BBC Special ఇమ్రాన్ ఖాన్: నా ఎముకలు విరిచేసి పోలీసులకు అప్పగించాలని ఆ విద్యార్థులు ప్లాన్ చేశారు

  • పృథ్వీరాజ్
  • బీబీసీ ప్రతినిధి
ఇమ్రాన్‌ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ క్రికెట్ టీమ్ మొట్టమొదటిగా 1992లో ప్రపంచ కప్ సాధించినపుడు ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న ఇమ్రాన్.. ఇప్పుడు ఆ దేశానికే కెప్టెన్ అయ్యారు.

1996లో పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించిన ఆయన.. 22 ఏళ్లు పోరాడి ప్రధాని అయ్యారు. కొంత కాలం కిందట ఇమ్రాన్ ఖాన్ ‘ఎ పర్సనల్ హిస్టరీ’ పేరుతో స్వీయ చరిత్రతో పాటు తన దృష్టిలో పాక్ చరిత్రనూ వర్ణించారు.

ముషారఫ్ ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుకుని.. ఎన్నో విషయాలు ప్రస్తావించారు. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇమ్రాన్ ఖాన్ మాటల్లో..

పోలీసుల కన్నుగప్పి ఇంటి వెనుక గోడ దూకి పారిపోయాను...

2007 నవంబర్‌లో ఒక రాత్రి నేను లాహోర్‌లోని మా పాత ఇంటికి వెళ్లాను. పోలీసులు మా ఇంట్లోకి దురుసుగా తోసుకొచ్చారు. మళ్లీ గృహనిర్బంధం చేస్తారనుకున్నాను. నాకు తేడాగా అనిపించింది. వారెంట్ చూపించమని అడిగాను. పోలీసులు బయట ఉన్న ఉన్నతాధికారి దగ్గరికి వెళ్లారు. ఇంతలో నాకో ఫోన్ వచ్చింది. ఈసారి నన్ను గృహనిర్బంధంలో కాకుండా జైలులో పెడతారని ఓ మిత్రుడు చెప్పాడు. అంటే పోలీసులు నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. పారిపోయే దారి ఉందేమో చూడమని ఇంట్లో ఉన్న నా మేనల్లుడిని అడిగాను. పోలీసులు ఇల్లంతా చుట్టుముట్టి ఉన్నారు. కానీ వెనుకవైపు పదడుగుల ఎత్తున్న గోడ దగ్గర కాపలా ఎవరూ లేరు. నేను ఇంటి వెనుక వైపు జారుకుని గోడవైపు పరిగెత్తాను. మేనల్లుడి సాయంతో గోడ ఎక్కి పక్కనున్న తోటలోకి వెళ్లిపోయాను. పోలీసులు ఇంట్లోకి వచ్చి అణువణువూ శోధిస్తుంటే నేను మా నానమ్మ ఇంటికి వెళ్లి దాక్కున్నాను. కొంత కాలం అలా రోజుకో ఇల్లు మారుస్తూ దాక్కున్నాను.’’

ఫొటో సోర్స్, Getty Images

రాత్రిపూట రహస్యంగా యూనివర్సిటీలోకి వెళ్లి దాక్కున్నా...

ప్రవాసంలో ఉన్న బేనజీర్ భుట్టో మళ్లీ పాకిస్తాన్ రాజకీయాల్లోకి తిరిగొచ్చారు. నిరసన ప్రదర్శన నిర్వహించటానికి ఆమె లాహోర్‌లో దిగారు. ఆమె వెంట విదేశీ మీడియా వచ్చింది. ఆ మీడియాను ఉపయోగించుకుని సాధ్యమైనంత ప్రచారం పొందాలని నేను నిర్ణయించుకున్నా. అందుకోసం దేశంలో అతిపెద్ద విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్‌ సరైనదని నిర్ణయించుకున్నా. నాకు విద్యార్థులు, యువతే అతి పెద్ద బలం. ముషారఫ్ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థులను ఉద్యమింపజేయాలన్నది నా ఆలోచన. నన్ను అరెస్ట్ చేస్తే.. అది విద్యార్థులు, అంతర్జాతీయ మీడియా చూసేలా చేయాలన్నది నా ప్రణాళిక. రాత్రిపూట ఇంట్లో నుంచి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లటం నాకిష్టం లేదు. అందువల్ల ఆ రోజు సాయంత్రం రహస్యంగా యూనివర్సిటీలోకి వచ్చి ఒక ప్రొఫెసర్ గదిలో దాక్కున్నా.

