ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
క్రూరమైన నియంత

ఫొటో సోర్స్, Getty Images

1972, ఆగస్టు 4. బీబీసీ వార్తలు వస్తున్నాయి. హఠాత్తుగా యుగాండా నియంత ఈదీ అమీన్ ఆ దేశంలో ఎన్నో ఏళ్లనుంచీ ఉంటున్న 60 వేల మంది ఆసియా వాసులను అప్పటికప్పుడే దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడని చెప్పారు.

దేశం విడిచి వెళ్లడానికి వారందరికీ కేవలం 90 రోజుల గడువు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆరు అడుగుల నాలుగు అంగుళాల పొడవు, 135 కిలోల బరువు ఉండే అమీన్‌ను ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరుడైన నియంతగా చెబుతారు.

ఒకప్పుడు యుగాండా హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయిన ఈదీ అమీన్ 1971లో మిల్టన్ ఒబోటేను తప్పించి అధికారంలోకి వచ్చాడు.

ఆయన ఎనిమిదేళ్ల పాలన భయంకరమైన క్రూర ఘటనలకు సాక్ష్యంగా నిలిచిపోయింది. ఆధునిక చరిత్రలో అలాంటి ఉదాహరణలు చాలా తక్కువగా కనిపిస్తాయి.

1972 ఆగస్టు 4న ఈదీ అమీన్‌కు ఒక కల కన్నాడు. యుగాండాలోని టొరోరో నగరంలో తన సైనికాధికారులతో సమావేశమైన ఆయన... ఆసియా ప్రజలందరినీ దేశం నుంచి వెంటనే పంపించివేయమని అల్లా తనను ఆదేశించాడని వారితో చెప్పారు.

"ఆసియా వాసులు తమకు తాముగా యుగాండా ప్రజలతో విడిపోయారు. వాళ్లు ఈ దేశ ప్రజలతో కలిసుండడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. వాళ్లు ఎక్కువగా యుగాండాను దోచుకోవాలనే చూస్తున్నారు. అని అమీన్ అన్నారు.

క్రూరమైన నియంత

ఫొటో సోర్స్, Getty Images

ఆసియా ప్రజలను తరిమికొట్టమని గడాఫీ సలహా

మొదట్లో అమీన్ ప్రకటనను ఆసియా ప్రజలు అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆయన ఏదో ఆవేశంతో అలా అన్నారనుకున్నారు. కానీ, అమీన్ తమను దేశం నుంచి తరిమేయాలని గట్టిగా అనుకున్నాడని వాళ్లకు మరికొన్ని రోజుల్లోనే తెలిసిపోయింది.

అల్లా తనకు కలలో కనిపించి, నిర్ణయం తీసుకోమని చెప్పాడని అమీన్ ఆ తరువాత చాలాసార్లు చెప్పారు. కానీ అమీన్ పాలనపై 'ఘోస్ట్ ఆఫ్ కంపాలా' అనే పుస్తకం రాసిన జార్జ్ ఇవాన్ స్మిత్, అందులో "లిబియా నియంత గడాఫీ ప్రేరణతోనే ఆయన అలా చేశారు. అలా చేస్తే నీకు దేశంపై మంచి పట్టు ఉంటుందని, అప్పుడే ఆర్థిక వ్యవస్థపై పూర్తి నియంత్రణ తెచ్చుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. ఇటలీవాసుల నుంచి నేను నా దేశ ప్రజలను విడిపించినట్టు, నువ్వు కూడా ఆసియా ప్రజల నుంచి మీ వారిని విడిపించు అని చెప్పారు" అని వివరించారు.

క్రూరమైన నియంత

కేవలం 55 పౌండ్లు తీసుకెళ్లడానికి అనుమతి

అమీన్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించేందుకు మంత్రి జెఫ్రీ రిపన్‌ను కంపాలా పంపించింది బ్రిటన్. అయితే, రిపన్ అక్కడికి చేరుకునేసరికి, తాను చాలా బిజీగా ఉన్నానని, మరో ఐదు రోజుల వరకు కలవడానికి వీలు కాదంటూ అమీన్ తన సందేశం పంపారు.

