ఇండోనేసియా భూకంపం: మృతుల సంఖ్య పెరిగే అవకాశం

భూకంప ధాటికి కూలిన భవనం

ఫొటో సోర్స్, Getty Images

ఇండోనేసియాలోని లాంబక్ దీవిలో ఆదివారం ఉదయం సంభవించిన భూకంపం ధాటికి దాదాపు 100మంది చనిపోయారు. మరో 236 మంది గాయపడ్డారు.

రిక్టర్ స్కేల్‌ మీద భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. ఆ విపత్తు వల్ల వేలాది భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్, టెలిఫోన్ సేవలు నిలిచిపోయాయి.

ఇప్పటిదాకా అధికారులు లాంబక్ నుంచి దాదాపు 10 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దగ్గర్లోని గిలీ ఐలాండ్ నుంచి వెయ్యిమందికి పైగా పర్యటకులను ఖాళీ చేయించడానికి పడవలను ఏర్పాటు చేశారు.

ఇండోనేసియా భూకంప తీవ్రతను ఈ వీడియోలో చూడండి

వీడియో క్యాప్షన్,

వీడియో: ఇండోనేసియా భూకంపం తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూడండి

భయకంపితులైన స్థానికులు తిరిగి ఇళ్లకు వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం వారికి సురక్షిత స్థావరాలను కల్పించడానికే ప్రాధాన్యమిస్తున్నామని సహాయ సిబ్బంది తెలిపారు.

భూకంప ప్రభావిత ప్రాంతాలకు మరిన్ని విమానాలను పంపి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దేశాధ్యక్షుడు జోకో విడోడో ఆదేశించారు.

ఇప్పటికే లాంబక్‌కు వైద్యసేవల కోసం మూడు సి-130 హెర్కులెస్ విమానాలు, రెండు హెలికాప్టర్లను పంపించారు. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో చాలా ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారిందని ఇండోనేసియా విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది చెబుతున్నారు.

‘‘ప్రస్తుతం మృతుల సంఖ్య 98. అయితే, ఇది కచ్చితంగా పెరుగుతుంది’’ అని విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి సుటోపో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గిలీ దీవుల్లో సహాయక పడవల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

గిలీ దీవుల్లో పరిస్థితి

పర్యటకానికి బాగా పేరున్న గిలీ దీవులు కూడా భూకంపం ధాటికి దెబ్బతిన్నాయి. హోటళ్లు ధ్వంసమయ్యాయి. చాలామంది పర్యటకులు హోటళ్లను వదిలి సముద్ర తీరాలకు పరుగులు తీసినట్లు వీడియోల్లో కనిపించింది.

ఈ దీవిలోని ప్రజలు చనిపోయినట్లు వార్తలొచ్చినా వాటినెవరూ ధృవీకరించలేదు. ఇప్పటికే అక్కడి నుంచి కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా చాలామంది పర్యటకులు దీవిలోనే చిక్కుకున్నారు. వాళ్లందరినీ ఒకేసారి తరలించడానికి సరిపడా పడవలు లేవని ‘వెస్ట్ నూసా టెంగారా టూరిజం ఏజెన్సీ’ ప్రతినిధి ముహమ్మద్ ఫౌజల్ చెప్పారు.

యూకేకు చెందిన హెలెన్ మిల్న్ అనే మహిళ బీబీసీతో మాట్లాడుతూ తన కూతురు లారా కూడా గిలీ దీవిలో చిక్కుకుపోయినట్లు చెప్పారు.

‘వాళ్లంతా దీవిలోనే ఉండిపోయారు. అక్కడ అల్లర్లు, తోపులాటలు జరుగుతున్నాయని, పడవలు దొరకట్లేదని చెబుతున్నారు. నీళ్లు, ఆహారం కూడా లభించట్లేదు. దుకాణాలన్నీ మూతబడ్డాయి. రానురానూ పరిస్థితి వారికి మరింత ప్రతికూలంగా మారుతోంది’ అని ఆమె అన్నారు.

బాలీలో ఒక వ్యక్తి చనిపోయినట్లు అనధికార వార్తలొచ్చాయి. అక్కడి విమానాశ్రయం పాక్షికంగా దెబ్బతిన్నా, రాకపోకలు కొనసాగుతున్నాయి.

భూకంపానికి ఎక్కువగా దెబ్బతిన్న లాంబక్ దీవి, బాలీ నుంచి సుమారు 4,500 చదరపు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ పైన నెలకొని ఉండటంతో ఇండొనేసియాలో భూకంపాలతో పాటు అగ్ని పర్వతాలు బద్ధలయ్యే అవకాశాలూ ఎక్కువే.

ప్రపంచంలో సముద్రమట్టానికి ఎగువన ఉన్న సగానికి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు పసిఫిక్ రింగ్ పరిధిలోనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)