పవన్‌ కల్యాణ్‌కు ఫిన్‌లాండ్ విద్యా విధానం ఎందుకంతగా నచ్చింది?

  • 13 ఆగస్టు 2018
విద్యార్థి

ఫిన్‌లాండ్‌లోని విద్యా విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అమలు చేయవచ్చో పరిశీలించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆ పార్టీ విధానాల రూపకల్పన కమిటీకి తాజాగా సూచించారు. అలాగే కొన్నేళ్లుగా ఫిన్‌లాండ్‌లోని విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు భారత్‌లోని పలు రాష్ట్రాలు కసరత్తులు చేస్తున్నాయి. అందుకోసం ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు దిల్లీ రాష్ట్రాల నుంచి అధికారుల బృందాలు ఫిన్‌లాండ్‌కు వెళ్లి అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి వచ్చాయి.

మరి భారత్‌ను ఇంతగా ఆకర్షిస్తున్న ఫిన్‌లాండ్‌ విద్యావిధానం ఎలా ఉంది?

అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశాల్లో ఒకటిగా ఫిన్‌లాండ్ నిలవడానికి కారణం ఏంటి?

దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు తెచ్చుకుంది ఫిన్‌లాండ్.

మూడేళ్లకోసారి అంతర్జాతీయంగా సైన్స్, గణితం, పుస్తక పఠనం, బృందంగా ఏర్పడి సమస్యలకు పరిష్కారాలు కనుగొనటం, ఆర్థిక విషయాలపై అవగాహన వంటి అంశాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించి ఇచ్చే 'ప్రోగ్రామ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ అసెస్‌మెంట్‌'(పిసా) ర్యాంకుల్లో ఫిన్‌లాండ్ చక్కని ప్రతిభ కనబరుస్తోంది.

2000 సంవత్సరం నుంచి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ఈ ర్యాంకులు ఇస్తోంది.

ఇప్పటి వరకు ఆరుసార్లు ఈ ర్యాంకులను ప్రకటించగా, మూడు సార్లు ఫిన్‌లాండే అగ్రస్థానంలో నిలిచింది. మిగతా మూడు సార్లు ఆసియా దేశాలైన సింగపూర్‌, జపాన్‌లు ముందు వరుసలో నిలిచాయి. అయినప్పటికీ, యూరప్‌లో టాప్ ర్యాంక్ మాత్రం ఫిన్‌లాండ్‌దే.

పనిదినాలు తక్కువ - సెలవులు ఎక్కువ

అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఈ దేశంలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా పిల్లలను తరగతి గదుల్లో కుక్కేసి, పరీక్షలు.. మార్కులు... ర్యాంకులు అంటూ పరుగులు పెట్టిస్తారనుకుంటే పొరపాటే. ఇక్కడ అలాంటివేమీ ఉండవు.

విద్యార్థులకు 16 ఏళ్ల వయసు వరకూ (పదో తరగతి దాకా) పరీక్ష అన్న మాటే ఉండదు. గంటల కొద్ది స్టడీ అవర్లూ, ట్యూషన్లూ అంటూ విద్యార్థులను ఇబ్బందిపెట్టరు. హోంవర్కులు ఇవ్వడం చాలా అరుదు.

పాఠశాలలకు పనిదినాలు తక్కువ, సెలవులు ఎక్కువ. వేసవిలో 10 వారాలపాటు సెలవులు ఇస్తారు. విద్యాసంవత్సరం మొత్తంలో 190 రోజులు మాత్రమే స్కూళ్లు పనిచేస్తాయి.

విద్యార్థులు యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. తరగతి గదిలో ఫోన్లు వాడొచ్చు, ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లినా అడ్డు చెప్పరు.

ఇలా ఏ మాత్రం ఒత్తిడి పెట్టకుండానే విద్యార్థులను ఎలా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దవచ్చునో చేసి చూపిస్తోంది ఫిన్‌లాండ్.

చిత్రం శీర్షిక తరగతి గదిలో విద్యార్థులు

నిర్బంధం... ఉచితం

ఫిన్‌లాండ్‌లో నిర్బంధ విద్య విధానం అమలులో ఉంది. ప్రతి ఒక్కరూ ఆరేళ్ల వయసు(ప్రాథమిక విద్యకు ఒక ఏడాది ముందు ప్రీ- ప్రైమరీ) నుంచి పదిహేనేళ్ల వరకు చదువుకోవాల్సిందే.

ప్రజలందరికీ సమానంగా విద్య అందించాలనేది ఫిన్‌లాండ్ చెబుతుంటుంది. అందుకే, ఇక్కడ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ఒకే స్కూలులో చదువుకునేలా చేస్తారు. కేజీ నుంచి పీజీ వరకు చదువు అందరికీ పూర్తిగా ఉచితం.

పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తుంది. స్కూల్‌లోనే భోజన వసతి ఏర్పాటు చేస్తుంది.

