వీగర్ ముస్లింలను చైనా వేధిస్తోందా? జిన్‌జియాంగ్‌లో అసలేం జరుగుతోంది?

  • 12 ఆగస్టు 2018
నిర్బంధాలకు వ్యతిరేకంగా వీగర్ ముస్లింల ఆందోళనలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక నిర్బంధాలకు వ్యతిరేకంగా వీగర్ ముస్లింల ఆందోళనలు

చైనాలో పెద్దఎత్తున వీగర్ ముస్లింలను నిర్బంధిస్తున్నారని, తీవ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం వారిని అణచివేస్తోందని, మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

భారత్ పొరుగునే ఉన్న జిన్‌జియాంగ్ రాష్ట్రంలో కొన్నేళ్లుగా చెలరేగుతున్న ఘర్షణలు, అక్కడి వీగర్ ముస్లింలు, వారిపట్ల చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

చైనాలో పది లక్షల మంది వీగర్ ముస్లింలను తీవ్రవాద వ్యతిరేక శిబిరాల్లో నిర్బంధించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ సభ్యురాలు ఒకరు తాజాగా వెల్లడించారు.

చైనా విధానాలపై రెండు రోజుల పాటు జెనీవాలో నిర్వహిస్తున్న ఐరాస మానవ హక్కుల కమిటీ సమీక్ష సమావేశంలో 'జాతి వివక్ష నిర్మూలనపై ఐరాస కమిటీ' సభ్యురాలు గే మెక్‌డూగల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

వీగర్‌లు ఉండే స్వయంప్రతిపత్తి కలిగిన జిన్‌జియాంగ్ ప్రాంతాన్ని చైనా ఒక భారీ నిర్బంధ శిబిరంలా మార్చేసిందని వివిధ నివేదికలు చెబుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణల మీద చైనా ఇంతవరకూ స్పందించలేదు. అయితే, ఈ ఆరోపణలు చేసినప్పుడు చైనా బృందం దీనిపై మాట్లాడుతూ సోమవారం కొనసాగనున్న సమావేశంలోబదులిస్తామని చెప్పింది.

కాగా, గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిర్బంధ శిబిరాలేమీ లేవంటూ చైనా కొట్టిపారేసింది.

Image copyright AFP

ఇంతకీ ఈ వీగర్ ముస్లింలు ఎవరు?

వీగర్‌ జాతి ప్రజలు ముస్లిం మతస్థులు. జాతిపరంగా, సంస్కృతిపరంగా తాము మధ్య ఆసియా దేశాలకు దగ్గరివారమని వారు చెబుతుంటారు. ప్రధానంగా వీరిని టర్కీ ముస్లింలుగా చెబుతుంటారు. చైనాలోని జిన్‌జియాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో వీరు ఎక్కువగా నివసిస్తారు. జిన్‌జియాంగ్ రాష్ట్రంలో 45 శాతం జనాభా వీరే.

ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో వీగర్‌లు స్వతంత్రం ప్రకటించుకున్నారు. కానీ, 1949లో కమ్యూనిస్ట్ చైనా ఈ ప్రాంతమంతటినీ తన అధీనంలోకి తీసుకుంది. అనంతర కాలంలో వీరు స్వతంత్రం కోసం ఉద్యమిస్తున్నారు.

అయితే, టిబెట్ మాదిరిగా దీనికి స్వయంప్రతిపత్తి హోదా ఇచ్చారు.

Image copyright AFP

వీగర్‌ల ఆందోళన ఏమిటి?

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా వీగర్‌ల మత, సాంస్కృతిక, వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకమేర్పడిందన్న వారి ఆరోపణ. 1990లో వీగర్‌లు స్వతంత్రం కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వం వారిపై అణచివేత చర్యలు మరింత పెంచిందన్న ఆరోపణలున్నాయి.

గత దశాబ్ద కాలంలో వీగర్‌ వర్గంలోని అనేకమంది ప్రముఖులను తీవ్రవాద ఆరోపణలతో చైనా ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. మరికొందరు విదేశాల్లో తలదాచుకుంటున్నారు.

