వీడియో గేమ్స్ ఆడిన అనుభవంతో విమానం ఎత్తుకెళ్లాడు

విమానం పల్టీలు

సియాటెల్ విమానాశ్రయం నుంచి ఖాళీ విమానం తీసుకెళ్లి, తర్వాత దానిని కూల్చేసిన వ్యక్తిని ఒక విమాన సంస్థకు చెందిన ఉద్యోగిగా అధికారులు గుర్తించారు. అతడికి విమానాశ్రయంలో పనిచేసే అన్ని అర్హతలూ ఉన్నాయని చెబుతున్నారు.

హరైజాన్ ఎయిర్ విమాన సంస్థలో ఉన్న అతడు సియాటెల్ విమానాశ్రయంలో విమానాలను రన్‌వే పైకి లాక్కు రావడం, వాటిని శుభ్ర చేయడం, బ్యాగ్స్ లోడింగ్ చేసేవాడు.

అమెరికా మీడియా అతడి పేరు రిచర్డ్ రస్సెల్ అని పేర్కొంది. విమానం ఎత్తుకెళ్లిన అతడు విమానాశ్రయం మూసేసేలా, రెండు ఫైటర్ జెట్లు తనను చేజ్ చేసేలా భయానక పరిస్థితి సృష్టించాడు.

రస్సెల్ ఎత్తుకెళ్లిన విమానం ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేసిన తర్వాత కూలిపోయింది. ఆ ప్రమాదంలో అతడు మరణించాడు.

అక్కడక్కడా ఇళ్లుండే పుగెట్ సౌండ్ ప్రాంతంలోని కెట్రన్ దీవిలో ఈ విమానం కూలిపోయింది.

"కూలినప్పుడు ఆ విమానంలో ఒక్కరే ఉన్నారని మేం అనుకుంటున్నాం. అయినా విమానంలో ఎంతమంది ఉన్నారు అనేది కూలిన ప్రాంతంలో ధ్రువీకరించలేం" అని సియాటెల్ ఎఫ్‌బీఐ అధికారి జే టాబ్ తెలిపాడు.

రస్సెల్‌తో పనిచేసిన వారు మాత్రం అతడు చాలా మంచి వాడని చెబుతున్నారు. "అతడిని చాలా మంది ఇష్టపడేవారు, రస్సెల్ మృతి బాధిస్తోంది" అని అంతకు ముందు అదే విమాన సంస్థలో పనిచేసిన రిక్ క్రిస్టెన్సన్ సియాటెల్ టైమ్స్‌కు చెప్పారు.

ఎయిర్ ట్రాఫిక్‌తో జరిగిన సంభాషణల్లో రస్సెల్ తను చేసిన పనికి ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. తనకు ఎవరికీ హాని కలిగించే ఉద్దేశం లేదన్న అతడు తన సన్నిహితులందరికీ క్షమాపణ కూడా చెప్పాడు. జీవితంపై విరక్తి కలిగిందని తెలిపాడు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

రిచర్డ్ రస్సెల్ హారిజన్ ఎయిర్ సంస్థలో ఉద్యోగి

తాజాగా ఏం తెలిసింది?

విమాన సంస్థ, విమానాశ్రయం అధికారులు ఆదివారం ఉదయం సియాటెల్‌లో జరిగిన ఘటన గురించి మీడియాకు వివరించారు.

"రస్సెల్ నిబంధనల ప్రకారమే విమానంలోకి ఎక్కాడు, ఎలాంటి భద్రతా నియమాలూ ఉల్లంఘించలేదు" అని విమానాశ్రయం ఎవియేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ ఎల్ తెలిపారు.

"అతడి నేపథ్యం కూడా తనిఖీ చేశాం, రస్సెల్ శనివారం తన షిఫ్టులోనే ఉన్నాడు. యూనిఫాం కూడా వేసుకున్నట్టు తెలుస్తోంది" అని మరో అధికారి చెప్పారు.

"విమానాలకు డోర్ లాక్, ఇగ్నిషన్ కీ లాంటి సురక్షా పద్ధతులు ఉండవు, పైలెట్ లైసెన్స్ లేని రస్సెల్ అంత పెద్ద విమానం నడిపే నైపుణ్యం ఎలా సంపాదించాడో అర్థం కావడం లేదు" అని హారిజన్ ఎయిర్ సీఈఓ ఆశ్చర్యపోయారు.

కెట్రన్ దీవిలో విమానం కూలిన ప్రాంతంలో ఆధారాలు సేకరించిన ఎఫ్‌బీఐ అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

ఘటన గురించి మీడియాకు చెబుతున్న అధికారులు

అసలేం జరిగింది?

సియాటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7.32కు హారిజన్ ఎయిర్‌కు చెందిన 76 సీట్ల ట్విన్ ఇంజన్ టర్బోప్రాప్ బంబార్డియర్ క్యూ400 విమానం టేకాఫ్ అయ్యింది.

మెయింటనన్స్ లొకేషన్ నుంచి పుష్‌బ్యాక్ ట్రాక్టర్‌తో విమానంను లాక్కొచ్చిన ఒక వ్యక్తి దానిని టేకాఫ్ కోసం సిద్ధంగా పెట్టి, తర్వాత దాన్ని తీసుకెళ్లాడు. టేకాఫ్ అయిన తర్వాత నీళ్లకు కొన్ని మీటర్ల ఎత్తున విమానాన్ని నడిపి, తర్వాత దాన్ని ఎత్తులోకి తీసుకెళ్లాడు.

దాంతో అధికారులు ఆ విమానాన్ని అడ్డుకోవడానికి పోర్ట్ లాండ్ నుంచి రెండు ఎఫ్-15 ఫైటర్ జెట్లను పంపించారు. తర్వాత వెలుగుచూసిన వీడియోల్లో ప్యాసింజర్ విమానం ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేయడం కనిపించింది.

పసిఫిక్ మహా సముద్రం పైనుంచి విమానాన్ని మళ్లించడానికి ఎఫ్-15 జెట్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నప్పుడు అది విమానాశ్రయానికి దాదాపు 48 కిలోమీటర్ల దూరంలో కెట్రన్ దీవిలో కూలిపోయింది. జెట్ ఫైటర్స్ దానిపై ఎలాంటి కాల్పులు జరపలేదు అని అధికారులు తెలిపారు.

విమానాన్ని నడపడానికి, సురక్షితంగా దించడానికి ఏదైనా సాయం కావాలా అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అడిగినప్పుడు, రస్సెల్ "నాకు పెద్దగా సాయం అవసరం లేదు, నేను ఇంతకు ముందు కొన్ని వీడియో గేమ్స్ ఆడాను" అని వారికి చెప్పాడు.

అతడికి విమానం నడపడంలో నియమాలు తెలీదని, టేకాఫ్ కోసం రస్సెల్ ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు. మెకార్డ్ యూఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఆ విమానం లాండ్ చేయాలని సలహా కూడా ఇచ్చారు.

కానీ రసెల్ "అక్కడ ల్యాండ్ చేయాలని ప్రయత్నిస్తే వాళ్లు నన్ను చితకబాదుతారు. వాళ్ల దగ్గర యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఉన్నాయేమో" అన్నాడు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌కు వింత వింత సమాధానాలు చెప్పిన రస్సెల్ చివరికి తను విమానం సురక్షితంగా ల్యాండ్ చేయలేనని అర్థమైంది.

విమానం ఎలా ల్యాండ్ చేయాలో తెలీడం లేదన్న రస్సెల్ "నా క్షేమం కోరుకునే చాలా మంది నేనిలా చేశానని తెలిసి బాధపడి ఉంటారు. వారిని పేరుపేరునా క్షమాపణ అడుగుతున్నా. జీవితంపై విరక్తిగా ఉంది. కొన్ని స్క్రూలు లూజ్ అయ్యాయేమో. నిజంగా అది నాకు ఇప్పటివరకూ తెలీదు" అన్నాడు.

కూలిపోయే ముందు విమానం పల్టీ కొట్టినట్టు తెలుస్తోంది.

ఫొటో క్యాప్షన్,

కూలిపోయిన తర్వాత మంటల్లో విమానం

ప్రత్యక్ష సాక్షులు ఏం చూశారు?

తను విమానాన్ని లాండ్ చేస్తున్నప్పుడు, ఎదురుగా దూసువచ్చిన విమానం టేకాఫ్ అవడంతో బెన్ స్కాచెర్ అనే పైలెట్ షాక్ అయ్యారు. ఎలాగోలా తన విమానాన్ని దించగలిగానని చెప్పారు.

"అది చాలా పిచ్చిపనిగా అనిపించింది" అని అతడు ట్వీట్ చేశాడు. అధికారులు అతడిని ఆపాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని బెన్ చెప్పారు.

విమానం పైన ఎగురుతున్నప్పుడు వీడియో షూట్ చేసిన లే దాన్ని చూడగానే ఏదో జరుగుతోందని అనిపించినట్టు మోర్స్ రాయిటర్స్‌కు తెలిపారు.

"మా ఇంటికి దగ్గరగా విమానం కిందికి వచ్చింది, ఆ శబ్దానికి ఇల్లు కంపించింది. కానీ జెట్ ఫైటర్స్ వచ్చిన కాసేపటి తర్వాత ఆ విమానం కనిపించలేదు" అని మోర్స్ అన్నారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)