రిపన్ తిరిగి లండన్ వెళ్లాలని అనుకున్నారు. చివరికి అధికారులు ఒప్పించడంతో అమీన్ నాలుగో రోజు రిపన్‌ను కలవడానికి ఒప్పుకున్నారు. కానీ, దానివల్ల ఎలాంటి లాభం లేకుండాపోయింది.

అమీన్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. భారత ప్రభుత్వం కూడా పరిస్థితిని అంచనా వేయడానికి నిరంజన్ దేశాయ్ అనే ఫారిన్ సర్వీస్ అధికారిని కంపాలా పంపించింది.

"నేను కంపాలా చేరుకున్నప్పుడు అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. వారిలో కొంతమంది జీవితంలో ఎప్పుడూ యుగాండా దాటి బయటకు వెళ్లలేదు. ప్రతి వ్యక్తి తనతోపాటు 55 పౌండ్లు, 250 కిలోల సామాను మాత్రమే తీసుకెళ్లడానికే అనుమతించారు. కంపాలా బయట నివసించే ఆసియా ప్రజలకు ఈ నిబంధనల గురించి తెలీదు" అని నిరంజన్ దేశాయ్ గుర్తు చేసుకున్నారు.

క్రూరమైన నియంత

జనాలు తమ తోటల్లో బంగారం పూడ్చిపెట్టారు

అమీన్ అంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో, యుగాండా ప్రభుత్వం దానిని అప్పటికప్పుడే అమలు చేయలేకపోయింది. దాంతో ఆ దేశంలో సంపన్నులైన ఆసియావాసులు కొందరు తమ డబ్బు ఖర్చు చేయడానికి ఒక తెలివైన పద్ధతి ఎంచుకున్నారు.

అంత డబ్బు బయటకు తీసుకెళ్లలేనపుడు, ఆ సంపాదనతో జల్సా చేద్దామని వారు అనుకున్నారు. కొందరు తెలివిగా తమ డబ్బుతో బయటకు కూడా చేరుకోగలిగారు. ప్రపంచమంతా తిరగడానికి మొత్తం కుటుంబానికి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కోవడం అనేది ఒక సులభమైన పద్ధతి. ఇందులో ఎంసీఓ ద్వారా వాళ్లు ముందే హోటల్ బుకింగ్ కూడా చేసుకున్నారు అని నిరంజన్ దేశాయ్ చెప్పారు.

ఈ ఎంసీఓ (మిసిలేనియస్ చార్జ్ ఆర్డర్)లను యుగాండా నుంచి బయటికి వెళ్లిపోయాక క్యాష్ చేసుకోవచ్చు. కొంతమంది తమ కార్ల కార్పెట్ కింద నగలు దాచి పొరుగునే ఉన్న కెన్యా చేరుకున్నారు. కొంతమంది పార్శిల్ ద్వారా తమ బంగారం ఇంగ్లండ్ పంపించేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారంతా తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నారు. కొంతకాలం తర్వాత తాము తిరిగి యుగాండా వస్తామని వారిలో కొందరికి నమ్మకం కూడా ఉంది. అందుకే వాళ్లు తమ ఆభరణాలను లాన్‌ లేదా తోటలో గుంత తవ్వి పూడ్చిపెట్టేశారు. అక్కడే ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా లాకర్‌లో నగలను పెట్టిన కొందరు 15 ఏళ్ల తర్వాత తిరిగి యుగాండాకు వచ్చి వాటిని సురక్షితంగా తీసుకున్నారుని ఆయన చెప్పారు.

క్రూరమైన నియంత

ఫొటో సోర్స్, Getty Images

వేలికి ఉన్న ఉంగరాన్ని కత్తిరించా

ప్రస్తుతం లండన్‌లో ఉన్న గీతా వాట్స్‌కు తను లండన్ వెళ్లడానికి ఎంటెబ్బే విమానాశ్రయానికి చేరుకున్న ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది.

"మాతోపాటూ తీసుకెళ్లడానికి మాకు కేవలం 55 పౌండ్లు ఇచ్చారు. మేం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అక్కడ అందరి సూట్‌కేసులు తనిఖీ చేస్తున్నారు. డబ్బు, బంగారం దాచారేమో అని లోపల ఉన్న ప్రతి వస్తువునూ బయట తీసి విసిరేస్తున్నారు". అని గీతా చెప్పారు.

"నా వేలికి ఒక బంగారు ఉంగరం ఉంది. దాన్ని తీసి తమకు ఇచ్చేయమని వాళ్లు అడిగారు. అది నా వేలికి గట్టిగా బిగుసుకుపోయుంది. రావడం లేదు. చివరికి నేను దాన్ని కత్తిరించి తీశాను. నేను ఉంగరం కట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఆయుధాలతో యుగాండా సైనికులు నా చుట్టూ నిలబడి ఉన్నారు"

క్రూరమైన నియంత

ఫొటో సోర్స్, PA

32 కిలోమీటర్లలో 5 చెక్‌పోస్టులు

చాలా మంది ఆసియా ప్రజలు తమ షాపులు, ఇళ్లు అలా తెరిచి ఉంచే రావాల్సి వచ్చింది. వాళ్లను ఇంట్లో సామాను కూడా అమ్ముకోనివ్వలేదు. తమతో పాటు బయటికి తీసుకెళ్లే సామాన్లను లాక్కోడానికి యుగాండా సైనికులు సిద్ధంగా ఉండేవారు.

"కంపాలా నుంచి ఎంటెబ్బే విమానాశ్రయం 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యుగాండా నుంచి బయటికి వెళ్లే ప్రతి ఆసియావాసి మధ్యలో ఉన్న అయిదు రోడ్ బ్లాక్స్ నుంచి వెళ్లాల్సి వచ్చింది. ప్రతి రోడ్ బ్లాక్‌పై వారిని తనిఖీ చేసేవారు. వారి నుంచి ఏదో ఒక సామాను తీసుకోవాలని సైనికులు ప్రయత్నించేవాళ్లు" అని నిరంజన్ దేశాయ్ తెలిపారు.

ఆసియావాసులు వదిలి వెళ్లిన ఆ సంపదంతా ఏమయ్యిందని నేను నిరంజన్ దేశాయిని అడిగాను.

జవాబుగా దేశాయ్ "ఎక్కువ సామాను అమీన్ ప్రభుత్వంలోని అవినీతి మంత్రులు, సైనికాధికారులు సొంతం చేసుకున్నారు. సాధారణ ప్రజలకు వాటిలో చాలా తక్కువ భాగం లభించింది. వాళ్లు ఇలా స్వాధీనం చేసుకున్న సంపదను 'బంగ్లాదేశ్' అనే కోడ్ భాషలో పిలుచుకునేవారు" అని చెప్పారు.

"ఆ సమయంలోనే బంగ్లాదేశ్‌కు కొత్తగా స్వతంత్రం వచ్చింది. అందుకే, సైనికాధికారులు తరచూ వాళ్ల దగ్గర ఎన్ని 'బంగ్లాదేశ్' ఉన్నాయి అని మాట్లాడుకునేవారు".

