ఇంద్రా నూయీ: పన్నెండేళ్ల పెప్సీకో ప్రస్థానానికి గుడ్‌బై

ఇంద్రా నూయీ

ఫొటో సోర్స్, Getty Images

పెప్సీకో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంద్రా నూయీ 12 ఏళ్ళ తరువాత ఆ పదవి నుంచి వైదొలగుతున్నారు. ప్రపంచ వ్యాపార రంగంలో అత్యంత విజయవంతమైన లీడర్లలో ఆమె ఒకరు. ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఆమె వరసగా కనిపిస్తూ వచ్చారు. 2017లో ఆమె 11వ స్థానంలో నిలిచి అందర్నీ విస్మయానికి గురి చేశారు.

ఆమె 2006లో పెప్సీకో బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ కంపెనీ షేర్ విలువ 78 శాతం పెరిగింది. పెప్సీకోలో 24 ఏళ్ళు పని చేసిన నూయీ వయసు 62 ఏళ్ళు. ప్రస్తుత ప్రెసిడెంట్ రామన్ లాగ్యువార్టా ఆమె వారసత్వాన్ని స్వీకరిస్తారు.

పెప్సీకో నుంచి నిష్క్రమిస్తున్న తరుణంలో ట్విటర్లో తన మనోగతాన్ని షేర్ చేసుకుంటున్న నూయీ, పెప్సీకో వంటి సంస్థకు నాయకత్వం వహించే అవకాశం లభిస్తుందని తానెన్నడూ ఊహించలేదన్నారు.

ఈ పదవి నుంచి వైదొలగుతున్న వేళ మనసు ఎంతో భావోద్వేగాలకు గురవుతోందని కూడా ఆమె అన్నారు.

నూయీ 2006లో పెప్సీకో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాక మునుపు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆమె హయాంలో కంపెనీ 80 శాతం అభివృద్ధి సాధించిందని, సి.ఇ.ఓగా ఆమె దీర్ఘకాలిక ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసి సమకాలికుల మీద పైచేయి సాధించారని చెబుతూ పెప్సీకో ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే, ఇంద్రా నూయీ పెప్సీకో సంస్థ బోర్డ్ చైర్మన్ గా 2019 వరకూ కొనసాగుతారు.

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ బిజినెస్ కరెస్పాండెంట్ యోగితా లిమాయే విశ్లేషణ

అంతర్జాతీయ వేదిక మీద ఇంద్రా నూయీ సాధించిన విజయం భారతీయులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. చెన్నైలో పుట్టిన అమ్మాయి అమెరికాలో అతిపెద్ద సంస్థకు సి.ఇ.ఓ కావడంతో భారతదేశం ఆమెను అనుసరించింది. వేలాది మంది విద్యార్థులు ఏటా అమెరికన్ డ్రీమ్స్‌తో సరిహద్దులు దాటుతున్నారు.

ఆమె పెప్సీకో అధినేత్రి అయిన సందర్భంలో సిటిబ్యాంక్ చీఫ్ విక్రమ్ పండిట్ వంటి భారతీయ పురుషులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కానీ, నూయీ సాధించిన విజయం ప్రత్యేకమైనది. ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు, సాధించిన విజయాలు వ్యాపార చరిత్రలో నిలిచిపోతాయి.

ఆడపిల్ల పెళ్ళి చేసుకుని, ఇల్లాలుగా బాధ్యతలు చూసుకునే సంప్రదాయం బలంగా ఉన్న దేశం నుంచి ఇంద్రా నూయీ భారతీయ మహిళాలోకానికే ఒక ప్రేరణగా నిలిచే స్థాయికి చేరుకున్నారు.

ఇటీవల కొంతకాలంగా భారతీయులు అంతర్జాతీయ సంస్థల అధిపతులు కావడం మనం చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ళ, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ వంటి వారు ఈ మార్గంలో కొత్త శిఖరాలు అధిరోహిస్తుండడం భారతీయ సమాజాన్ని ఉత్తేజితం చేస్తోంది. అయితే, ఇంద్రా నూయీ కథ మాత్రం భారతీయ మహిళా జగతిలో ఒక చైతన్య దీప్తిలా ప్రకాశిస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)