పిండి పదార్థాలు తక్కువ తింటే ఆయుష్షు తగ్గుతుంది

  • 5 ఏప్రిల్ 2019
లో కార్బ్ డైట్ Image copyright Getty Images

ఆహారంలో తక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆయుర్దాయం నాలుగేళ్లకుపైగా తగ్గిపోతుందని ఒక అధ్యయనం వెల్లడించింది.

బరువు తగ్గడానికి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారంగా మాంసం, చేపలు, కూరగాయలు, గింజ ధాన్యాలు లాంటి వాటిని చాలామంది తింటున్నారు. ఇవి ఆరోగ్యం అందిస్తాయని భావిస్తున్నారు.

కానీ, అమెరికాలో 25 ఏళ్లకు పైగా జరిపిన ఒక అధ్యయనం మాత్రం, ఆహారంలో పిండిపదార్థాలు తీసుకోవడం మోస్తరుగా తగ్గించి, మాంసం తినడానికి బదులు కూరగాయలు, గింజధాన్యాలు తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతోంది.

తాము రోజూ ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నామో గుర్తుపెట్టుకుని చెప్పిన వారి ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు.

Image copyright Getty Images

ప్రపంచవ్యాప్త ప్రజాదరణ

అమెరికా పరిశోధకులు తమ అధ్యయనం వివరాలను 'ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌' మేగజీన్ లో ప్రచురించారు. దీని ప్రకారం అమెరికాలో ఉన్న 15,400 మందిని వివిధ ఆహారపు అలవాట్లపై ప్రశ్నించారు. వారు ఏమేం తింటారు, ఏం తాగుతారు, వాటి పరిమాణం వివరాలతో ప్రశ్నలు నమోదు చేయించారు.

ఈ గణాంకాల ఆధారంగా వారు తమ ఆహారంలో కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రొటీన్స్ నుంచి ఎంత శాతం కేలరీలు పొందుతున్నారో అంచనా వేశారు.

సగటున 25 ఏళ్ల వయసు వారు ఇచ్చిన వివరాలు పరిశీలించిన శాస్త్రవేత్తలు, ఆహారంలో మోస్తరుగా కార్బొహైడ్రేట్స్ తీసుకుంటున్నవారు వాటి ద్వారా 50 నుంచి 55 శాతం శక్తిని పొందుతున్నట్టు గుర్తించారు. కార్బొహైడ్రేట్లు మరీ తక్కువగా, అతిగా తినేవారితో పోలిస్తే వీరిలో మరణ అవకాశాలు తక్కువని గుర్తించారు.

కూరగాయలు, పండ్లు, చక్కెరతోపాటూ వారు తీసుకున్న పిండిపదార్థాల్లో ఆలుగడ్డలు, బ్రెడ్, అన్నం, పాస్తా, గింజ ధాన్యాలు కూడా ఉన్నాయి.

ఆహారంలో మోస్తరుగా కార్బొహైడ్రేట్స్ తీసుకున్న వారు 50 ఏళ్ల వయసులో ఉంటే, వారికి మరో 33 ఏళ్ల పాటు జీవించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు.

Image copyright Getty Images

ఈ అధ్యయనం ప్రకారం-

పిండి పదార్థాలు మోస్తరుగా తీసుకునేవారు కార్బొహైడ్రేట్స్ నుంచి 30 లేదా అంతకంటే తక్కువ శాతం శక్తి పొందేవారి(ఎక్స్‌ట్రా-లో-కార్బ్ గ్రూప్) కంటే నాలుగేళ్లు ఎక్కువ జీవిస్తారు.

కార్బొహైడ్రేడ్స్ ద్వారా 30 నుంచి 40 శాతం శక్తి పొందే వారి(లో-కార్బ్) కంటే మోస్తరుగా వాటిని తీసుకునేవారు 2.3 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు.

పిండిపదార్థాల నుంచి 65 శాతం శక్తిని పొందేవారి( హై-కార్బ్) కంటే, వాటిని మోస్తరుగా తీసుకునేవారు 1.1 ఏడాది ఎక్కువ జీవిస్తారు.

పరిశోధకులు తాము గుర్తించిన ఫలితాలను అంతకు ముందు 20 దేశాల్లో 4 లక్షల మందిపై చేసిన పరిశోధనలతో పోల్చిచూశారు. అవి ఒకేలా ఉన్నాయని చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో భాగంగా తక్కువ కార్బొహైడ్రేట్లు(లో-కార్బ్) ఉండే జంతుమాంసం, ఫ్యాట్-మొక్కల ఆధారిత ప్రొటీన్లు, ఫ్యాట్స్ పోల్చి చూశారు.

లో-కార్బ్ డైట్‌లో భాగంగా పశుమాంసం, చికెన్, చీజ్ లాంటివి తింటే మరణ అవకాశాలు స్వల్పంగా పెరగడానికి కారణం అవుతుందని పరిశోధకులు గుర్తించారు.

కానీ చిక్కుళ్లు, గింజలు లాంటి మొక్కల ఆధారిత ప్రొటీన్లు, ఫ్యాట్స్ తినడం వల్ల డెత్ రిస్క్ స్వల్పంగా తగ్గుతుందని చెబుతున్నారు.

Image copyright Getty Images

పోషకాలపై దృష్టి పెట్టడం లేదు

ఈ పరిశోధనకు బ్రిగ్‌హామ్ అండ్ విమెన్ హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ సారా సీడెల్‌మన్ నేతృత్వం వహించారు.

"బరువు తగ్గడానికి అందరూ మాంసకృత్తులు, కొవ్వులు లాంటి లో-కార్బ్ ఆహారం తీసుకుంటున్నారు. అయితే మా గణాంకాల ప్రకారం ఉత్తర అమెరికా, యూరప్‌ అంతా లో-కార్బ్ డైట్ కోసం జంతుమాంసం తింటున్నారు. అది వారి జీవితకాలాన్ని తగ్గించవచ్చు".

జంతుమాంసం బదులు లో-కార్బ్ డైట్ కోసం చిక్కుళ్లు, గింజలు లాంటి మొక్కల ఆధారిత ప్రొటీన్లు, ఫ్యాట్స్ తీసుకుంటే, దాని వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది" అని సారా చెప్పారు.

వెస్టర్న్ ఆహార శైలి వల్ల కూరగాయలు, పండ్లు, ధాన్యాలు లాంటి పిండి పదార్థాలు తీసుకోవడం తగ్గిపోతుందని అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటికి బదులు జంతు మాంసం, కొవ్వులు ఎక్కువ తింటున్నారని అంచనా వేశారు. ఇది వృద్ధాప్యం, శరీరంలో మార్పులకు కారణం అవుతుందన్నారు.

"ఈ అధ్యయనం వల్ల ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఎవరూ పోషకాలపై తగినంత దృష్టి పెట్టడం లేదు. కానీ అవి పశు మాంసం, మొక్కల నుంచి పొందుతున్నారా అనేది తెలియడం లేదు" ఈ అధ్యయనంలో భాగం కాని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నీతా ఫోరోహీ తెలిపారు.

"ఆహారంలో కార్బొహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించినపుడు, వాటిని మొక్కల ఆధారిత కొవ్వులు, మాంసకృత్తుల నుంచి భర్తీ చేయాలి. అలా కాకుండా వాటిని జంతు మాంసం నుంచి స్వీకరించకూడదు" అన్నారు.

Image copyright Getty Images

అధ్యయనంలో పరిమితులు

కొన్ని సమూహాల వారిని పరిశీలించకుండా కేవలం వ్యక్తులు స్వయంగా సమర్పించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. ఇందులో కచ్చితత్వం లేకపోవచ్చు.

పరిశోధకులు అధ్యయనంలో డైట్ ప్రారంభించినపుడు, ఆరేళ్ల తర్వాత మాత్రమే వారి వివరాలు నమోదు చేశారు. ఆలోపు ఆహార నమూనాలలో మార్పులు వచ్చి ఉండొచ్చు.

ఈ అధ్యయనంలో ఉపయోగించిన ప్రశ్నావళిలో జనం తీసుకునే కేలరీలు, ఫ్యాట్స్ తక్కువ అంచనా వేశారని మరో ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.

అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ఈ అధ్యయనంలో ఎక్కువ మాంసం, తక్కువ పిండిపదార్థాలు- లేదా ఎక్కువ పిండిపదార్థాలు-తక్కువ కొవ్వులు తినే రెండు గ్రూపుల్లో అధిక బరువు, ఊబకాయం వల్ల మరణ అవకాశాలు ఉంటాయని ఒక వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)