ఫొటో సోర్స్, Getty Images

పాతిక ముప్పై మంది విద్యార్థులు నన్ను తోసుకుంటూ తీసుకెళ్లారు...

ఉదయాన్నే బయటకు వచ్చాను. విద్యార్థులు హర్షాతిరేకాలతో నన్ను పైకెత్తి పట్టుకున్నారు. అంతలో ఓ పాతిక, ముప్పై మంది విద్యార్థులు నన్ను చుట్టుముట్టారు. నన్ను తోసుకుంటూ ఓ మూలకు తీసుకెళ్లి గేటువేశారు. వారిలో కొందరి చేతిలో తుపాకులు కూడా ఉన్నాయి. 'ఎందుకిలా చేస్తున్నారు?' అని అడిగా.. నన్ను దురుసుగా నెట్టేస్తున్నారు కానీ సమాధానం చెప్పటం లేదు. వారు జమైత్-ఎ-తులేబా (ఐజేటీ) విద్యార్థి సంఘం సభ్యులు. ముషారఫ్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారు. 'నేను అరెస్టవటానికి వచ్చాను. నన్ను పోలీసులకు అప్పగించండి' అన్నాను. వాళ్లు నన్ను ఒక వ్యాన్‌లోకి తోసేసి గేటు దగ్గరకు తీసుకెళ్లి ఇన్‌స్పెక్టర్‌కి అప్పగించారు.

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థులు, మీడియా నన్ను కాపాడాయి...

ఆ ఇన్‌స్పెక్టర్ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. మిమ్మల్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఎందుకని అడిగాను. స్టేషన్‌కు వెళ్లిన తర్వాత ఆయన చెప్పాడు. 'ఆ కుర్రాళ్లతో మేం రాత్రి నుంచి మాట్లాడుతున్నాం. వాళ్లు మిమ్మల్ని చితక్కొట్టి, మీ ఎముకలు విరిచేసి.. నేరుగా ఆస్పత్రిలో చేర్చటానికి మాకు అప్పగించాలన్నది వాళ్ల ప్లాన్' అని వివరించాడు. నన్ను కాపాడటానికి సాధారణ దుస్తుల్లో కొందరు పోలీసులను వర్సిటీలోకి పంపించామని.. కానీ ఏం చేయలేకపోయామని చెప్పాడు. అప్పుడర్థమైంది.. నేను తృటిలో వారి దాడి నుంచి బయటపడ్డానని. నన్ను రెండు అంశాలు కాపాడాయి. వాళ్లు అనుకున్నట్లు నేను, నా పార్టీ నాయకులతో కలిసి పొద్దున్నే మెయిన్ గేటు నుంచి రాలేదు. ఇక జాతీయ, అంతర్జాతీయ మీడియా కెమెరాలు పట్టుకుని గేటు వద్ద ఉన్నాయి. దీంతో వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు.

