హిరోషిమా, నాగాసాకి: అణుబాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది?

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
హీరోషిమాలో పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

1945 సంవత్సరం వస్తూ వస్తూనే జపాన్‌లో సామాన్యుల జీవితాలను నరకప్రాయం చేసింది. షాపుల్లో గుడ్లు, పాలు, టీ, కాఫీలు పూర్తిగా మాయమయ్యాయి. పాఠశాలల మైదానాల్లో, ఇంటి ఆవరణల్లో కూరగాయలు పెంచుకుని వాటినే తినేవారు. పెట్రోల్ సామాన్యులకు అందనంత ఖరీదైన వస్తువుగా మారిపోయింది.

రోడ్లపై ఎక్కడా సొంత కార్లు పరుగులు తీస్తూ కనిపించేవి కావు. హిరోషిమా రహదారుల్లో ఎక్కడచూసినా సైకిళ్లపై, కాలినడకన వెళ్లే జనం, సైనికుల వాహనాలే కనిపించేవి.

1945 ఆగస్ట్ 6.. ఉదయం 7 గంటలకు దక్షిణం వైపు నుంచి వస్తున్న అమెరికా విమానాలను రాడార్లు పసిగట్టాయి. చెవులు చిల్లులు పడేలా హెచ్చరిక సైరన్ మోగింది. జపాన్ అంతటా రేడియో కార్యక్రమాలను నిలిపివేశారు.

జపాన్‌లో అప్పటికే పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయి. దాంతో ఆ విమానాలను అడ్డుకోడానికి జపాన్ తమ విమానాలను పంపించలేకపోయింది. 8 గంటలకు హెచ్చరిక సైరన్ ఆగింది. రేడియో కార్యక్రమాలు మళ్లీ మొదలయ్యాయి.

8 గంటల 9 నిమిషాలకు అమెరికా వైమానిక దళం కల్నల్ పాల్ టిబెట్స్ తన బీ-29 విమానం 'ఎనోలా గే' ఇంటర్‌ కమ్‌లో ఒక ప్రకటన చేశారు. 'మీ గాగుల్స్ తీసుకోండి, వాటిని మీ నుదుటిపై పెట్టుకోండి' అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

కౌంట్ డౌన్ మొదలవగానే...

'కౌంట్ డౌన్ మొదలవగానే, వాటిని మీ కళ్లకు పెట్టుకోండి. మీకు కింద భారీ వెలుగు కనిపించకుండా పోయేవరకూ వాటిని అలాగే ఉంచుకోండి'.

విమానం పొట్టలో 3.5 మీటర్ల పొడవు, 4 టన్నుల బరువుతో బ్లూ-వైట్ రంగులతో ఉన్న 'లిటిల్ బాయ్' బాంబు ఉంది. దానిని టాప్ సీక్రెట్ మన్‌హాటన్ ప్రాజెక్ట్ కింద లాస్ అలామోస్, న్యూ మెక్సికోలో ఉన్న ప్రయోగశాలల్లో తయారు చేశారు. దాని తయారీని చాలా రహస్యంగా ఉంచారు. ఎంత రహస్యంగా అంటే, అధ్యక్షుడు రూజ్‌వెల్డ్ మరణించాక, ఉపాధ్యక్షుడు హారీ ట్రూమెన్ కొత్త అధ్యక్షుడి బాధ్యతలు తీసుకునే వరకూ ఆయనకు కూడా దాని గురించి తెలీదు.

'ఎనోలా గే' కుడి రెక్క నుంచి పది మీటర్ల దూరంలో ఒక కిలోమీటర్ వెనుక 'గెట్ ఆర్టిస్ట్' అనే ఇంకో బీ-29 విమానం ఎగురుతోంది. అక్కడ మూడో బాంబర్ కూడా వెళ్తోంది. దానిని జార్జ్ మార్క్‌వర్డ్ నడుపుతున్నారు. ఆయనకు ఫొటోలు తీసే బాధ్యత మాత్రమే అప్పగించారు.

సరిగ్గా 8 గంటల 13 నిమిషాలకు 'ఎనోలా గే, బాంబార్డియర్ మేజర్ టామ్స్ ఫ్రేబీకి హెడ్ ఫోన్లో 'ఇటీజ్ ఆల్ యువర్స్' అని కల్నల్ పాల్ టిబెట్స్ సందేశం వినిపించింది.. తర్వాత ఆయన ఇంటర్‌కామ్‌లో 'మీ గాగుల్స్ పెట్టుకోండి' అన్నాడు. ఫ్రేబీకి తన గాగుల్స్ నుంచి టార్గెట్ ఏఓఐ బ్రిడ్జ్ కనిపించగానే, 'ఐ హావ్ గాటిట్' అని అరిచాడు.

ఫొటో సోర్స్, Getty Images

హిరోషిమాపై పడిన లిటిల్ బాయ్

సరిగ్గా 8 గంటల 15 నిమిషాలకు 'ఎనోలా గే' నుంచి బయటకు వచ్చిన లిటిల్ బాయ్ హిరోషిమా మీద పడడం మొదలైంది..

'ఎనోలా గే' నుంచి లిటిల్ బాయ్ కిందకు రావడానికి 43 సెకన్లు పట్టింది. గాలులు వేగంగా వీస్తుండడంతో అది తన లక్ష్యం ఏఓఐ బ్రిడ్జికి 250 మీటర్ల దూరంలో ఉన్న షీమా సర్జికల్ క్లినిక్ పైన పడింది. అది పేలినపుడు ఆ శక్తి 12,500 టన్నుల టీఎంటీతో సమానంగా ఉంది. ఆ ఉష్ణోగ్రత హఠాత్తుగా 10 లక్షల సెంటీగ్రేడ్‌కు చేరింది. 'ద గ్రేట్ ఆర్టిస్ట్'‌లో ఉన్న పైలెట్ మేజర్ చార్లెస్ స్వీనీ పైనుంచి చూసినపుడు విశాలంగా ఉన్న ఒక అగ్నిగోళం ఏర్పడడం కనిపించింది.

ఒకే ఒక్క క్షణంలో నగరంలోని కాంక్రీట్ భవనాలు తప్ప భూమిపై వస్తువులన్నీ మాయమైపోయాయి. విస్ఫోటనం తీవ్రతతో గ్రౌండ్ జీరో నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని భవనాల కిటికీ అద్దాలూ ముక్కలైపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఆటం బాంబ్ వేసిన విమానం ఏమైంది?

హిరోషిమా నగరంలో రెండు వంతుల భవనాలు ఒక్క క్షణంలోనే ధ్వంసమయ్యాయి. కొన్ని కిలోమీటర్ల వరకూ మంటలు తుపానులా వ్యాపించాయి. ఒక్క క్షణంలోనే నగరంలోని రెండున్నర లక్షల జనాభాలో 30 శాతం మంది అంటే 80 వేల మందిని మృత్యువు బలి తీసుకుంది.

విస్ఫోటనం జరగగానే 'ఎనోలా గే' ముందు కేబిన్లోకి కూడా ఆ వెలుగు వ్యాపించింది. పైలెట్ పాల్ టిబెట్స్‌కు తన పళ్లు వణికినట్టు వింతగా అనిపించింది.

విమానం వెనుక భాగంలో కూచున్న టెయిల్ గన్నర్ బాబ్ కేరన్, తన కొడాక్ కెమెరా తీశాడు. కింద కనిపిస్తున్న దృశ్యాలను ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. కింద ఎర్రటి మేఘాల మధ్య తెల్లటి పొగ 3 వేల అడుగుల వరకూ పైకి ఎగిసింది. అది ఒక పుట్టగొడుగు ఆకారంలో కనిపించింది.

'ఎనోలా గే' కో పైలెట్ కెప్టెన్ రాబర్ట్ లూయిస్ తన లాగ్ ‌బుక్‌లో 'మై గాడ్ వాట్ హావ్ వియ్ డన్?' అని రాశాడు. 'ఎనోలా గే' వెపనియర్ విలియమ్ పార్సన్స్ 'ప్రయోగం విజయవంతమైంది, విమానంలో పరిస్థితి మామూలుగా ఉంది' అని ఒక కోడ్ సందేశం పంపించాడు.

ఫొటో సోర్స్, Getty Images

బాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది?

జపాన్ నౌకా దళం డ్రాఫ్ట్‌మెన్ సుతోమూ యామాగూచీ దృష్టి పైన ఎగిరే విమానంపై పడింది. విమానం నుంచి ఒక చిన్న నల్లటి వస్తువు కింద పడుతుండడం కనిపించింది. తర్వాత క్షణంలోనే అతడికి కళ్ల ముందు చూపు పోయేంత వెలుగు వచ్చింది. అతడి అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి. దాంతో చేతులతో కళ్లు మూసుకున్న అతడు నేలపై బోర్లా పడిపోయాడు.

