సూర్యుడి దగ్గరికి మానవ అస్త్రం: పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించిన నాసా

ఫొటో సోర్స్, NASA
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిషన్‌ను ప్రారంభించింది. సూర్యుని బాహ్యవలయ ప్రాంతంలోకి.. అంటే సూర్యుని చుట్టూ ఉండే కరోనా భాగంలోకి పంపేందుకు ఆదివారం పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. సూర్యుని విషయంలో ఉన్న అనేక సందేహాలు, రహస్యాలను ఈ స్పేస్ క్రాఫ్ట్ చేధించగలదని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
పార్కర్ సోలార్ ప్రోబ్ మనల్ని సూర్యుడికి చాలా దగ్గరకు చేరుస్తుందని శాస్ర్తవేత్తలు చెప్పారు.
మానవాళి ఇప్పటి వరకు నిర్మించిన వాటిలో అత్యంత వేగంగా ప్రయాణించే వాహనమిది. గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
సోలార్ ప్రోబ్ సూర్యుని చుట్టూ ఉన్న ఒక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. వచ్చే ఏడేళ్లలో సూర్యుడికి సమీపంగా వెళుతుంది. ఇది సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లినపుడు.. సూర్యుడి ఉపరితలానికి, సోలార్ ప్రోబ్‌కు మధ్య దూరం సుమారు నలభై లక్షల మైళ్లు ఉంటుంది.
వీడియో: ఏమిటీ పార్కర్ సోలార్ ప్రోబ్?
‘‘మనకు.. అంటే భూమికి సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు పార్కర్ ప్రోబ్ సూర్యునికి అత్యంత సమీపంలో ఉంటుందన్న విషయం మనకు అర్థమవుతుంది’’ అని సౌర శాస్త్రవేత్త లూసీ గ్రీన్ పేర్కొన్నారు.
దీనికి ప్రత్యేకమైన హీట్ షీల్డ్ అమర్చారు. దానివల్ల ఇది 1500 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోగలదు.
వీడియో: సూర్యుని చుట్టూ ఉండే కరోనా భాగంలోకి పంపేందుకు ఆదివారం పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌకను ప్రయోగించింది.
పార్కర్ ప్రోబ్ సూర్యుడి చుట్టూ కక్ష్యలో తిరిగేటపుడు సూర్యుడి బాహ్య వాతావరణాన్ని నాసా అధ్యయనం చేయగలుగుతుంది. సోలార్ విండ్ ద్వారా సూర్యుడు భూమిని ఎలా ముట్టడిస్తాడనే విషయాన్ని అది కనిపెడుతుంది.
‘‘ఇది విద్యుత్ క్షేత్రాలను గుర్తిస్తుంది. అయస్కాంత క్షేత్రాలను గుర్తిస్తుంది. అట్లాగే స్పేస్ క్రాఫ్ట్ మీదుగా పరుగులు తీసే రేణువుల్ని కూడా గుర్తిస్తుంది’’ అని లూసీ గ్రీన్ వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇంతకూ.. ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం?
సౌర తుపానులు మన రేడియో కమ్యూనికేషన్లకూ, శాటిలైట్లకూ అంతరాయం కలిగిస్తాయి. ఈ తుపాన్లను భూమి పైన ఉంటూ మనం ముందుగా పసిగట్టలేం.
ఇప్పుడు పార్కర్ వాటిని ముందుగానే గుర్తించి మనకు తెలియజేస్తుంది. దాంతో మనం అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టొచ్చు.
అలాగే ఉత్తర, దక్షిణ ధ్రువాల ప్రకాశాల అద్భుత దృశ్యాలను అంటే.. అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రేలిస్లను ఏ సమయంలో చూస్తే బాగా కనిపిస్తాయో కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్ తెలియజేస్తుంది.
వీడియో: ష్.. సూర్యుడు శబ్దం చేస్తున్నాడు!
ఇవి కూడా చదవండి
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
- శ్రీహరి కోటలో ‘రాకెట్’ రహస్యం
- సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- ఇదిగో.. నవలోకం!
- సూపర్ బ్లూ బ్లడ్ మూన్: ప్రపంచం నలుమూలల్లో ఇలా కనిపించింది
- అరుణకంపం రహస్యాలపై 'నాసా ఇన్సైట్'
- అంగారకుడిపై నీటి సరస్సు: మరి అక్కడ జీవం ఉందా? లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)