పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, EPA

మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా నిలిచింది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ పీటీఐకి రాకపోవడంతో, ఇమ్రాన్ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు.

పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్.. ఇమ్రాన్‌తో ప్రమాణం చేయించారు. పీటీఐ పార్టీ నేతలు, సైనిక అధికారులతో పాటు 1992లో ఇమ్రాన్ నేతృత్వంలో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన బృంద సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Reuters

ఇమ్రాన్ ప్రాథమ్యాలేంటి?

సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తన ప్రాధాన్యమని ఇమ్రాన్ గతంలో బీబీసీకి తెలిపారు. గత సంవత్సర కాలంగా పాకిస్తాన్ రూపాయి విలువ పతనమవుతోంది, ద్రవ్యోల్బణం పెరుగుతోంది. వీటిని అదుపుచేయడానికి చేపట్టాల్సిన చర్యలే ఆయన ముందున్న ప్రాధాన్యాంశాలు.

శుక్రవారం నేషనల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో ఇమ్రాన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. 176 ఓట్లు ఆయనకు అనుకూలంగా వచ్చాయి. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌కు 96 ఓట్లు వచ్చాయి.

అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులను ఉపేక్షించబోమని, యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని మరోసారి ఇమ్రాన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

"జవాబుదారీతనం కావాలి, ఈ దేశాన్ని దోచుకున్నవారిని శిక్షించాలి. ఎవరి మద్దతుతోనో నాకు ఇది దక్కలేదు. 22 ఏళ్ల పోరాటం తర్వాత నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.