కింద భూమి కంపించడంతో యామాగూచీ సుమారు అర మీటరు ఎత్తుకు ఎగిరిపడ్డాడు. తను తిరిగి కళ్లు తెరిచినప్పుడు చుట్టూ అంధకారం అలుముకుని ఉంది.

హఠాత్తుగా అతడికి తన ఎడమ వైపున, ఎడమ చేతి దగ్గర భరించలేనంత వేడిగా అనిపించింది. వాంతి చేసుకోవాలనిపిస్తోంది. కళ్లు తిరుగుతున్నాయి. స్పృహ తప్పుతోంది. అప్పుడే అతడికి కొంత దూరంలో ఒక చెట్టు కనిపించింది. దాని ఆకులన్నీ పూర్తిగా రాలిపోయి ఉన్నాయి.

ఆ చెట్టు వరకూ వెళ్లడానికి అతడు తన బలమంతా ఉపయోగించాడు. ఎలాగోలా అక్కడికి చేరుకుని దాని మొదలు దగ్గర కూచున్నాడు. అప్పటికే అతడి గొంతు పూర్తిగా ఎండిపోయింది. దాహంతో తపించి పోతున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

బతికి బయటపడినా...

హిరోషిమా తూర్పు ప్రాంతంలో ఒక రైలు నగరం వైపు వస్తోంది. సైనికులు హఠాత్తుగా వెళ్తున్న ఆ రైలును ఆపేశారు. లోపల ఉన్న వాళ్లందర్నీ కిందకు దించేసి వెళ్లిపొమ్మన్నారు.

డబ్బాలను ఇంజన్ నుంచి వేరు చేసి, అక్కడే ఆపేశారు. కానీ ఇంజన్ మాత్రం ముందుకెళ్లిపోయింది. కానీ అది ఎంతో దూరం వెళ్లలేకపోయింది. ఎందుకంటే కాలినడకన వెళ్లే వారితో ఆ రైల్వే లైన్ అంతా నిండిపోయి ఉంది.

వారిలో కొంతమంది ముఖం నుంచి చర్మం ఊడిపోయింది. కొంతమంది చేతులు విరిగిపోయి శరీరానికి వేలాడుతున్నాయి. కొంతమంది చాలా నెమ్మదిగా నడుస్తున్నారు. వాళ్లందరి నోటి నుంచి ఒకే మాట వస్తోంది. 'నీళ్లు.. నీళ్లు కావాలి.'

ఫొటో సోర్స్, Getty Images

నేను చనిపోతానా?

అణుబాంబు విస్ఫోటనంతో ఏర్పడిన మేఘాల వల్ల సుమారు 11 గంటలకు హీరోషిమాలో భారీ వర్షం కురవడం మొదలైంది. ఆ వర్షం నల్లగా పడుతోంది. దానిలో దుమ్ము, ధూళి, విస్ఫోటనంతో ఉత్పన్నమైన రేడియో ధార్మిక లక్షణాలు ఉన్నాయి.

నిజానికి, ఆ వర్షం చిక్కగా ఉన్న నల్లటి రంగులా ఉంది. గ్రీజులా ఉన్న ఆ వర్షంతో గోడలపై, బట్టలపై మరకలు పడ్డాయి. అక్కడ ఆకులు లేని చెట్టు కింద కూచున్న యామాగూచీ మాత్రం రేడియో యాక్టివ్ వర్షంలో తడవకుండా ఉండగలిగాడు. కాస్త దూరంలోనే ఒక గుంత కనిపించిండంతో అక్కడికి పాక్కుంటూ వెళ్లాడు. అక్కడ ఒక మహిళ ఉంది.

ఆమె బట్టలన్నీ కాలిపోయాయి. చర్మం కూడా కమిలి ఎర్రగా అయిపోయింది. ఆమె లేవాలని ప్రయత్నించింది. కానీ పడిపోయింది. లేవలేని స్థితిలో 'సాయం చేయండి, సాయం చేయండి' అంటోంది.

యామాగూచీని చూడగానే గొంతు తెచ్చుకున్న ఆమె 'నేను చనిపోబోతున్నానా' అని అడిగింది. అప్పుడే అక్కడకు ఇద్దరు విద్యార్థులు వచ్చారు. వాళ్లకేం కాలేదు. వాళ్లు యామాగూచీతో 'మీరు బాగా కాలిపోయినట్టు కనిపిస్తున్నారు' అన్నారు.