1971లో తూర్పు పాకిస్తాన్ నుంచి చిట్టచివరి విమానంలో నేను తిరిగొచ్చా

తూర్పు పాకిస్తాన్‌లోకి సైన్యం రావటానికి ముందు నేను వెస్ట్ పాకిస్తాన్ అండర్-19 జట్టు సభ్యుడిగా ఈస్ట్ పాకిస్తాన్‌లో క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నా. ఈస్ట్ పాకిస్తాన్ టీమ్‌తో మేం ఆడేటపుడు.. ఢాకా స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల్లోనే కాదు.. ప్రత్యర్థి జట్టులోని వారిలోనూ మాపట్ల శత్రుభావం స్పష్టంగా కనిపించింది. అక్కడి నుంచి వెస్ట్ పాకిస్తాన్ తిరిగివచ్చిన చిట్టచివరి విమానంలో నేను తిరిగి వచ్చాను. తనలాంటి వాళ్లు చాలా మంది పాకిస్తాన్ నుంచి వేర్పడాలని కోరుకుంటున్నారని.. దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం బలంగా ఉందని ఆ జట్టు కెప్టెన్ అష్రాఫుల్ హక్ నాతో చెప్పాడు. అది విని నేను షాక్ తిన్నా. ఎందుకంటే.. ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల మనోభావాల గురించి మాకు ఏమాత్రం తెలీదు.. వెస్ట్ పాకిస్తాన్‌లో మీడియా సెన్సార్‌షిప్ అంతలా ఉండేది. సైన్యం తూర్పు పాకిస్తాన్‌ మీదకి రావటానికి ముందు ఢాకా నుంచి వెస్ట్ పాకిస్తాన్ బయల్దేరిన చిట్టచివరి విమానంలో నేను తిరిగి వచ్చాను.

ఫొటో సోర్స్, Getty Images

మా ప్రభుత్వ ప్రచారాన్ని గుడ్డిగా నమ్మొద్దని తీర్మానించుకున్నా

1974లో నేను మళ్లీ అష్రాఫుల్ హక్‌ని కలిసినపుడు.. సైనిక చర్యలో ఊచకోతకు గురైన బెంగాలీ పౌరుల గురించి ఆయన చెప్పింది విని మళ్లీ షాకయ్యా. ఇరుపక్షాలూ చెప్తున్న సంఖ్యలు నిజమో కాదో నిర్ధారించటం కష్టం. కానీ.. నెలల పాటు కొనసాగిన అంతర్యుద్ధంలో వందలు, వేల మంది పౌరులు చనిపోయుండొచ్చు. లక్షలాది మంది ఆశ్రయం కోరుతూ ఇండియాకు పారిపోయారు. ఇంతకుముందు ఇదంతా పాకిస్తాన్‌కి, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా చేస్తున్న దుష్ర్పచారమని నేను బ్రిటిష్, ఇండియా వారితో వాదించేవాడిని. కానీ హక్ చెప్పిన వివరాలు విన్నతర్వాత.. మా ప్రభుత్వ ప్రచారాన్ని ఎన్నడూ గుడ్డిగా నమ్మకూడదని.. మన సొంత జనంపై సైనిక చర్యకు ఎప్పుడూ మద్దతివ్వకూడదని తీర్మానించుకున్నా.''

ఫొటో సోర్స్, Getty Images

ఈ రాజకీయాలు దండగని నా మాజీ భార్య అనేది..

చరిత్రలో నిజంగా గొప్పవాళ్లందరూ - జిన్నా, గాంధీ, మదర్ థెరీసా, నెల్సన్ మండేలా - ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నవారు. వారు తమ లక్ష్యాలను సాధించటానికి కారణం వారికి మిగతా వారికన్నా ఎక్కువ టాలెంట్ ఉండటం కాదు.. మిగతా వారికన్నా ఉన్నతమైన లక్ష్యాలు, నిస్వార్థమైన స్వప్నాలు ఉండటం కారణం. నా మాజీ భార్య జెమీమా నన్ను తరచుగా అడుగుతుండేది.. 'గెలుపనేది లేకుండా ఇంకెంత కాలం రాజకీయాల్లో ఉంటావు? దానివల్ల ప్రయోజనం లేదని ఎప్పుడు తెలుసుకుంటావు?' అని. నేను జవాబు చెప్పలేకపోయేవాడిని. ఎందుకంటే కలలకు ఒక కాల పరిమితి అనేదేమీ ఉండదు. మనం ఎంత చదువుకున్నాం.. మన సామాజిక నేపథ్యం ఏమిటి అనేదానితో నిమిత్తం లేదు.. కలలను సాకారం చేసుకునే కృషిని ఎన్నడూ విడవకుండా ఉన్నపుడే మనం అనుకున్నది సాధించగలం.''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)