గ్వాంటానమో బే: 'మాభూమి మాకిచ్చేయండి' అంటున్న క్యూబా

  • 9 ఆగస్టు 2018
గ్వాంటానమో బే Image copyright Getty Images

క్యూబా -అమెరికాల మధ్య చాలా కాలంగా వివాదాస్పదంగా మారిన ప్రాంతం గ్వాంటనామో బే డిటెన్షన్ సెంటర్. నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి క్యూబా తన భూభాగమైన గ్వాంటానమో బేను అమెరికాకు 115 ఏళ్ళ కింద లీజుకిచ్చింది. ఇప్పుడు ఆ భూభాగాన్ని తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తోంది క్యూబా.

గ్వాంటానమో బే ఇప్పుడొక నిర్బంధ కేంద్రం. తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్న వారిని అమెరికా అక్కడకు తరలించి నిర్బంధంలో ఉంచుతోంది. ఈ ప్రాంతం ఆగ్నేయ క్యూబాలో ఉంటుంది. అమెరికా నేవల్ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రాంతాన్ని 1903లో అమెరికాకు లీజుకు ఇస్తూ ఒప్పందం చేసుకుంది క్యూబా. అయితే, క్యూబా విప్లవం తరువాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆ బేస్ చట్టవిరుద్ధమని ఆ దేశాధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో ప్రకటించారు. తమ భూభాగంలో అమెరికా సైనిక కార్యకలాపాలేమిటని ప్రశ్నించారు. అయితే, ఒప్పందం ఉపసంహరణ జరగాలంటే ఇరువర్గాలు ఒప్పుకోవాలి. ఈ నేవల్ బేస్‌ను, అందులోని కారాగారాన్ని మూసేసి తమ భూభాగాన్ని తమకు తిరిగి అప్పగించేయాలని క్యూబా డిమాండ్ చేస్తోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionగ్వాంటానమో బే: 'మాభూమి మాకిచ్చేయండి' అంటున్న క్యూబా

కైమనేరా పట్టణంలోకి బీబీసీకి అరుదైన అనుమతి

కానీ, దీనికి అమెరికా నుంచి సరైన స్పందన లేదు. అనేక ఆంక్షలుండే ఈ ప్రాంతానికి వెళ్లేందుకు బీబీసీకి అనుమతి లభించింది. గ్వాంటానమో బేకు సమీపంలోని కైమనేరా పట్టణం చాలా కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేందుకు అరుదైన అనుమతి పొందిన జర్నలిస్టులలో ఒకరుగా బిబిసి అక్కడికి చేరుకుంది. అమెరికా నౌకా స్థావరం పక్కనే ఉన్న కైమోరా పట్టణంలోకి రావాలన్నా పోవాలన్నా స్థానికులకే చాలా కష్టంగా ఉంటుంది.

ఈ పట్టణం ఒకప్పుడు అమెరికా మరీన్లతో, నేవల్ బేస్‌లో పనిచేసే స్థానికులతో సందడిగా ఉండేది. క్యూబా విప్లవం తరువాత అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ, గ్వాంటానమో బే లో పని చేసే క్యూబా జాతీయులను అమెరికా అక్కడ పనిచేసేందుకు అనుమతించింది. అయితే, 2012 లో చివరి క్యూబా జాతీయుడు ఇక్కడ పదవీ విరమణ చేశారు.

నేటి తరం యువకులు అన్నీ తేలికగా తీసుకుంటున్నట్టు కనిపిస్తారు. కానీ, స్థానిక మత్స్యకారులకు మాత్రం ఎక్కువ దూరం వెళ్లకూడదని తెలుసు. నావెల్ బేస్‌కు, ఈ పట్టణానికి మధ్య ఇప్పటికీ మందుపాతరలు ఉంటాయి. 1903 నుంచి ఒక ఒప్పందం ప్రకారం ఈ నావెల్ బేస్‌ను అమెరికా నాలుగు వేల డాలర్లకు లీజుకు ఇచ్చింది. స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం అమెరికా వైఖరితో విసిగిపోయింది.

Image copyright Getty Images

"ఈ నేవల్ బేస్ ప్రాంతాన్ని తిరిగి ఇచ్చేయమని చర్చలు జరపాల్సిన పనే లేదు. మనది కాని దాని కోసం చర్చలు జరపాల్సి ఉంటుంది. కానీ ఈ భూమి మాది. మా భూమిని మాకు వారు ఇచ్చేయాలి. ఇది వారిది కాదు, మాది" అని అన్నారు కైమనేరా కమ్యూనిస్ట్ పార్టీ ఫస్ట్ సెక్రటరీ, డెనిస్ పారాడెస్.

గ్వాంటానమో బే లోని ఈ కారాగారాన్ని మూసేస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వాగ్దానం చేశారు. అయితే, ఇప్పటికీ ఈ కారాగారంలో 40 మంది ఖైదీలున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతానికి దీన్ని మూసేసే ఆలోచనలో లేదు. అంతేకాదు, ఇప్పటివరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ ప్రాంతాన్ని క్యూబాకు అప్పగించాలనే ఆలోచనే చేయలేదు. మరోవైపు కైమనేరాలో ఇపుడు ఉప్పు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది. క్యూబాకు కావాల్సిన 70% ఉప్పు ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. అమెరికా ఆక్రమణ గురయిన ఈ ప్రాంతంలో ప్రజలకు ఇది తప్ప వేరే ఉద్యోగావకాశాలేవీ లేవు.

మా ఇతర కథనాలు చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు