ప్రపంచంలో అత్యంత రొమాంటిక్ పోస్ట్బాక్సు

ఫొటో సోర్స్, Credit: Eliot Stein
ఎక్కడైనా వ్యక్తుల పేరుతోనో.. సంస్థల పేరుతోనో ఉత్తరాలు రాస్తారు. కానీ.. ఓ చెట్టుకు దేశవిదేశాల నుంచి ఎంతో మంది పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉత్తరాలు రాస్తున్నారు.
ఉత్తర జర్మనీలో యూటిన్ నగరానికి సమీపంలోని డొడావెర్ అడవిలో 500 ఏళ్ల ‘ఓక్ చెట్టు’ ఉంది. ప్రపంచంలోనే పోస్టల్ చిరునామా కలిగిన ఏకైక చెట్టు ఇదే.
దీని కోసమే ప్రత్యేకంగా ఓ పోస్టల్ కోడ్.. పోస్టు బాక్సు (చెట్టు తొర్ర)తో పాటు.. పోస్ట్‌మ్యాన్ కూడా ఉన్నారు.
ఒక చెట్టుకు ఇన్ని ఏర్పాట్లు చేయడమేంటి? అన్నదే మీ అనుమానం కదా.
ఫొటో సోర్స్, Getty Images
రొమాంటిక్ పోస్టు బాక్సు
ఈ చెట్టుకు ఉన్న పోస్టుబాక్సు(చెట్టు తొర్ర) ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ పోస్టుబాక్సుగా పేరుంది.
ఈ ఓక్ చెట్టుకు ఉత్తరం రాస్తే తొందరగా పెళ్లవుతుందని చాలా మంది నమ్మకం. తమకు పలానా లక్షణాలు, అర్హతలు ఉన్న భాగస్వామి కావాలని వివరిస్తూ.. ఇక్కడికి ఉత్తరాలు రాసి పంపుతారు. వాటిన్నింటినీ పోస్ట్‌మ్యాన్ తీసుకెళ్లి ఈ చెట్టు తొర్రలో వేస్తారు.
ఎవరైనా వచ్చి వాటిని తీసి చదువుకుని.. నచ్చితే దాన్ని రాసిన వారికి ప్రత్యుత్తరం పంపొచ్చు. అలా ఇద్దరి మధ్య ఏర్పడే పరిచయం కొన్నిసార్లు వివాహాల వరకూ వెళ్తుంది. ఇప్పటి వరకు ఈ చెట్టు 100కు పైగా జంటలను కలిపిందని స్థానికులు చెబుతున్నారు.
'పెళ్లి కుమారుడి ఓక్' అని పిలిచే ఈ చెట్టు చిరునామాకు దేశవిదేశాల నుంచి ఏటా 1000 ఉత్తరాలు దాకా వస్తున్నాయని జర్మనీ తపాలా సేవల సంస్థ డచ్ పోస్ట్ అధికార ప్రతినిధి మార్టిన్ గ్రండ్లర్ చెప్పారు. వేసవిలో ఎక్కువగా ఉత్తరాలు వస్తాయని ఆయన తెలిపారు.
తాను ఆరు ఖండాల నుంచి వచ్చిన ఉత్తరాలను ఈ చెట్టుకు చేరవేశానని, వాటిలో కొన్ని తనకు ఏమాత్రం అర్థంకాని భాషలోనూ ఉండేవని 1984 నుంచి రెండు దశాబ్దాలపాటు ఇక్కడ పోస్టుమ్యాన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన మార్టెన్స్ వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
128 ఏళ్ల కిందటి ప్రేమ కథ
ఈ నమ్మకం ఏర్పడటానికి 128 ఏళ్ల కిందటి ఓ జంట ప్రేమ కథే కారణమని మార్టెన్స్ చెప్పారు.
ఆయన కథనం ప్రకారం.. 1980లో మిన్నా అనే స్థానిక యువతి అదే ఊరికి చెందిన చాక్లెట్ తయారు చేసే విల్హెల్మ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే.. అతడిని కలవొద్దని, చూడొద్దని ఆ యువతి తండ్రి హెచ్చరించారు. దాంతో ఆ ఇద్దరూ రహస్యంగా లేఖల ద్వారా సంభాషించుకునేవారు. వీరద్దరూ నేరుగా కలుసుకోకుండా ఉత్తరాలను ఆ చెట్టు తొర్రలో వేస్తూ పరస్పరం మార్చుకునేవారు.
అలా ఓ ఏడాది గడిచిన తర్వాత ఆ యువతి తండ్రి వారి పెళ్లికి అంగీకరించారు. దాంతో ఆ చెట్టు కిందే ఆ జంట 1891 జూన్ 2న పెళ్లి చేసుకున్నారు.
ఆ జంట ప్రేమ కథ జర్మనీ అంతటా తెలియడంతో.. అప్పటి నుంచి ఈ చెట్టుకు ప్రేమ లేఖలు రావడం ప్రారంభమైంది.
ఉత్తరాల సంఖ్య పెరగడంతో డచ్ పోస్ట్ సంస్థ ఆ చెట్టుకు ప్రత్యేకంగా పోస్టల్ కోడ్, పోస్టు మ్యాన్‌ను కేటాయించింది.
చెట్టుకు మూడు మీటర్ల ఎత్తులో ఉన్న ఆ పోస్టు బాక్సు(తొర్ర) దగ్గరకు సులువుగా వెళ్లేందుకు ఓ నిచ్చెన కూడా ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి:
- వర్షాలు మొదలైతే చాలు... అక్కడ వజ్రాల వేట ప్రారంభం
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- #లబ్‌డబ్బు: భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర
- బంగారం, వజ్రాల గనులున్నా.. ఈ దేశంలో పేదరికం పోవట్లేదు
- డీడీ కోశాంబి: చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు.. కొత్తదారి చూపించారు
- టెలిగ్రాం యాప్ భారత్‌దేనా?
- ‘రేపిస్టులకు మరణశిక్ష’ చట్టంతో అత్యాచారాలు ఆగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)