స్కూళ్లలో వైద్య సదుపాయాలు కూడా ఉంటాయి. ప్రతి పాఠశాలలో నర్సులు, దంత వైద్యులు, మానసిక నిపుణులు ఉంటారు.

ఇక్కడ విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు వసూలు చేయడం నేరం కింద పరిగణిస్తారు. దేశంలో అధికశాతం సర్కారు బడులే. కొన్నింటిని ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నా, వాటికి కూడా ప్రభుత్వమే నిధులు ఇస్తుంది.

2015లో ప్రాథమిక పాఠశాలకు వెళ్లే ఒక్కో విద్యార్థికి సగటున 8,955 యూరోలు (భారత కరెన్సీలో రూ. 7 లక్షలు), విశ్వవిద్యాలయం విద్యార్థికి 9,344 యూరోలు (రూ. 7.3 లక్షలు) ఖర్చు చేసినట్టు ఫిన్‌లాండ్ ఆర్థిక శాఖ ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

Image copyright Finland Ministry of Finance

ఏడేళ్లకు బడి బాట

భారత్‌లో రెండేళ్లు దాటగానే పిల్లలు బడి బాట పడతారు. ఫిన్‌లాండ్‌లో అలా కాదు. ఇక్కడ పిల్లలకు ఏడేళ్ల వయసు వచ్చాకే ప్రాథమిక విద్య ప్రారంభం అవుతుంది.

అప్పటివరకూ డే కేర్‌ సెంటర్లలో వారిలో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, బృందంగా ఏర్పడి సమస్యలను చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం.. కొత్త విషయాలను నేర్చుకోవడం.. పద్ధతిగా తినడం, నిద్రపోవడం, శుభ్రత పాటించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, సామాజిక స్పృహ.. లాంటివి అలవరచుకునేలా ప్రోత్సహిస్తారు.

దేశవ్యాప్తంగా స్కూళ్లన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయి. అంతటా ఒకే సిలబస్ ఉంటుంది.

ఫిన్నిష్ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎడ్యుకేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2017లో దేశంలోని పాఠశాలల్లో సగటున 195 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో తరగతిలో సగటున 19 మంది ఉన్నారు.

Image copyright Thinkstock

ఉపాధ్యాయులకు గౌరవం

ఫిన్‌లాండ్‌లో ఉపాధ్యాయ వృత్తిని ఎంతో గౌరవప్రదంగా చూస్తారు. వారి పనిగంటలు చాలా తక్కువ. మంచి వేతనాలు అందుతాయి. ప్రాథమిక పాఠశాలలో ఏడాదికి 677 గంటలు మాత్రమే పాఠాలు చెబుతారు.

ఏ టీచర్ అయినా పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పాఠశాలల్లో తనిఖీలు ఉండవు. ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉందని ఎవరూ పరిశీలించరు.

ఇక్కడి టీచర్లలో 90 శాతం మంది తమ వృత్తి పట్ల సంతృప్తికరంగా ఉంటారని 'ఫిన్నిష్ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎడ్యుకేషన్' చెబుతోంది.

పదో తరగతి వరకూ విద్యార్థులకు పరీక్షలేవీ పెట్టరు. కానీ, వారిలో నైపుణ్యాలను, సామర్థ్యాలను ఉపాధ్యాయులు ఎప్పుడూ విశ్లేషిస్తూ ఉంటారు. ఏదైనా సబ్జెక్టులో ఒక విద్యార్థి వెనకబడి ఉన్నట్టు గుర్తిస్తే, అతనిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు.

చిత్రం శీర్షిక కొన్ని చోట్ల తరగతి గదిలో కుర్చీలకు బదులుగా వ్యాయామ బంతులు ఏర్పాటు చేస్తారు.

ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం

వ్యాయామం పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. అందుకే ఫిన్‌లాండ్‌లో పాఠ్యాంశాలతో పాటు, శారీరక వ్యాయామానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు.

పిల్లలకు రోజులో కనీసం మూడు గంటలపాటు శారీక వ్యాయామం అవసరమని 2016లో ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఎనిమిదేళ్ల లోపు చిన్నారులకు అది అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించింది.

అందుకోసం స్కూళ్లలో విశాలమైన ఆటస్థలం ఉండేలా చూస్తారు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ పిచ్‌లు, స్కేటింగ్ పార్కులు ఉంటాయి.

కొన్ని తరగతి గదుల్లోనూ కుర్చీలకు బదులు వ్యాయామ బంతులను ఏర్పాటు చేస్తారు. పాఠశాల ప్రాంగణాల్లోనూ పరికరాలు అందుబాటులో ఉంచుతారు.

యూరప్‌లో విద్యార్థులు శారీరకంగా అత్యంత ఆరోగ్యవంతంగా ఉండే దేశం కూడా ఫిన్‌లాండే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్

టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...

ఉప్పల‌పాడు పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ సేఫ్ కాదా? క్రిప్టో కరెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా...

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య

'ఏడేళ్ల వయసులో జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్లకు ఎందుకు చెప్పానంటే...'