మరోవైపు చైనాలోని హన్ జాతి ప్రజలు పెద్ద ఎత్తున జిన్‌జియాంగ్ రాష్ట్రంలోకి వలస రావడంతో సొంత ప్రాంతంలోనే వీగర్‌లు అల్పసంఖ్యాకులుగా మారిపోయారు.

జిన్‌జియాంగ్ రాష్ట్రంలో సాగిస్తున్న అణచివేతను సమర్థించుకునేందుకు గాను చైనా ప్రభుత్వం వీగర్ వేర్పాటువాదుల సమస్యను భూతద్దంలో చూపిస్తోందన్న ఆరోపణలున్నాయి.

మసీదులు, చర్చిల కూల్చివేతలు

నిర్బంధ శిబిరాల విషయంలో వస్తున్న ఆరోపణలను చైనా ఖండిస్తోంది.

అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త లారా స్టోన్ గత ఏప్రిల్‌లో 'రీఎడ్యుకేట్ సెంటర్స్'గా పిలుస్తున్న ఇలాంటి నిర్బంధ శిబిరాల గురించి ప్రస్తావించగా.. ''జిన్‌జియాంగ్‌లో అన్ని జాతుల వారూ శాంతిసామరస్యాలతో కలిసిమెలసి నివసిస్తున్నారు. కలసికట్టుగా పనిచేసుకుంటున్నారు'' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హ్యూ చునైంగ్ బదులిచ్చారు.

కాగా, గత వారం వాయువ్య చైనాలోని నింగ్జియా రాష్ట్రంలో మసీదు కూల్చివేయడానికి వచ్చిన ప్రభుత్వాధికారులను వేల మంది ముస్లింలు అడ్డుకున్నారు. కొత్తగా నిర్మించిన ఆ మసీదుకు భవన నిర్మాణ అనుమతులు లేవన్నది అధికారుల వాదన. ఈ నేపథ్యంలో అక్కడ చైనా ప్రభుత్వ అధికారులకు, ముస్లింలకు మధ్య వివాదం తలెత్తింది.

చైనా ప్రభుత్వం మత కార్యకలాపాలను నియంత్రిస్తోందని, ముస్లింలను శత్రువుల్లా చూస్తోందని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు చైనాలో క్రైస్తవుల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్చిలను ప్రభుత్వం కూల్చివేయిస్తోందని, మతపరమైన కార్యకలాపాలను అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నారు.

ఏడాదిన్నర కిందట జిన్‌జియాంగ్ రాష్ట్రంలో పొడవుగా గడ్డాలు పెంచుకోవడం, ముసుగు ధరించడంపై చైనా ప్రభుత్వం చట్టపరంగా ఆంక్షలు విధించింది.

Image copyright AFP

చైనా ప్రభుత్వం ఏమంటోంది?

జిన్‌జియాంగ్ స్వతంత్రం కోసం వీగర్ తీవ్రవాదులు బాంబుదాడులు, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని.. దేశంలో అశాంతి సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని చైనా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

వందలాది మంది వీగర్‌ ముస్లింలు 'ఇస్లామిక్ స్టేట్‌' కోసం ఇరాక్, సిరియాల్లో పనిచేశారని.. ఐఎస్ పతనం తరువాత జిన్‌జియాంగ్‌లోకి వారు వస్తుండడం దేశ భద్రతకు ముప్పని చైనా అంటోంది.

అమెరికాలో 9/11 దాడుల తరువాత వీగర్‌ వేర్పాటువాదులను అల్‌ఖైదా అనుబంధ గ్రూపుగా చైనా పదేపదే అభివర్ణిస్తోంది. అఫ్గానిస్తాన్‌లో వీరంతా శిక్షణ పొంది వచ్చారన్నది చైనా అభియోగం. ఈ అభియోగాలకు కొన్ని ఆధారాలను కూడా చైనా చూపించింది.

అఫ్గాన్‌లో అమెరికా సైన్యం ప్రవేశించిన తరువాత 20 మంది వీగర్‌లను నిర్బంధంలోకి తీసుకుని, వారిని గ్వాంటానమో జైలులో ఉంచారు. వారిలో కొందరు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినట్లుగా భావిస్తున్నారు.

మరోవైపు జిన్‌జియాంగ్ రాజధాని ఉరూంఖిలో 2009 జులైలో జరిగిన జాతుల ఘర్షణల్లో 200 మంది వీగర్‌లు మరణించారు. ఒక కర్మాగారం వద్ద జరిగి హన్, వీగర్ వర్గాల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు వీగర్‌లు మరణించిన తరువాత ఈ ఘర్షణలు చెలరేగాయి.

చైనా బయట ఉన్న జిన్‌జియాంగ్ వేర్పాటువాదులే ఈ ఘర్షణలను ప్రేరేపించారని చైనా ప్రభుత్వం అప్పట్లో ఆరోపించింది. బహిష్కృత వీగర్ నేత రెబియా కదీర్‌ను దీనికి బాధ్యురాలిగా చైనా అధికారులు ప్రకటించారు.

అయితే, బహిష్కరణకు గురైన వీగర్ నేతలు కొందరు మాత్రం, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై పోలీసులు విచక్షణరహితంగా కాల్పులు జరపడం వల్లే హింస తీవ్రరూపం దాల్చిందని, 200 మంది చావుకూ ఈ కాల్పులే కారణమని ఆరోపించారు.

Image copyright Reuters

మానవ హక్కుల సంఘాల మాటేమిటి?

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సహా పలు మానవ హక్కుల సంస్థలు జిన్‌జియాంగ్‌లో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి కమిటీకి నివేదికలు సమర్పించాయి. వీగర్‌లను సామూహికంగా నిర్బంధిస్తున్నారని, అక్కడ శిబిరాల్లో.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు విధేయత ప్రకటించాలంటూ వారితో బలవంతంగా ప్రతిజ్ఞలు చేయిస్తున్నారని మానవ హక్కుల సంస్థలు తమ నివేదికల్లో ప్రస్తావించాయి.

విచారణ, దర్యాప్తు వంటివేమీ లేకుండానే ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారని, వారితో కమ్యూనిస్టు పార్టీ నినాదాలను బలవంతంగా పలికిస్తున్నారని 'వరల్డ్ వీగర్ కాంగ్రెస్' కూడా ఆరోపించింది.

మత తీవ్రవాదంపై పోరాటం ముసుగులో చైనా ఇలా పెద్ద ఎత్తున వీగర్‌లను నిర్బంధంలోకి తీసుకుంటోందని ఈ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

చైనా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2017లో 2,28,000 మంది వీగర్‌లను అరెస్టు చేశారని 'చైనీస్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్' సంస్థ చెబుతోంది. 2017లో చైనాలో జరిగిన మొత్తం అరెస్ట్‌లలో ఇది అయిదో వంతు.

Image copyright Getty Images

8 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న జిన్‌జియాంగ్

చైనాలోని అతిపెద్ద రాష్ట్రమైన జిన్‌జియాంగ్‌కు 8 దేశాలతో సరిహద్దు ఉంది. చైనాకు పూర్తిగా పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ రాష్ట్రానికి భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజక్‌స్తాన్, రష్యా, మంగోలియాలతో సరిహద్దు ఉంది.

2.2 కోట్ల జనాభా ఉన్న ఇక్కడ 80 లక్షల మంది వీగర్ ముస్లింలు. సహజ వనరులు పుష్కలంగా ఉండడంతో చైనాలోని ఇతర ప్రాంతాల్లో ఉండే 'హన్ చైనీస్' ప్రజలు ఇక్కడకు భారీ ఎత్తున వలస వచ్చారు.

ఈ పరిణామం నేపథ్యంలోనే హన్ వ్యతిరేక, వేర్పాటువాద భావనలు ఇక్కడ పెరిగాయి. చైనా ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందన్న భావన 1990 నుంచి వీరిలో బలపడుతూ వస్తోంది. 1990లో ఇక్కడ వేర్పాటువాద ఉద్యమం ఊపందుకుంది. చైనా పాలనకు వ్యతిరేకంగా అప్పటి నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి.

2009లో స్థానిక వీగర్‌లు, హన్ చైనీస్ ప్రజల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)