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేశాయి.

ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం వేవ్ గత ఏడాది కేవలం పరిశోధనల కోసమే 14 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

ఫొటో క్యాప్షన్,

షెంజన్‌లో హార్డ్‌వేర్, కంపొనెంట్ చాలా సులభంగా దొరుకుతాయి

నైపుణ్యాలకు పదును పెడతారు

షెంజెన్‌లో పరికరాలను కొని వాటి నమూనాలను తయారు చేయచ్చని, వాటిని టెస్ట్ చేయవచ్చని, తర్వాత మార్కెట్లో వాటిని లాంచ్ కూడా చేయవచ్చని, ఆ నగరంలో టెక్నాలజీ స్టార్టప్స్‌ ప్రారంభించే వారు చెబుతున్నారు. ఇలా ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని వారు అంటున్నారు. ఇక్కడ అన్నిరకాల నైపుణ్యాలు, మెషిన్లు, చిప్స్, కంపొనెంట్ లాంటివి అతి తక్కువ ధరలో సులభంగా దొరకడం దీనికి కారణమని వారు వివరిస్తున్నారు.

యూరప్ నుంచి వచ్చిన మిలాన్ గ్లామోచిక్ నాలుగేళ్ల కిందట పిల్లలకు రోబోటిక్స్ నేర్పించడానికి ఇక్కడ ఒక స్కూల్ తెరిచారు.

ఈ స్కూల్లో ఐదు నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఆయన సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, రోబోటిక్స్ నేర్పిస్తుంటారు.

ఇక్కడ ప్రతి గంటకు కొన్ని వేల రూపాయల ఫీజు వసూలు చేస్తారు. అందుకే ఇక్కడ కేవలం సంపన్నుల పిల్లలు మాత్రమే చేరుతుంటారు.

ఫొటో క్యాప్షన్,

మిలాన్‌ అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో పాటు చాలా దేశాల్లో పనిచేశారు

"ఇక్కడ పిల్లలకు తమ డిజైన్ సొంతంగా తయారుచేసే అవకాశం ఉంటుంది. అందులో వాళ్లు ఫెయిలైతే మళ్లీ ప్రయత్నిస్తారు. సమస్యకు పరిష్కారం ఏంటో వాళ్లే వెతుక్కుంటారు" అని మిలాన్ చెప్పారు.

మిలాన్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీతోపాటు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో పనిచేశారు. షెంజెన్‌లో ఉన్నంత టెక్నాలజీ వేగాన్ని అందుకోవడం అంత సులభం కాదని ఆయన చెబుతారు.

"మేం సాంకేతికతను అభివృద్ధి చేసే కేంద్రంలో ఉన్నాం. మా దగ్గర ప్రోగ్రాం డెవలప్‌మెంట్ కోసం అన్ని సౌకర్యాలూ ఉన్నాయి" అని ఆయన చెప్పారు.

"హార్డ్‌వేర్ అయినా, సాఫ్ట్‌వేర్ అయినా, మేం ఏ ప్రోగ్రాం డెవలప్ చేస్తే, అది రేపు ప్రపంచమంతా వ్యాపిస్తుంది. మనకు ఏది అవసరమైనా, ఆ వస్తువు షెంజెన్‌లో లభిస్తుంది"

ఫొటో క్యాప్షన్,

మిలాన్ పిల్లలకు రోబోటిక్స్ నేర్పిస్తారు

ఎలక్ట్రానిక్స్ మార్కెట్

షెంజెన్‌లోని ప్రముఖ హువా ఛియాంగ్ బే మార్కెట్ లాంటి ప్రాంతాల్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలూ లభిస్తాయి.

బహుళ అంతస్తుల ఎయిర్ కండిషన్డ్ మార్కెట్ లోపలంతా ఎలక్ట్రానిక్ వస్తువులు నిండిపోయి ఉంటాయి.

మొబైల్, డ్రోన్, చిప్స్, కంపొనెంట్, ఇలా మనలో బేరసారాలు ఆడే నైపుణ్యం ఉంటే, చాలా వస్తువులు చౌకగా కొనుగోలు చేయవచ్చు. షెంజెన్‌లో ఇలాంటి మార్కెట్లు చాలా ఉన్నాయి.

ఫొటో క్యాప్షన్,

షెంజెన్‌లోని ప్రముఖ హువా ఛియాంగ్ బే మార్కెట్

గణాంకాల ప్రకారం షెంజెన్ ఆర్థిక వ్యవస్థ 1979లో సుమారు 30 మిలియన్ డాలర్లు ఉండేది. అయితే 2016లో అది 256 మిలియన్ డాలర్లకు చేరింది.

అందుకే, భారతదేశానికి చెందిన లావా కంపెనీ కూడా 2009లో తన మొబైల్, టాబ్లెట్, ఫీచర్ ఫోన్ లాంటి ఉత్పత్తుల డిజైన్, మానుఫాక్చరింగ్ కోసం ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ తెరిచింది.

షెంజెన్‌ నగరాన్ని బేస్‌గా చేసుకున్న లావా కంపెనీ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మధ్యప్రాచ్యం, మెక్సికో, ఈజిఫ్ట్, ఆఫ్రికా లాంటి మార్కెట్లలో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

మేం మధ్యాహ్నం నాన్షాన్ జిల్లాలో ఉన్న లావా కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ ఉద్యోగులు ఒక గదిలో మంచాలపై నిద్రపోతున్నారు.

ఫొటో క్యాప్షన్,

భారతీయ సంస్థ లావా 2009లో ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేసింది

షెంజెన్‌లో పనిచేసే పద్ధతి ఇలాగే ఉంటుంది. అక్కడ కార్మికులకు మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తీసుకోవడానికి మంచాలు ఉంటాయి..

షెంజన్‌లో ఐదేళ్ల నుంచీ ఉంటున్న లావా డీజీఎం పైనాన్స్ రతిరామ్ "షెంజెన్‌లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనం మార్కెట్లో మెషినరీ లేదా పార్ట్స్ కొనడానికి వెళ్తే, అక్కడ మనకు తక్కువ ధరలో అన్ని వస్తువులూ దొరుకుతాయి. ఇక్కడ ప్రజలతో మాట్లాడడం చాలా సులభం. కంపొనెంట్ సప్లయర్స్ చాలా మంది ఉంటారు. భారత్‌లో అది సాధ్యం కాదు. ఇక్కడ ప్రతి వస్తువు బాగా చౌకగా లభిస్తుంది". అన్నారు.

దిల్లీకి చెందిన రతి రామ్ చైనాలోనే పెళ్లి చేసుకున్నారు. డిజైన్, రీసెర్చ్, మానుఫాక్చరింగ్ లాంటి చాలా అంశాల్లో శిక్షణ కోసం భారత ఇంజనీర్లు షెంజెన్ వస్తుంటారని రతిరామ్ చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

దిల్లీకి చెందిన రతి రామ్ చైనాలోనే పెళ్లి చేసుకున్నారు

సులభంగా పెట్టుబడులు

షెంజెన్ ఆర్థిక సంపదకు ఒక ముఖ్యమైన కారణం ప్రభుత్వ సబ్సిడీ లేదా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వెంచర్ కేపిటలిస్ట్.

స్మార్ట్ హెడ్‌లైట్, బిల్ట్-ఇన్ స్పీకర్ లాంటి సౌకర్యాలను అమర్చిన హెల్మెట్ తయారు చేసిన లివల్ వ్యవస్థాపకుడు బ్రయాన్ ఝంగ్ నాలుగేళ్ల క్రితం తన సంస్థను ప్రారంభించడానికి షెంజెన్ నగరాన్ని ఎంచుకున్నాడు. ఆయన 1994లో మొదటిసారి ఇక్కడికి వచ్చారు.

"అప్పుడు ఇది శుభ్రంగా ఉండే ఒక చిన్న నగరంలా ఉండేది. అప్పట్లో రెండు నెలలకు ఒకసారి కారు కడగాల్సి వచ్చేది. అప్పుడు నాకు నెలకు 600 యువాన్(సుమారు 6 వేల రూపాయలు) ఇచ్చేవారు. ఇప్పుడు ఆ డబ్బుతో షెంజెన్‌లో అద్దెకు ఉండడానికి ఇల్లు కూడా దొరకదు". అన్నారు ఝంగ్

ఫొటో క్యాప్షన్,

బ్రయాన్ ఝంగ్ నాలుగేళ్ల క్రితం షెంజెన్‌లో కంపెనీ ప్రారంభించారు

ప్రభుత్వం రీసెర్చ్, పేటెంట్, ట్రేడ్ మార్క్ కోసం లివల్‌కు 25 మిలియన్ యవాన్ ఇచ్చింది. నిధుల సాయంతో ఆ కంపెనీ ప్రపంచంలోని చాలా దేశాల్లో తన వ్యాపారం విస్తరించింది.

"షెంజెన్‌లో కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్స్‌కు ప్రోత్సాహం లభిస్తుంది. కంపెనీ వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. మేం చైనాలో, ప్రపంచవ్యాప్తంగా 170 పేటెంట్ల కోసం దరఖాస్తు చేశాం. ఒక స్టార్టప్ కోసం అన్ని నిధులు ఖర్చు చేయడం అంటే అంత సులభం కాదు" అని ఝంగ్ అంటారు.

గత 40 ఏళ్లలో గ్రామం నుంచి పవర్ హౌస్ నగరంగా మారడానికి షెంజెన్ తనకు అందిన ప్రతి అవకాశాన్నీ చక్కగా వినియోగించుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)