యామాగూచీ తన ముఖాన్ని మెల్లగా తడుముకున్నాడు. చర్మం ఊడి చేతికి వస్తున్నట్టు అనిపిస్తోంది. నల్లగా అయిపోయిన తన చేతులు అంతకంతకూ వాచిపోతున్నాయి.

ఆ విద్యార్థులు యామాగూచీని తీసుకుని క్లినిక్ చేరారు. అక్కడ కాలిపోయిన శవాలు ఉన్నాయి. కొంతమంది చేతులు కాస్త కదులుతున్నాయి. కానీ ఎక్కువ మంది శరీరాలు ఎలాంటి చలనం లేకుండా ఉన్నాయి. అక్కడ ఒక కంపౌండర్ యామాగూచీ ముఖంపై తెల్లటి క్రీమ్ రాశాడు. చేతికి కట్టు కట్టాడు.

అక్కడ రెండు బిస్కెట్లు, కొన్ని నీళ్లు ఇచ్చారు. బిస్కెట్ కొరకగానే అతడు వాంతి చేసుకున్నాడు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

హిరోషిమాపై అమెరికా అణు బాంబు వేసిందని ప్రకటించిన అధ్యక్షుడు హారీ ట్రూమెన్

హిరోషిమా విధ్వంసం చూసిన మొదటి విలేఖరి

స్థానిక విలేకరి 37 ఏళ్ల సాతోషీ నాకామురా ఆరోజు హిరోషిమాకు కాస్త దూరంలో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లడం వల్ల ప్రమాదం తప్పించుకున్నారు. హిరోషిమాపై అణుబాంబు పడినప్పుడు, ఆ ప్రభావంతో ఆయన నేలమీద పడ్డారు. తన ముఖానికి పగిలిన అద్దాలు గుచ్చుకున్నాయి. తర్వాత నాకామురా తన సైకిల్ తీసుకుని హీరోషిమా వైపు బయల్దేరారు.

నాకామురా హిరోషిమా విధ్వంసాన్ని చూసిన తొలి విలేకరి అయ్యారు. ఆయన డోమీ వార్తా ఏజెన్సీకి ఒకాయామా ఆఫీసు నుంచి మొదటి వార్త డిక్టేట్ చేశారు. '8 గంటల 16 నిమిషాలకు శత్రువులు రెండు విమానాల్లో హిరోషిమాపై ఒక ప్రత్యేక బాంబు వేశారు. హిరోషిమా మొత్తం నాశనం అయిపోయింది. సుమారు లక్షా 70 వేల మంది చనిపోయారు' అని చెప్పారు.

ఈ వార్త విన్న డోమీ బ్యూరో చీఫ్, నాకామురాతో అది నిజం కాదేమో అన్నారు. ఒక్క బాంబు వల్ల హిరోషిమాలో అంత మంది చనిపోతారా? నీ రిపోర్టులో మృతుల సంఖ్య మార్చాలని చెప్పారు. ఎందుకంటే సైన్యం దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. దాంతో కోపం వచ్చిన నాకమూరా టెలిఫోన్లోనే 'సైనికులు మూర్ఖులు' అని గట్టిగా అరిచాడు.

ఫొటో సోర్స్, Getty Images

మూడు రోజుల తర్వాత నాగసాకి మీద పడిన 'ఫ్యాట్ మ్యాన్'

1945 ఆగస్టు 9 మధ్యాహ్నం. జపాన్‌లోని మరో నగరం నాగసాకిలో బీ-29 బాంబర్లు రెండో ఆటం బాంబు జారవిడిచాయి. అది కిందకు చేరడానికి 43 సెకన్లు పట్టింది. బాంబు విస్ఫోటనంతో కిలోమీటర్ పరిధిలో ప్రతి వస్తువూ ధ్వంసమైపోయింది.

ఉష్ణ కిరణాలు మనుషుల శరీరంలోని ప్రతి నీటిబొట్టునూ ఆవిరి చేశాయి. క్షణంలోనే చాలా మంది చనిపోయారు, జంతువులు మాడిపోయాయి. పేలుడు తీవ్రతకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల అద్దాలు కూడా ముక్కలైపోయాయి. విస్ఫోటనంతో ఎగసిన వెలుగు కొన్ని సెకన్లే ఉన్నా, దానివల్ల ఏర్పడిన వేడి చర్మంపై థర్డ్ డిగ్రీ బర్న్స్ వచ్చేలా కాల్చేసింది.