జార్జ్ ఇవాన్ స్మిత్ తన పుస్తకం 'ఘోస్ట్ ఆఫ్ కంపాలా'లో "ఆసియావాసుల దుకాణాలు, హోటళ్లను అమీన్ ఎక్కువగా తన సైనికులకు ఇచ్చేశారు. కొన్ని వీడియోల్లో అమీన్ కొన్ని షాపులు, హోటళ్లు చూపిస్తూ వాటిని ఏయే బ్రిగేడియర్లకు ఇవ్వాలో తన పక్కనున్న అధికారికి చెబుతుంటారు" అని రాశారు. అయితే, ఆ అధికారులకు ఉచితంగా వచ్చిన దుకాణాలను, హోటళ్లను చూసుకునే ఆలోచన లేదు. దాంతో, వాళ్లు తమ వాళ్లను అక్కడికి పిలిపించి, ఏది కావాలంటే అది తీసుకెళ్లమని చెప్పేవారు. వాళ్లకు కొత్త వస్తువులు ఎక్కడ కొనాలో, వాటికి ఎంత వసూలు చేయాలో తెలీదు. ఫలితంగా, కొన్ని రోజుల్లోనే యుగాండా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆయన వివరించారు.

క్రూరమైన నియంత

ఫొటో సోర్స్, Getty Images

అమీన్ క్రూరత్వం, విధ్వంసం

ఈ మొత్తం ఘటన అమీర్‌కు ఒక నిరంకుశ పాలకుడనే పేరు తెచ్చింది. అతడి క్రూరత్వం గురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకునేవారు.

అమీన్ హయాంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న హెన్రీ కెయెంబా 'ఎ స్టేట్ ఆఫ్ బ్లడ్: ద ఇన్‌సైడ్ స్టోరీ ఆఫ్ ఈదీ అమీన్' అనే ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన అమీన్ క్రూరత్వం గురించి చెప్పిన విషయాలు ప్రపంచాన్నంతా వణికించాయి.

"అమీన్ తన శత్రువులను చంపడమే కాదు, వారు చనిపోయిన తర్వాత వారి శవాలను కూడా వదిలేవాడు కాడు. మార్చురీలో శవాలు తెరిచి ఉండేవని, వాటి మూత్రపిండాలు, కాలేయం, ముక్కు, పెదవులు, మర్మాంగాలు మాయమయ్యేవని యుగాండా మెడికల్ ఉద్యోగులు ఎప్పుడూ చెప్పుకునేవారు. 1974 జూన్‌లో ఫారిన్ సర్వీస్ అధికారి గాడ్‌ఫ్రీ కిగాలాను కాల్చి చంపినప్పుడు అతడి కళ్లు పీకి శవాన్ని కంపాలా బయట అడవుల్లో పడేశారు"

చనిపోయిన వ్యక్తుల మధ్య కాసేపు ఒంటరిగా గడపాలని అనుకుంటున్నట్టు అమీన్ తనతో చాలాసార్లు అన్నారని, 1974 మార్చిలో కార్యనిర్వాహక సైన్యాధ్యక్షుడు బ్రిగేడియర్ చార్లెస్ అరూబే హత్య జరిగినపుడు, అమీన్ ఆయన శవాన్ని చూడడానికి ములాగో ఆస్పత్రిలోని మార్చురీకి కూడా వచ్చాడని తర్వాత ఒక ప్రకటనలో కెయంబా తెలిపారు.

"శవంతోపాటూ తను అక్కడే కాసేపు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నట్టు అమీన్ ఆస్పత్రిలోని అధికారితో చెప్పారు. కానీ, ఆయన అక్కడ ఆ శవంతో ఏం చేశాడో ఎవరూ చూళ్లేదు. కానీ కొంతమంది యుగాండావాసులు మాత్రం ఆయన కాక్వా జాతి సంప్రదాయం ప్రకారం తన శత్రువు రక్తం తాగారని చెబుతారు. అమీన్ కాక్వా జాతికి చెందినవారు"

క్రూరమైన నియంత

మనిషి మాంసం తిన్నారనే ఆరోపణలు

కొన్నిసార్లు తను మనిషి మాంసం తిన్నానని కూడా అధ్యక్షుడు మా అందరి ముందు చెప్పేవారని కెయెంబా రాశారు.

