BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’, పెళ్లికాని ప్రసాదులు

  • 5 ఆగస్టు 2018
చిత్రం శీర్షిక ‘చైనాలో ఒక మహిళ ఎంత ఎక్కువ చదువుకుంటే ఆమెకు పెళ్లికావటం అంత కష్టమవుతుంది’

చైనాలోని షాంఘై నగరంలో ఉన్న పీపుల్స్ పార్క్‌కు శనివారం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చాలామంది వచ్చారు.

కొందరు రోడ్డుకు ఇరువైపులా నిలబడితే, ఇంకొందరు కూర్చున్నారు. మరికొందరు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.

వాళ్లందరి వద్దా గొడుగులు ఉన్నాయి. నేలపై పెట్టిన గొడుగులపై కొన్ని పేపర్లు కనిపిస్తున్నాయి. వర్షానికి తడవకుండా ఆ పేపర్లను ప్లాస్టిక్ కవర్లలో పెట్టారు. గొడుగులపైనే కాదు మొక్కలపైన, నేలపైన, గోడలపైన కూడా కాగితాలను ప్రదర్శిస్తున్నారు.

ఆ కాగితాల్లో అమ్మాయి లేదా అబ్బాయిల వివరాలు ఉన్నాయి. వయస్సు, వార్షికాదాయం, విద్యార్హతలు, పుట్టిన తేదీలు, రాశులు.. ఇలాంటివన్నీ పేర్కొన్నారు.

ఇది పెళ్లిళ్ల సంత. 2005వ సంవత్సరం నుంచి షాంఘై నగరంలో ప్రతి వారాంతంలోనూ ఈ సంత జరుగుతోంది. తొలినాళ్లలో ఈ పార్కుకు ప్రజలు నడక, వ్యాయామం కోసం వచ్చేవాళ్లు. తర్వాత తమ పిల్లల పెళ్లి సంబంధాల కోసం వస్తున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఇదే చైనాలోని పెళ్లిళ్ల సంత

ఎందుకీ పెళ్లిళ్ల సంత?

చైనాలో ధరలు పెరిగిపోయాయి. అదే రీతిలో వరుడు, వధువు కోసం తల్లిదండ్రుల డిమాండ్లు కూడా పెరిగాయి.

దీంతో ఇక్కడ యువతకు చాలా ఆలస్యంగా పెళ్లి అవుతోంది. లేదా అసలు పెళ్లిళ్లే కావట్లేదు. అంతేకాదు, పెళ్లిళ్లు ఆలస్యం కావటం లేదా కాకపోవటం వల్ల వివాహం పట్ల చైనా యువత ఆలోచనా ధోరణే మారిపోతోంది.

చైనీస్ అకాడెమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ గణాంకాల ప్రకారం 2020 నాటికి దేశంలో 3 కోట్ల మంది పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు.

వేగంగా వృద్ధి చెందుతున్న చైనాలో బహుశా ఇది సాధారణమే కావచ్చు. ఎందుకంటే అమెరికా, జపాన్, భారత్ వంటి దేశాల్లో కూడా పెళ్లికాని వారి సంఖ్య ఇలాగే ఉంటోంది.

భారతదేశంలోలాగే చైనాలో కూడా పిల్లలకు పెళ్లిళ్లు కాకపోతే వాళ్ల తల్లిదండ్రులు, బంధువులు బాధపడుతుంటారు.

చిత్రం శీర్షిక 'నా మేనల్లుడు నెలకు 5 వేల యెన్‌లు సంపాదిస్తాడు. కానీ, అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం నెలకు 10 వేల యెన్‌లు సంపాదించే వరుడు కావాలని డిమాండ్ చేస్తున్నారు'

పెళ్లి చేసుకుంటే.. ఇల్లు చూసుకోవాల్సిన బాధ్యత అబ్బాయిదే

ఈ పార్కులో గ్రేస్ అనే ఒక మహిళను మేం కలిశాం.

ఈమె ఆస్ట్రేలియాలో నివసిస్తోంది. తన మేనల్లుడు ఝాంగ్ షి మింగ్‌ కోసం వధువును వెదుకుతోంది. కానీ, ఆమె మేనల్లుడిని చాలా కుటుంబాలు తిరస్కరిస్తున్నాయి.

మొబైల్ ఫోన్‌లో ఉన్న తన మేనల్లుడి ఫొటో చూపిస్తూ గ్రేస్ ఇలా అంటోంది.. ‘‘నా మేనల్లుడు నెలకు 5 వేల యెన్‌లు (రూ.50 వేలు) సంపాదిస్తాడు. కానీ, అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం నెలకు 10 వేల యెన్‌లు (రూ. లక్ష) సంపాదించే వరుడు కావాలని డిమాండ్ చేస్తున్నారు. నా మేనల్లుడు అమ్మాయిని వెతుక్కోలేకపోతున్నాడు. వాడి పరిస్థితి దారుణంగా ఉంది.’’

చైనా సంప్రదాయం ప్రకారం పెళ్లైన తర్వాత అమ్మాయి, అబ్బాయి నివసించేందుకుగాను ఇంటిని ఏర్పాటు చేసే బాధ్యత అబ్బాయిదేనని, ఇంటిలోకి అవసరమయ్యే గ‌ృహోపకరణాలను సమకూర్చటం అమ్మాయి బాధ్యత అని ఈ పార్కులో ఒక యువతి నవ్వుతూ చెప్పారు.

‘‘ఇప్పుడు ఇల్లు కొనాలంటే పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాలి. దాన్ని తీర్చాలంటే దశాబ్ధాలు పడుతుంది. మా తరంలో ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు ఇచ్చేది. మనల్ని ప్రేమించే భాగస్వామిని వెతుక్కోవటమే అప్పట్లో మన పని’’ అని గ్రేస్ అన్నారు.

సరైన సమయం, అవకాశం కోసం గ్రేస్ ఎదురుచూస్తున్నారు.

చిత్రం శీర్షిక 2005వ సంవత్సరం నుంచి షాంఘై నగరంలో ప్రతి వారాంతంలోనూ ఈ సంత జరుగుతుంది
చిత్రం శీర్షిక ఈ పెళ్లిళ్ల పార్కులో గొడుగులపై అమ్మాయిలు, అబ్బాయిల వివరాలున్న పేపర్లను ప్రదర్శిస్తున్నారు

‘మిగిలిపోయిన అమ్మాయిలు’

చదువుకున్నప్పటికీ.. సకాలంలో పెళ్లికాని యువతులను ‘లెఫ్ట్ ఓవర్’ (మిగిలిపోయిన) వారిగా పిలుస్తుంటారు చైనాలో. వారికి సరైన గౌరవం కూడా ఇవ్వరు.

‘‘ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రుల అమ్మాయిలంతా 35 ఏళ్లకు అటూ ఇటూగా ఉన్నవారే. వారందరికీ మంచి విద్య, ఉద్యోగం, జీతం ఉన్నాయి. కాబట్టి సరైన వరుడిని ఎంచుకునేందుకు వాళ్ల డిమాండ్లు కూడా అందనంత ఎత్తులో ఉంటున్నాయి. కానీ, ఈ అమ్మాయిలు 40 ఏళ్లకు చేరే సరికి, వాళ్లు ఆ డిమాండ్లను తగ్గించుకోవాల్సి వస్తుంది’’ అని గ్రేస్ చెప్పారు.

అమెరికా జర్నలిస్టు రోజీన్ లెక్ చైనాలోని ‘మిగిలిపోయిన’ మహిళల గురించి ఒక పుస్తకం రాశారు.

చైనాలో ఒక మహిళ ఎంత ఎక్కువ చదువుకుంటే ఆమెకు పెళ్లికావటం అంత కష్టమవుతుందని లెక్ అంటారు.

చైనాలో పెళ్లికి చట్టబద్ధమైన వయస్సు.. అబ్బాయిలకు 22 ఏళ్లు, అమ్మాయిలకు 20 ఏళ్లు.

చిత్రం శీర్షిక ‘చైనా సంప్రదాయం ప్రకారం పెళ్లైన తర్వాత అమ్మాయి, అబ్బాయి నివసించేందుకుగాను ఇంటిని ఏర్పాటు చేసే బాధ్యత అబ్బాయిదే. గ‌ృహోపకరణాలను సమకూర్చటం అమ్మాయి బాధ్యత’

పెళ్లిళ్ల సంతకు వస్తే వివాహం అయిపోతుందా?

పెళ్లిళ్ల సమస్యకు కారణం చైనా ప్రభుత్వ ‘ఏక సంతాన’ విధానమేనని చాలామంది భావిస్తున్నారు.

భారతదేశంలోలాగే చైనాలో కూడా కుటుంబాలు మగ పిల్లలను కోరుకుంటుంటాయి. ఏక సంతాన విధానం కారణంగా చాలామంది చాలా ఏళ్లపాటు మగ పిల్లలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో చైనాలో ఆడ-మగ నిష్పత్తిలో వ్యత్యాసాలు పెరిగాయి.

ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం గణాంకాల ప్రకారం 2016లో చైనాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 868 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు.

ఈ పెళ్లిళ్ల సంతలోని చాలామంది తల్లిదండ్రులకు ఉన్నది ఏక సంతానమే. ఈ సమస్యకు పట్టణీకరణ కూడా ఒక కారణంగా భావిస్తుంటారు.

స్థానిక జర్నలిస్టు అండేరా లియాంగ్ ఏమంటారంటే.. ‘‘పెళ్లి చేయటానికి చైనా సంప్రదాయ పద్ధతి ఇది కాదు. ఇక్కడికి వచ్చే చాలా కుటుంబాలు సంప్రదాయ నేపథ్యం ఉన్నవే. పిల్లలకు 35 నుంచి 40 ఏళ్లు రావటంతో.. తల్లిదండ్రులు ఈ ‘పెళ్లిళ్ల సంత’కు రావటం తప్పనిసరి అవుతోంది. ఇక్కడైతే తమ పిల్లలకు విశ్వసనీయ భాగస్వాముల్ని వెతకొచ్చు అన్నది వాళ్ల ఆలోచన.’’

అయితే, చాలా కుటుంబాలు చెప్పేదేమంటే.. ఈ పార్కు నుంచి పెళ్లి వరకు వెళ్లే జంటలు చాలా తక్కువ.

చిత్రం శీర్షిక ‘పిల్లలకు 35 నుంచి 40 ఏళ్లు రావటంతో.. తల్లిదండ్రులు ఈ 'పెళ్లిళ్ల సంత'కు రావటం తప్పనిసరి అవుతోంది’

‘ఏక సంతాన’ విధానం రద్దు చేసిన చైనా

పలుమార్లు నిరాకరించినప్పటికీ.. చివరికి మాతో మాట్లాడేందుకు ఒకమ్మాయి అంగీకరించింది. కానీ, తన పేరు చెప్పేందుకు మాత్రం ఇష్టపడలేదు. ‘‘పెళ్లి చేసుకునేందుకు ఇదొక మంచి వేదిక. ఇక్కడైతే ఒకరినొకరు కలుసుకోవచ్చు. అన్నీ సక్రమంగా ఉంటే ఆ సంబంధాన్ని ఖాయం చేసుకోవచ్చు’’ అని తెలిపింది.

చైనాలో దశాబ్దాల కాలంపాటు కొనసాగిన ‘ఏక సంతాన’ విధానాన్ని ఈ మధ్యనే ప్రభుత్వం రద్దు చేసింది. అంటే.. ఇక చైనాలోని ప్రజలు ఒకరికంటే ఎక్కువ మంది సంతానాన్ని కనవచ్చు. పెళ్లిళ్లకు సంబంధించిన సమస్యలను ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని నమ్ముతున్నారు.

1979లో ప్రవేశపెట్టిన ఏక సంతాన విధానం వల్ల చైనాలో జనాభా రేటు గణనీయంగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 40 కోట్ల మంది పిల్లలు తక్కువగా పుట్టారు. దీంతో దేశ ప్రజల సగటు వయసు పెరిగింది. ఇప్పుడు ఏక సంతాన విధానాన్ని తొలగించటంతో ఈ సగటు వయస్సు సమస్యకు కూడా పరిష్కారం కనుగొన్నట్లేనని ప్రభుత్వం భావిస్తోంది.

‘‘మారిన విధానం కారణంగా పెళ్లి, ప్రజల సగటు వయసు సమస్యలకు రాబోయే కొన్నేళ్లలోనే పరిష్కారం లభిస్తుంది’’ అని అండేరా చెప్పారు.

వర్చువల్ బాయ్‌ఫ్రెండ్లు, ఆన్‌లైన్ పెళ్లి వెబ్‌సైట్లు, పెళ్లి సంబంధాల మధ్యవర్తులు వంటి చాలా మార్గాల ద్వారా తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు చైనాలోని తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వారి ప్రయత్నాలు తగిన ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో దక్కట్లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)