బాంబు పడిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో షిరోయామా ప్రైమరీ స్కూల్లో కాక్రీట్ స్తంభాలు తప్ప వేరే ఏం మిగల్లేదు. అక్కడే నిలబడ్డ చియోకో ఇగాషిరా భయంకరమైన పేలుడు శబ్దాన్ని విన్నాడు. అప్పుడు తన వీపు నుంచి కొంత భాగం ఎగిరిపోయినట్టు అతడికి అనిపించింది.

ఇగాషిరా వెంటనే కూతురికి తన శరీరాన్ని అడ్డుపెట్టి కవర్ చేశాడు. ఆ సమయంలో ఆమె తలపై వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. కనుబొమల్లో ఒక్క వెంట్రుక కూడా మిగల్లేదు. ఇగాషిరా సాయం కోసం అరవాలని ప్రయత్నించాడు. కానీ తన నోటి నుంచి మాట రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images

క్షణంలో నాగసాకి నేలమట్టం

బాంబు పడిన కేంద్రానికి కిలోమీటర్ పరిధిలో ప్రతి వస్తువూ వేడికి ఆవిరైపోయింది. అన్నీ కాలి బూడిదైపోయాయి. మైక్రో సెకను లోపలే నాగసాకి జైలులోని మూడు భవనాలు నేలమట్టం అయ్యాయి.

జైల్లో ఉన్న ఒక్కరు కూడా బతకలేదు. రూట్ నంబర్ 206లో కరెంటుతో నడిచే ట్రామ్ నామరూపాలు లేకుండా పోయింది. నాగసాకి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో డాక్టర్ తకాషీ నగాయీ తన తరగతిలో ప్రాక్టీస్ చేయించడం కోసం కొన్ని ఎక్స్ రే ఫిల్ములు వెతుకుతున్నారు. అప్పుడే అతడికి చూపు పోగొట్టేంత వెలుగు కనిపించింది.

ఆ పేలుడు తీవ్రతతో కిటికీ అద్దాలు పగిలి గది లోపలికొచ్చి పడ్డాయి. ఆ కిటికీల నుంచి గాలి వేగంగా లోపలికొచ్చింది. డాక్టర్ తకాషీ గాల్లో ఎగిరి పడ్డారు.

ఆయన ముఖంపై కుడివైపు కోసుకుపోయింది. ముఖమంతా వేడిగా ఉన్న రక్తం కారుతోంది. అంతగా గాయపడ్డా తనకు ఎలాంటి నొప్పీ లేకపోవడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఒకటిన్నర కిలోమీటర్ దూరం వరకూ...

ఆస్పత్రి బయట ఏ వస్తువూ గుర్తించేలా లేదు. అక్కడే ఉన్న సునియో తోమీతా కింద పడిన తన స్నేహితుడు కామోతోను తన భుజాలపై ఎత్తుకోడానికి ప్రయత్నించాడు. కానీ అతడి చేతులకు స్నేహితుడి మాంసం మాత్రమే వచ్చింది. కామోతో మళ్లీ కింద పడిపోయాడు.

చనిపోతున్న వారికి, చనిపోయిన వారికి నోటి నుంచి రక్తం వచ్చింది. తోమీతా వాళ్ల మధ్యకు వెళ్లి నీళ్లు అందించాడు. వారికి ఏం కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కాసేపటికి అతడు, ప్రొఫెసర్ సికీ మాత్రమే ప్రాణాలతో మిగిలారు.

ఆయన చుట్టూ సుమారు 20 శవాలు పడున్నాయి. ఎక్కడ చూసినా మంటలు చెలరేగుతున్నాయి. విస్ఫోటనం జరిగిన స్థలం నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న ఒక టార్పెడో ఫ్యాక్టరీలో మిత్సుయీ తకీనో కూడా స్పృహతప్పి నేలపై పడిపోయింది.

ఆమెకు స్పృహ వచ్చినపుడు చుట్టూ జనాల అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఆమె పైనంతా శిథిలాలు పడున్నాయి.

ఆమె కష్టంగా తన కుడి చేతిని తప్పించగలిగింది, కానీ కింద నేలపై ఆమెకు తడిగా ఏదో తగిలింది. తడిమి చూసినపుడు, నేలపై తన రక్తమే ఉందని, తను రక్తపు మడుగులో ఉన్నానని ఆమెకు తెలిసింది.

( క్రేక్ కోలీ పుస్తకం 'నాగాసాకీ', జేమ్స్ డెల్‌గా ర్డో పుస్తకం 'న్యూక్లియర్ డాన్', చికాసావు మోరాసామీ పుస్తకం 'ద వైట్ స్కై ఇన్ హిరోషిమా' ఆధారంగా )

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)