"నాకు గుర్తుంది. 1975 ఆగస్టులో అమీన్ కొంతమంది సీనియర్ అధికారులకు తన జయీర్ పర్యటన గురించి చెబుతున్నారు. అప్పుడు ఆయన అక్కడ తనకు కోతి మాంసం వడ్డించారని, కానీ అది మనిషి మాంసం కంటే అంత రుచిగా లేదని చెప్పారు. యుద్ధ సమయంలో మనతో ఉన్న సైనికుడు గాయపడినప్పుడు, అతడిని చంపేసి తినడం వల్ల మన ఆకలి తీర్చుకోవచ్చని చెప్పారు" అని కెయెంబా రాశారు.

మరో సందర్భంలో యుగాండాలోని ఒక డాక్టరుతో "మనిషి మాంసం చిరుతపులి మాంసం కంటే రుచిగా ఉంటుంది" అని అమీన్ అన్నారని తెలిపారు.

క్రూరమైన నియంత

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ఐదో భార్య క్యోలాబాతో ఈదీ అమీన్

రిఫ్రిజిరేటర్‌లో నరికిన మనిషి తల

అమీన్ దగ్గర అప్పట్లో నౌకరుగా పనిచేసిన మోజెజ్ అలోగా, కెన్యా పారిపోయి వచ్చాక ఆయన గురించి ఒక కథ చెప్పారు. దానిని ఈ కాలంలో నమ్మాలంటే చాలా కష్టం.

అమీన్ హయాంలో యుగాండాలో భారత హై కమిషనర్‌గా ఉన్న మదన్‌జీత్ సింగ్ తన 'కల్చర్ ఆఫ్ ది సెపుల్కర్' పుస్తకంలో అలోగా చెప్పింది రాశారు. "అమీన్ పాత ఇంట్లోని కమాండ్ పోస్ట్‌లో ఒక గది ఎప్పుడూ మూసి ఉండేది, దాని లోపలికి వెళ్లడానికి నాకు మాత్రమే అనుమతి ఉండేది. నేను కూడా దాన్ని శుభ్రం చేయడానికి మాత్రమే వెళ్లేవాడిని అని అలోగా చెప్పాడు" అని తెలిపారు.

"అమీన్ ఐదో భార్య సారా క్యోలాబాకు ఆ గది గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. ఆమె నన్ను ఆ గదిని తెరవమని చెప్పారు. నేను భయపడ్డా. అమీన్ ఆ గదిలోకి ఎవర్నీ వెళ్లనీయద్దని నాకు చెప్పారు. కానీ, సారా చాలా గట్టిగా చెప్పారు, కొంత డబ్బు కూడా ఇచ్చారు. దాంతో నేను ఆ గది తాళం చెవి ఆమెకే ఇచ్చేశాను. గది లోపల ఉన్నరెండు రిఫ్రిజిరేటర్లలో ఆమె ఒక ఫ్రిజ్ తలుపు తెరిచింది. గట్టిగా అరిచి స్పృహతప్పి పడిపోయంది. ఆమె మాజీ ప్రియుడు జీజ్ గిటా తల నరికి అందులోనే ఉంచారు"

క్రూరమైన నియంత

ఫొటో సోర్స్, Getty Images

ఈదీ అమీన్ అంతఃపురం

సారా ప్రియుడిలాగే, అమీన్ చాలా మంది మహిళల ప్రియుల తలలు కూడా నరికించారు. ఇండస్ట్రియల్ కోర్ట్ చీఫ్ మైకేల్ కబాలీ కాగ్వా ప్రియురాలు హెలన్ ఓగ్వాంగ్‌పై అమీన్ కన్నుపడడంతో, ఆయన బాడీగార్డ్స్ కంపాలా ఇంటర్నేషనల్ హోటల్లో స్విమ్మింగ్ పూల్లో ఉన్న కబాలీని కాల్చిచంపారు. తర్వాత హెలెన్‌ను పారిస్‌లో ఉన్న యుగాండా రాయబార కార్యాలయంలో వేశారు. ఆమె అక్కడ్నుంచి పారిపోయి తప్పించుకుంది.

