ఆస్ట్రేలియా: తీవ్ర కరవు కోరల్లో చిక్కుకున్న అత్యధిక జనాభా రాష్ట్రం.. ట్రక్కు దాణా రూ.5 లక్షలు.. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు

  • 8 ఆగస్టు 2018
ఆస్ట్ర్రేలియా కరువు Image copyright Reuters

ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన న్యూ సౌత్‌వేల్స్(ఎన్‌ఎస్‌డబ్య్లూ) రాష్ట్రం పూర్తిగా కరవుబారిన పడిందని అధికారులు ప్రకటించారు.

తూర్పు ఆస్ట్రేలియా చరిత్రలోనే ఈ స్థాయి కరవు ఎప్పడూ సంభవించలేదు. ఇక్కడ పొడి శీతాకాలం తీవ్రం కావడంతో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆస్ట్రేలియా వ్యవసాయ ఉత్పత్తుల్లో పావు భాగం న్యూ సౌత్‌వేల్స్ నుంచే వస్తుంది. ఈ ప్రాంతాన్ని 100 శాతం కరవు ప్రాంతంగా బుధవారం అధికారులు ప్రకటించారు.

దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం న్యూ సౌత్‌వేల్స్‌కు రూ. 29 వేల కోట్లను అత్యవసర సహాయ నిధి కింద ప్రకటించింది.

‘‘ఈ రాష్ట్రంలో వర్షం పడుతుందని ఒక్క రైతు కూడా భావించడం లేదు’’ అని న్యూ సౌత్‌వేల్స్ మంత్రి నియాల్ బ్లేర్ అన్నారు.

Image copyright Reuters

కరవుకు కారణం ఏంటీ?

ఇటీవల దక్షిణ ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయిలో వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం చరిత్రలో రెండో అతి తక్కువ స్థాయిలో 57 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం ఇక్కడ నమోదైంది.

న్యూ సౌత్‌వేల్స్‌లో జులైలో కేవలం 10 మి.మీ.ల కంటే తక్కువ వర్షం పడింది. ఆ తరువాత వాతావరణం మరింత పొడిగా మారి కరవు పరిస్థితికి దారితీసింది.

న్యూ సౌత్‌వేల్స్‌లో 23 శాతం ప్రాంతం పూర్తిస్థాయిలో కరవు కొరల్లో చిక్కుకుందని బుధవారం అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతం కరవు ప్రభావానికి లోనైందని చెప్పారు.

విక్టోరియా, దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతాలు కూడా కరవు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారులు మాత్రం ఇంకా ప్రకటించలేదు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశం కరవు ప్రాంతంగా మారుతుందని ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ హెచ్చరించారు.

Image copyright Reuters

పరిస్థితి ఎలా ఉందంటే ?

పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని, పశువుల మేతకు కూడా కష్టం అవుతోందని అంటున్నారు.

జంతువుల మేత కోసం ఒక్క ట్రక్కు దాణా కొనేందుకు కొందరు రూ. 5 లక్షల వరకు వెచ్చిస్తున్నారని ప్రధాని టర్న్‌బుల్ చెప్పారు.

పరిస్థితి జైల్లో ఉన్నట్లు ఉంది అని క్వీన్స్‌లాండ్ రైతు ఆష్లే గ్లాంబెల్ నైన్ నెట్‌వర్క్ మీడియాకు చెప్పారు.

''ఇంకా వర్షం పడుతుందనే నమ్మకం లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేం ఒకరికి ఒకరం అండగా నిలవాలి’' అని పశువుల కాపరి డేవిడ్ గ్రాహం బీబీసీకి చెప్పారు.

కరవు పరిస్థితులతో ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పోల్చిచూస్తే గ్రామీణ ప్రాంతాల్లో బలవన్మరణాలు 40 శాతం పెరిగాయని ఆస్ట్రేలియాలోని మెంటల్ హెల్త్ గ్రూప్ సంస్థ తెలిపింది.

Image copyright Reuters

పరిహారం అందుతోందా?

ఒక్కో రైతుకు ఈ ఏడాది మొదట్లోనే రూ.8 లక్షల వరకు పరిహారం అందించామని ప్రధాని టర్న్‌బుల్ తెలిపారు. దీనికి అదనంగా మరో రూ. 6 లక్షలను అందిస్తామని ప్రకటించారు.

ఆస్ట్రేలియా వాతావరణంలో కరవు భాగమని భావిస్తారని, రైతులు ఈ విషయం అర్థం చేసుకొని సహకరించాలని ఆయన కోరారు.

1997-2005లో వచ్చిన కరవు దేశంలోనే అత్యంత తీవ్రమైనదని అంటుంటారు. ఆ సమయంలో 50 శాతం సాగు ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెబుతారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం