జింబాబ్వే ఎన్నికలు: 'నకిలీ' ఫలితాలను తిరస్కరించిన ప్రతిపక్షం

  • 3 ఆగస్టు 2018
ఎమర్సన్ నంగాగ్వా Image copyright Getty Images

జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్ నంగాగ్వా విజయాన్ని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసా.

ఇవి ‘ధ్రువీకరణ కాని నకిలీ ఫలితాలు’ అని ఆయన విమర్శించారు.

చమీసా నేతృత్వంలోని ఎండీసీ కూటమి ఈ ఎన్నికల ఫలితాలపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పింది. రిగ్గింగ్ బాగా జరిగిందని ఆరోపించింది.

దేశంలోని మొత్తం 10 ప్రావిన్సుల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. నంగాగ్వాకు 50.8 శాతం ఓట్లు, ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి.

స్వల్ప తేడాతో 50 శాతానికి పైగా ఓట్లు సాధించటంతో రెండో దఫా ఎన్నికలను నంగాగ్వా తప్పించుకున్నారు.

ఈ ఫలితం ‘సరికొత్త ప్రారంభం’ అని నంగాగ్వా అభివర్ణించారు. రెండోసారి అధ్యక్షునిగా ఎన్నిక కావటాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.

అయితే, ఈ ఎన్నికల్లో తానే గెలిచానని చమీసా విలేకరులతో చెప్పారు. కానీ, అధికార జాను-పీఎఫ్ పార్టీ అక్రమంగా ఫలితాలను సొంతం చేసుకుందని, ఆ పని తాము చేయలేకపోయామని అన్నారు.

కాగా, ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని జింబాబ్వే ఎన్నికల సంఘం ప్రకటించింది.

జింబాబ్వేను 37 ఏళ్ల పాటు పరిపాలించిన రాబర్ట్ ముగాబే (94)ను గత ఏడాది నవంబర్‌లో పదవీచ్యుతుడ్ని చేసిన తరువాత దేశంలో జరిగిన తొలి ఎన్నికలివి.

ముగాబే నేతృత్వంలో సాగిన అణచివేత పాలన నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆ దేశంలో సరికొత్త మార్గానికి పునాదిగా భావిస్తున్నారు.

Image copyright Getty Images

ఇదిలా ఉండగా, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ప్రతిపక్ష మద్దతుదారులు రాజధాని నగరం హరారేలో బుధవారం నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా చెలరేగిన హింస వల్ల ఆరుగురు చనిపోయారు. దీంతో ప్రజలంతా నిబంధనల ప్రకారం నడచుకోవాలని ఆదేశిస్తూ భద్రతా బలగాలు గురువారం నగరంలో గస్తీ నిర్వహించాయి. దీంతో హరారే నిర్మానుష్యంగా మారింది.

ఈ సంక్షోభాన్ని తొలగించేందుకు, ఎన్నికల్లో హింసకు పాల్పడినవారిపై చర్యలు తీసుకునేందుకుగాను స్వతంత్ర దర్యాప్తు నిర్వహించేందుకు ప్రభుత్వం చమీసాతో చర్చలు జరుపుతుందని నంగాగ్వా చెప్పారు.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఎవరైనా నేరుగా గెలుపొందాలంటే.. పోలైన ఓట్లలో కనీసం 50 శాతానికి పైగా ఓట్లు అవసరం. అలా రానిపక్షంలో.. మొదటి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థుల మధ్య సెప్టెంబర్ 8వ తేదీన మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారు. అయితే, 50.8 శాతం ఓట్లు సాధించిన నంగాగ్వా స్వల్ప మెజార్టీతో రెండోదఫా ఎన్నికలను తప్పించుకున్నారు.

పార్లమెంటు ఎన్నికల ఫలితాలు

కాగా, అధ్యక్ష ఎన్నికలతో పాటు జింబాబ్వే పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార జాను-పీఎఫ్ పార్టీకి 144 స్థానాలు, ఏడు పార్టీల కూటమి ఎండీసీకి 64 స్థానాలు, పదవీచ్యుతుడైన రాబర్ట్ ముగాబే విధేయులు ఏర్పాటు చేసిన నేషనల్ పాట్రియాటిక్ ఫ్రంట్‌కు ఒక స్థానం లభించాయి.

ఈ ఎన్నికల్లో తమకు భారీ ఆధిక్యం లభించిందని అధికార పార్టీ చెప్పుకుంటోంది. అయితే, 2013 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే జాను-పీఎఫ్ పార్టీ మెజార్టీ తగ్గింది. అప్పట్లో 160 స్థానాలు లభించాయి. ప్రతిపక్ష ఎండీసీ కూటమికి అప్పటి ఎన్నికల్లో 49 స్థానాలు దక్కాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ముగాబే హీరోనా, విలనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు