థాయిలాండ్: బౌద్ధారామంలో దీక్ష ముగించుకుని ఇంటికి చేరిన చిన్నారులు

  • 5 ఆగస్టు 2018
థాయ్‌లాండ్ బాలలు Image copyright AFP/GETTY

థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుని, సురక్షితంగా బయటపడ్డ చిన్నారులు బౌద్ధారామం నుంచి వారి ఇళ్లకు చేరారు. తమను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన డైవర్ జ్ఞాపకార్థంగా ఈ పిల్లలు ఒక బౌద్ధారామంలో బాల సన్యాసులుగా దీక్ష తీసుకున్నారు.

బౌద్ధారామంలో దీక్ష తీసుకున్న ఈ బాల సన్యాసులందరూ 11-17 సంవత్సరాల మధ్య ఉన్న వారే. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న మగవారు బౌద్ధారామంలో కొన్నాళ్లు సన్యాసులుగా గడపడం ఒక ఆచారం.

మొత్తం 12 మంది పిల్లల్లో ఒకరు క్రిస్టియన్ కావడంతో ఇక్కడ దీక్ష తీసుకోలేదు. దీక్ష ముగిశాక పిల్లలు తమ ఇళ్లకు బయలుదేరారు. కానీ బౌద్ధ భిక్షువుల ఆదేశానుసారం, వీరి కోచ్ మూడు నెలలపాటు బౌద్ధారామంలోనే ఉంటారు.

బౌద్ధారామంలో సన్యాసులుగా గడిపితే 'ఆత్మ శుద్ధి' అయినట్లు భావిస్తారు. వీరిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన డైవర్ సమన్ గునన్‌ను ఎప్పటికీ మరిచిపోలేమన్న తల్లిదండ్రుల వాగ్దానాన్ని నెరవేర్చడానికి బౌద్ధారామంలో కొంతకాలం గడిపినట్లయ్యింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionథాయ్‌లాండ్: బాలులను రక్షించిన వీరుల కుడ్యచిత్రాలు

బౌద్ధారామంలో గడిపిన తొమ్మిది రోజులూ ధ్యానం, ప్రార్థనలు చేస్తూ ఆలయాన్ని శుభ్రపరుస్తూ గడిపారు.

తమ కుటుంబాలను, స్నేహితులను కలవడానికి ముందు బౌద్ధ భిక్షువుల నుంచి ఆశీస్సులు పొందారు. ఆ సమయంలో, ఆచారం ప్రకారం, ''ఇప్పుడు నేను ఓ సాధారణ వ్యక్తిని'' అని పిల్లలు అన్నారు.

ఉత్తర థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న వీరిని రక్షించే క్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఉత్కంఠగా చూశారు. వీరి కథ థాయ్‌లాండ్‌కు మత్రమే పరిమితం కాలేదు.

కోచ్ తో పాటు 12 మంది బాలలు గుహలోకి వెళ్లారు. ఆ సమయంలో ఉధృతంగా వరద రావడంతో వారంతా అందులోనే చిక్కుకుపోయారు.

Image copyright AFP/GETTY

గుహలో చిక్కుకుపోయిన 9 రోజుల తర్వాత, ఇద్దరు బ్రిటీష్ డైవర్లు వీరిని కనుగొన్నారు. ఆ తొమ్మిది రోజులూ వర్షం నీళ్లు తాగుతూ, ధ్యానం చేస్తూ ప్రాణాలు నిలుపుకున్నారు.

వీరి కోచ్ అప్పటికే బౌద్ధ సన్యాసిగా దీక్షను తీసుకుని ఉన్నారు. ఆయనకు ధ్యానం తెలుసు. గుహలో చిక్కుకుపోయిన విపత్కర పరిస్థితుల్లో స్థిమితంగా ఉండేందుకు, ఆక్సిజన్ మితంగా వాడుకోవడానికి ఈ పిల్లల చేత ధ్యానం చేయించారు.

ఆ గుహలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వీరిని కాపాడేందుకు భారీ ప్రణాళిక రచించాల్సి వచ్చింది. మూడు రోజులపాటు శ్రమించి.. పిల్లలను, కోచ్‌ను ఇరుకైన, చీకటి నిండిన దారుల్లోంచి బయటకు తెచ్చారు.

Image copyright AFP/GETTY

బౌద్ధారామంలో దీక్ష తీసుకోవడానికి వారం రోజుల ముందుగా హాస్పిటల్ నుంచి బయటకొచ్చారు. విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డ పిల్లలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేవరకు వారికి కాస్త సమయం ఇవ్వాలని అధికారులు మీడియాను కోరారు.

Image copyright AFP/GETTY

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)