డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్న వెనిజ్వెలా అధ్యక్షుడు మడూరో

  • 5 ఆగస్టు 2018
వెనిజ్వెలా అధ్యక్షుడిపై డ్రోన్ దాడి

వెనిజ్వెలా అధ్యక్షుడు నికొలస్ మడూరో కరాకస్‌లో ప్రసంగిస్తున్నప్పుడు పేలుడు పదార్థాలున్న డ్రోన్స్ ఆయన పైనుంచి వెళ్లినట్టు ఆ దేశ అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.

దీనిని మడూరోపై జరిగిన హత్యాయత్నంగా సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్స్ తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు గాయపడ్డారని చెప్పారు.

టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ఒక సైనిక కార్యక్రమంలో మడూరో మాట్లాడుతున్నప్పుడు ఆయన, మిగతా అధికారులంతా హఠాత్తుగా పైకి చూడడం, ఉలిక్కిపడడం కనిపించింది. తర్వాత ఆడియో కట్ అయ్యింది.

ప్రసారాలు ఆపేసేముందు... అక్కడ వరుసల్లో నిలబడి ఉన్న సైనికులందరూ పక్కకు పరుగులు తీశారు. ఫుటేజిలో పెద్ద శబ్దాలు కూడా వినిపించాయి.

అధికారులు ఏం చెబుతున్నారు?

వెనిజ్వెలా సైన్యం 81వ వార్షికోత్సవం సందర్భంగా మడూరో మాట్లాడుతున్నప్పుడు డ్రోన్ దాడి జరిగిందని రోడ్రిగ్స్ చెప్పారు.

పేలుడు పదార్థాలతో ఉన్న రెండు డ్రోన్లు అధ్యక్షుడు నిలబడి ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్లాయన్నారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

"ఎన్నికల్లో ఓడిపోవడంతో వాళ్లు ఈ పని చేశారు" అని రోడ్రిగ్స్ తెలిపారు.

Image copyright AFP/GETTY IMAGES
చిత్రం శీర్షిక డ్రోన్ పేలుళ్లతో నల్లగా మారిన భవనాలు

రోడ్రిగ్స్ మేలో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మడూరో మరో ఆరేళ్ల పాటు దేశాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

గాయపడ్డ సైనికులకు చికిత్స అందిస్తున్నామని, డ్రోన్ దాడిపై అధ్యక్షుడు తన మంత్రులతో, సైనిక కమాండర్లతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు.

ఈ దాడి వెనుక తమ ప్రమేయం ఉన్నట్టు ఇప్పటి వరకూ ఏ బృందాలూ ప్రకటించలేదు.

Image copyright EPA
చిత్రం శీర్షిక ఒక సైనిక కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు మదురో

2017 జూన్‌లో వెనిజ్వెలా సుప్రీంకోర్టుపై దాడి జరిగింది. హెలికాప్టర్ నుంచి భవనంపై గ్రెనేడ్స్ విసిరారు.

హెలికాప్టర్‌తో తనే దాడి చేసినట్టు ఆస్కార్ పెరేజ్ అనే ఒక పైలట్ చెప్పాడు. మడూరో పాలనకు వ్యతిరేకంగా వెనిజ్వెలా ప్రజలు ముందుకు రావాలన్నారు. జనవరిలో కరాకస్ దగ్గర జరిగిన ఒక ఆపరేషన్‌లో పోలీసులు అతడిని కాల్చి చంపారు.

ప్రతిపక్షాలు అధ్యక్షుడు మడూరోను క్రూరుడుగా వర్ణిస్తున్నాయి. తన చేతుల్లో ఉన్న న్యాయవ్యవస్థను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయించారని ఆరోపిస్తునాయి. ఆయన మద్దతుదారులు మాత్రం మరోసారి తిరుగుబాటు రాకుండా మడూరో దేశాన్ని రక్షిస్తున్నారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచండి: తెలంగాణ హైకోర్టు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 11 స్థానాల్లో గెలుపు, ఒక స్థానంలో ఆధిక్యం

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి

‘#StopTeluguImposition’: తెలుగు భాషను తమపై రుద్దవద్దని తమిళులు ఎందుకు అంటున్నారు

'ఒక ఎంపీ నన్ను రేప్ చేశాడు.. కానీ, నా తండ్రి ఎవరికీ చెప్పకుండా దాచేయమన్నాడు’ - మాజీ ప్రధాని కుమార్తె