ఆత్మాహుతి దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం... కుట్రదారులకు కఠినంగా శిక్షిస్తామన్న వెనిజ్వెలా అధ్యక్షుడు నికొలస్ మడూరో

  • 5 ఆగస్టు 2018
వెనిజ్వెలా అధ్యక్షుడు నికొలస్ మడూరో Image copyright Getty Images

వెనిజ్వెలా అధ్యక్షుడు నికొలస్ మడూరో తనను ‘హత్య చేసేందుకు’ ప్రయత్నించిన కుట్రదారులు ‘గరిష్ఠ శిక్ష’ అనుభవిస్తారని అన్నారు.

దేశ రాజధాని నగరం కరాకస్‌లో ఆదివారం వెనిజ్వెలా సైన్యం 81వ వార్షికోత్సవం సందర్భంగా మడూరో ప్రసంగిస్తున్నప్పుడు పేలుడు పదార్థాలున్న డ్రోన్స్ ఆయన పైనుంచి వెళ్లినట్టు ఆ దేశ అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఇది తన ప్రాణాలు తీసేందుకు జరిగిన హత్యాయత్నమని మాడురో అంటున్నారు. దీనికి కుట్రపన్నింది కొలంబియా అని ఆరోపించారు. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆయన చూపించలేదు. కొలంబియా మాత్రం మడూరో ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది.

ప్రతిపక్షం కూడా ఈ ప్రమాదానికి కారణం కావొచ్చని ప్రభుత్వం నిందిస్తోంది. ప్రతిపక్షాలపై అణచివేత చర్యలు చేపట్టే అవకాశం ఉందనే భయాందోళనలు దేశంలో వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో చాలామంది ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే దేశం విడిచివెళ్లిపోయారు. ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని వారు పేర్కొన్నారు. దేశ జైళ్లలో 200 మంది రాజకీయ ఖైదీలు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.

Image copyright AFP/GETTY IMAGES

అసలేం జరిగింది?

వెనిజ్వెలా సైన్యం 81వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మడూరో పాల్గొన్నారు.

ఆయన ప్రసంగిస్తుండగా పెద్ద శబ్ధం వచ్చింది. వీడియో ఫుటేజీని బట్టి.. ప్రసంగం మధ్యలో మడూరో హఠాత్తుగా పైకి చూశారు. పదుల సంఖ్యలో సైనికులు వేదిక వద్ద నుంచి పరుగులు తీస్తూ కనిపించారు.

దీనిని మడూరోపై జరిగిన హత్యాయత్నంగా సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్ తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు గాయపడ్డారని చెప్పారు.

ఈ ప్రమాదం తర్వాత చాలామందిని అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

‘‘నేను బాగానే ఉన్నాను. బతికే ఉన్నాను. విప్లవ దారిలో ప్రయాణించాలని ఈ దాడి తర్వాత నేను మరింతగా గట్టిగా నిర్ణయించుకున్నాను’’ అని మడూరో చెప్పారు.

‘‘న్యాయం! గరిష్ఠ శిక్ష! ఇక క్షమించడాలేమీ ఉండవు’’ అని ఆయన అన్నారు.

Image copyright Getty Images

దాడి వెనుక ఎవరు ఉండొచ్చు?

తనను హతమార్చేందుకు ఇదొక ‘‘మితవాద కుట్ర’’ అని మడూరో అన్నారు. పొరుగున ఉన్న కొలంబియా, అమెరికాలోని కొన్ని శక్తులు దీనికి కారణమని ఆయన ఆరోపించారు.

అయితే, ఈ దాడిలో తమ పాత్ర ఏమీ లేదని కొలంబియా ప్రభుత్వం తెలిపింది. మడూరో ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది.

ఈ సంఘటనలో తమ జోక్యం ఏమీ లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. ‘‘ప్రభుత్వం తనపై తాను ఏర్పాటు చేసుకున్న దాడి’’ అని ఆయన అన్నారు.

ఈ దాడికి పాల్పడింది దేశంలోని మితవాద ప్రతిపక్షమేనని రోడ్రిగ్ నిందించారు.

ఈ ఏడాది మే నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మడూరో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరో ఆరు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

ప్రతిపక్ష వలుంటడ్ పాపులర్ పార్టీ‌కి చెందిన యువ నాయకుడు హస్లెర్ ఇంగ్లెసియాస్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘గత 20 ఏళ్లలో ఎన్నడూ ఈ విధమైన దాడికి ప్రయత్నాలు కూడా ప్రతిపక్షం చేయలేదు. అలాంటిది ఇప్పుడు దాడి చేస్తుందనుకోవటం నమ్మశక్యం కాని విషయం’’ అని అన్నారు.

సోల్జర్స్ ఇన్ టీ షర్ట్స్ అనే అంతగా పేరులేని ఒక బృందం మాత్రం ఈ దాడికి పాల్పడింది తామేనని సోషల్ మీడియా ద్వారా ప్రకటించుకుంది. అయితే, దీనికి ఎలాంటి ఆధారాలనూ చూపలేదు. దీనిపై ఆరా తీసేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.

గ్యాసు ట్యాంకు పేలడం వల్లే...

కాగా, సంఘటన జరగ్గానే అక్కడికి చేరుకున్న అగ్నిమాపకదళ సభ్యులు మాత్రం ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా మాట్లాడారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.

తమ పేర్లు వెల్లడించేందుకు ఇష్టపడని ముగ్గురు అగ్నిమాపకదళ సభ్యులు, ఈ ప్రమాదం ఒక అపార్ట్‌మెంట్‌లోని గ్యాసు ట్యాంకు పేలడం వల్ల సంభవించిందని చెప్పారు. అంతకుమించి వివరాలు చెప్పేందుకు వారు ఇష్టపడలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)