ఆండ్రాయిడ్ పై: బాగా నిద్రపుచ్చుతుంది.. ఫోన్‌ను, మిమ్మల్నీ

ఆండ్రాయిడ్ పీ చిహ్నం

ఫొటో సోర్స్, Google

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)లో తాజా వెర్షన్ 'పై' వచ్చేసింది. కొత్త వెర్షన్‌‌తో ఎన్నో కొత్త ఫీచర్లూ అందుబాటులోకి వచ్చాయి.

యాప్స్‌ వినియోగాన్నిట్రాక్ చేసేలా కొత్త పద్ధతులను ఈ సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది.

ఆండ్రాయిడ్ సిరీస్‌లో తొమ్మిదవదైన ఈ ఓఎస్.. బ్యాటరీ జీవితకాలాన్ని పెంచడమే కాకుండా వినియోగదారులు ఫోన్‌ను అతిగా వాడకుండా నియంత్రించుకునేలా, నిద్రకు ఆటంకం రాకుండా చూసుకునేలా సహకరిస్తుందని తయారీ సంస్థ గూగుల్ చెబుతోంది.

కానీ, కొత్త ఓఎస్‌ల వినియోగం పెంచడంలో మాత్రం గూగుల్‌ కష్టాలు తీరడం లేదు.

గూగుల్ సంస్థ పదిహేను రోజుల కిందట వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం చూస్తే 'పై' కంటే ముందు వెర్షన్ అయిన 'ఓరియో' 12 శాతం ఆండ్రాయిడ్ డివైస్‌లలో మాత్రమే ఉంది.

ఆండ్రాయిడ్ అప్‌డేట్ వచ్చినప్పుడు వినియోగదారులు తమతమ ఫోన్లలో చెక్ చేసుకుని, సులభంగా అప్‌డేట్ చేసుకునేలా స్మార్టు ఫోన్ తయారీ సంస్థలతో కలిసి పనిచేశామని గూగుల్ చెప్తోంది.

మరోవైపు తాజా ఓఎస్ 'పై' ప్రస్తుతానికి కేవలం గూగుల్ సొంత తయారీ ఫోన్ 'పిక్సెల్' సిరీస్‌కే పరిమితమైంది.

ఫొటో సోర్స్, Google

'పై' అనే ఎందుకు పేరు పెట్టారు?

గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఎప్పుడు తీపి తినుబండారాల పేర్లు పెట్టడం ఆనవాయితీగా మార్చుకుంది. అది కూడా ఆంగ్ల అక్షర మాల ప్రకారం వరుసగా పేర్లు పెట్టుకుంటూ వస్తోంది.

'డోనట్'తో మొదలై 'పై' వరకు అలానే తీపి తినుబండారాల పేర్లను తన ఓఎస్‌లకు పెట్టింది.

దాంతో 'పీ' కంటే ముందు కూడా ఎన్నో అంచనాలు వెలువడ్డాయి. పిస్టాషియో ఐస్ క్రీమ్, పాప్ టార్ట్, పంప్‌కిన్ పీ వంటి పేర్లు వినిపించాయి. చివరకు పై అన్నదే ఖరారు చేశారు.

''యూజర్ ఇంటర్‌ఫేస్‌ను సులభతరం చేయాలన్నది మా లక్ష్యం. సులభ వినియోగానికి, సహజత్వానికి దగ్గరగా ఉండేలా పై అని పేరు పెట్టాం'' అని ఆండ్రాయిడ్ లండన్ ఇంజినీరింగ్ టీం చీఫ్ ఆండ్రీ పాపెస్క్యూ వివరించారు.

ఫొటో సోర్స్, Google

ఫొటో క్యాప్షన్,

ఫోన్ ఎంతసేపు వాడుతున్నామో చెప్పే డ్యాష్‌బోర్డ్

డిజిటల్ వెల్‌బీయింగ్ కంట్రోల్స్

కొత్త ఓఎస్‌లో 'డిజిటల్ వెల్‌బీయింగ్ కంట్రోల్స్' చాలా ప్రత్యేకం. స్మార్ట్‌ఫోన్లు మన నిద్రా రీతులను దెబ్బతీస్తాయని.. స్మార్ట్‌ఫోన్లకు చాలామంది బానిసవుతున్నారన్న విమర్శల నేపథ్యంలో గూగుల్ ఈ ఫీచర్ తీసుకొచ్చింది.