మకెరేరే యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్, తొరోరోలోని రాక్ హోటల్ మేనేజర్ భార్యలపై కూడా మనసుపడ్డ అమీన్ వారి భర్తలను పక్కా ప్లాన్ ప్రకారం చంపించారు.

అమీన్ ప్రియరాళ్ల సంఖ్యను లెక్కపెట్టడం కూడా కష్టం. ఒకప్పుడు ఆయన కనీసం 30 మంది మహిళలతో సంబంధాలు నడిపేవారని, వారికోసం ఆయన మొత్తం యుగాండా తిరిగేవారని చెబుతారు. ఆ మహిళలు ఎక్కువగా హోటళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో నర్సులుగా పనిచేస్తూ ఉండేవారని చెబుతారు.

క్రూరమైన నియంత

ఫొటో సోర్స్, PA

ఎక్కువ మంది ఆసియావాసులు బ్రిటన్ చేరారు

అయితే యుగాండా నుంచి ఆసియా వాసులను తరిమేసిన తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది.

"ఉత్పత్తుల లోటు ఊహించలేనంతగా పెరిగింది. హోటళ్లలో బ్రెడ్ లాంటివి కూడా దొంగిలించేవారు" అని నిరంజన్ దేశాయ్ చెప్పారు.

యుగాండా నుంచి బయటపడ్డ 60 వేల మందిలో 29 వేల మంది బ్రిటన్ చేరారు. 11 వేల మంది భారత్ వెళ్లారు. 5 వేల మంది కెనడాకు, మిగతా వారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు.

కట్టుబట్టలతో వచ్చిన వారందరినీ బ్రిటన్ రిటైల్ పరిశ్రమ ఆదుకుంది. బ్రిటన్‌లోని ప్రతి నగరంలో కూడళ్లలో పటేల్ దుకాణాలు తెరుచుకున్నాయి. వాళ్లు పాలు, వార్తా పత్రికలు అమ్మేవారు.

ఆరోజు యుగాండా నుంచి బ్రిటన్ వెళ్లిన కుటుంబాలన్నీ ఇప్పుడు బాగా స్థిరపడ్డాయి. ప్రాణాలతో బయటపడ్డ ఆసియ వాసులు బ్రిటన్ సంస్కృతికి అలవాటు పడడంతోపాటు ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో కూడా భాగమయ్యారు.

భారత ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు

ఈ విషాదం జరిగినప్పుడు, ఆశ్చర్యకరంగా భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది...

భారత్ దీనిని యుగాండా అంతర్గత విషయంగా భావించింది. అమీన్ పాలనకు వ్యతిరేకంగా ప్రపంచం అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

ఫలితంగా ఎంతోకాలం నుంచి తూర్పు ఆఫ్రికాలో నివసిస్తూ వచ్చిన భారతీయ కుటుంబాలు భారత్‌కు దూరంగా వెళ్లిపోయాయి. కష్టకాలంలో దేశం తమను ఆదుకోలేదనే భావనలో ఉండిపోయాయి.

8 ఏళ్లు పాలించిన ఈదీ అమీన్, తను ఎలా అధికారం చేజిక్కించుకున్నాడో, అలాగే అధికారం కోల్పోయారు.

అతడు మొదట లిబియా, తర్వాత సౌదీ అరేబియా వెళ్లి తన బంధువుల దగ్గర ఆశ్రయం పొందాడు. 2003లో 78 ఏళ్ల వయసులో చనిపోయారు.

ఇవికూడా చదవండి

line
line

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)