నోబెల్ గ్రహీత, ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ కన్నుమూత

  • 12 ఆగస్టు 2018
నైపాల్ కన్నుమూత Image copyright COLIN MCPHERSON

సాహిత్యంలో నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ కన్నుమూశారు.

ఆయన కుటుంబం నుంచి అందిన సమాచారం ప్రకారం 85 ఏళ్ల వయసున్న నైపాల్ లండన్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

భారతీయ సంతతికి చెందిన నైపాల్ 1932లో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో జన్మించారు.

ఆయన పూర్తి పేరు విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. విద్యాధర్ అనే పేరునే చిన్నదిగా చేసి ఆయన్ను సర్ విదియా నైపాల్ అని కూడా పిలుచుకుంటారు.

Image copyright JOHN MINIHAN
చిత్రం శీర్షిక 1960లో వీఎస్ నైపాల్

చిన్నతనంలో తండ్రి దగ్గర ఉన్న షేక్‌స్పియర్, డికెన్స్ పుస్తకాలు చదివిన నైపాల్ రచనపై మక్కువ పెంచుకున్నారు.

1950లో నైపాల్ ఒక ప్రభుత్వ స్కాలర్‌షిప్ గెలుచుకున్నారు.

దీని ద్వారా ఆయనకు తను కోరుకున్న కామన్‌వెల్త్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించి ఉండేది. కానీ ఆయన 20 ఏళ్ల వయసులో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరారు.

నైపాల్ మొదటి పుస్తకం 'ద మిస్టిక్ మెసర్', 1951లో ప్రచురితమైంది. తర్వాత పదేళ్లకు ప్రచురితమైన ఆయన ప్రముఖ నవల 'ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్' రాయడానికి సర్ వీదియా పాల్‌కు మూడేళ్లకు పైనే పట్టింది.

Image copyright GERRY PENNY/EPA/REX/SHUTTERSTOCK
చిత్రం శీర్షిక సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం అందుకున్న నైపాల్

సాహిత్యం వైపు నైపాల్ అడుగులు

రచనా రంగంలోకి రాక ముందు నైపాల్ బీబీసీ కోసం కూడా పనిచేశారు. 1957 నుంచి 1961 వరకూ బీబీసీ కరిబియన్ సర్వీసులో బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేశారు.

ఆయన నవలల్లో 'ఎ బాండ్ ఇన్ ద రివర్', 'ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్' చాలా ప్రముఖమైనవి. వీటితోసహా ఆయన 30 పుస్తకాలు రాశారు.

1961లో ఆయన తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ రాసిన 'ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్' నవల విడుదల కాగానే రికార్డు స్థాయిలో అమ్ముడైంది.

బ్రిటిష్ సాహిత్య పురస్కారం బుకర్ ప్రైజర్ మొదట గెలుచుకున్న వారిలో ఆయన కూడా ఒకరు. 1971లో 'ఎ ఫ్రీ స్టేట్' అనే రచనకు ఆయకు బుకర్ ప్రైజ్ లభించింది.

2001లో సాహిత్య రంగంలో నైపాల్ నోబెల్ పురస్కారం అందుకున్నారు. ఆ సమయంలో అందరూ ఆయన్ను 'ఆధునిక తత్వవేత్త'గా వర్ణించారు.

Image copyright NICK HARVEY

ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేశారు

మనుషుల కష్టాలు, కన్నీళ్ల గురించి తన రచనల్లో స్పష్టంగా ప్రస్తావించే నైపాల్ సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేశారు.

మొదటి భార్య పాట్రిసియా హాలే 1996లో మరణించిన తర్వాత ఆయన పాకిస్తానీ జర్నలిస్టు నాదీరాను పెళ్లాడారు.

"ఆయన తన జీవితాన్ని సృజనాత్మకంగా గడిపారు. ఆఖరి సమయంలో ఆయనకు ఇష్టమైనవారందరూ తనతోనే ఉన్నారు" అని నైపాల్ మరణం తర్వాత ఆయన భార్య తెలిపారు.

విద్యార్థిగా ఉన్నప్పుడు డిప్రెషన్‌కు గురైన ఆయన ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.

టోనీ బ్లెయిర్‌పై నైపాల్ ఎన్నోసార్లు బహిరంగ విమర్శలు కూడా చేశారని చెబుతారు. బ్లెయిర్‌ను ఒకసారి ఆయన 'పైరేట్' అని కూడా అన్నారు.

నైపాల్ మృతితో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు పోస్ట్ చేశారు. స్నేహితులు, ఇతర రచయితలు ఆయనకు నివాళులు అర్పించారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)