ఇందుకోసం ఒక డ్యాష్ బోర్డును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో యూజర్ ఎంతసేపు ఫోన్ వినియోగించారో తెలుస్తుంది. బాగా ఎక్కువగా వాడే కొన్ని యాప్స్‌ను ఎంతసేపు వినియోగించారన్నది నిమిషాల సహా ఇందులో చూపిస్తారు.

అంతేకాకుండా.. ఆయా యాప్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలంటే గరిష్ట పరిమితిని(మ్యాగ్జిమమ్ టైం లిమిట్) నిర్దేశించుకునే అవకాశం ఇందులో ఉంది.

అలా టైం లిమిట్ పెట్టుకున్న తరువాత ఆ సమయం సమీపించగానే తొలుత హెచ్చరిక వస్తుంది. సమయం ముగియగానే యాప్‌ ఐకాన్ రంగు మారుతుంది. యాప్ పనిచేయడం ఆగిపోతుంది. అయితే, ఇంకా కొనసాగించాలనుకుంటే యాప్‌ను మళ్లీ పనిచేసేలా చేయొచ్చు.

రాత్రిళ్లు నిర్దేశిత సమయానికి ఫోన్ 'డు నాట్ డిస్ట్రబ్' మోడ్‌లోకి మార్చుకునే అవకాశం ఈ కొత్త ఓఎస్‌లో ఉంది. ముందే సమయం సెట్ చేసుకుని ఉంటే అప్పటికి స్క్రీన్, యాప్స్ రంగు మారిపోయి ఫోన్ సైలెంట్‌లోకి వెళ్తుంది. కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్ల అలర్ట్స్ ఏవీ వినిపించవు. నిద్రకు ఇబ్బంది లేకుండా ఈ ఫీచర్ తీసుకొచ్చారు.

ఇలాంటి లక్ష్యంతోనే యాపిల్ కూడా ఐఓఎస్-12లో స్క్రీన్ టైం కంట్రోల్స్ తీసుకొస్తోంది.

ఫొటో సోర్స్, Google

ఫొటో క్యాప్షన్,

అడాప్టివ్ బ్యాటరీ ఫంక్షన్

నోటిఫికేషన్లలో మార్పులు.. బ్యాటరీ లైఫ్ పెంపు

ఆండ్రాయిడ్ 'పై'లో నోటిఫికేషన్ల అలర్ట్స్‌ సంబంధిత థంబ్‌నెయిల్స్‌తో వస్తాయి.

ఈ కొత్త వెర్షన్లోని 'స్మార్ట్ రిప్లయ్' ఆప్షన్ సహాయంతో నోటిఫికేషన్ల నుంచే మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వొచ్చు.

స్మార్ట్ ఫోన్ అంటే బ్యాటరీ చాలా తొందరగా అయిపోతుందని అందరికీ తెలుసు. ఆండ్రాయిడ్ 'పై'లో ఆ సమస్యకు పరిష్కారం చూపామంటోంది గూగుల్.

ఇందుకోసం డిస్‌ప్లే ఆఫ్‌లో ఉన్నప్పుడు బ్యాటరీ వినియోగం తగ్గేలా మార్పులు చేశారు.

బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే యాప్స్ తక్కువ బ్యాటరీని వినియోగించుకునేలా ప్రాసెసర్ కోర్‌లు రూపొందించారు.

దీంతోపాటు యూజర్ వాడకం తీరును ఓఎస్ అర్థం చేసుకునేలా మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఇందులో ఉన్నాయి. అస్సలు వాడని యాప్స్.. ఎప్పుడో తప్ప వాడని యాప్స్‌ను బ్యాక్ గ్రౌండ్‌లో పూర్తిగా ఆపేయడం.. ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు, వినియోగంలో లేని యాప్స్‌ను నియంత్రించడం వంటివన్నీ ఇందులో ఆటోమేటిగ్గా జరుగుతాయి. ఇది బ్యాటరీ ఎక్కువ సమయం ఉండేలా దోహదపడతాయి.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)