ఐరాస మాజీ చీఫ్, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కోఫీ అన్నాన్ కన్నుమూత

ఫొటో సోర్స్, AFP
ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నాన్ మరణించారు. ఆయన వయసు 80. గతంలో మానవతా దృక్పథంతో చేసిన పనులకు గానూ ఆయన నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
‘స్వల్ప అనారోగ్యం తరువాత శనివారంనాడు ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు’ అని కోఫీ అన్నాన్ ఫౌండేషన్ తెలిపింది. స్వార్థంలేని శాంతియుత ప్రపంచం కోసమే ఆయన జీవితాంతం పోరాడారని ఫౌండేషన్ తన ప్రకటనలో పేర్కొంది.
‘ఎక్కడైతే వ్యథలు, అవసరాలు ఉన్నాయో... అక్కడికి ఆయన కదిలి వెళ్లేవారు. తన సానుభూతి, కారుణ్యంతో కోట్లాది హృదయాలు గెలిచారు. తనకంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని పనులనూ నిస్వార్థంగా చేసేవారు’ అని అన్నాన్ సంస్థ తన ప్రకటనలో తెలిపింది.
ఐరాస సెక్రటరీ జనరల్ పదవి చేపట్టిన తొలి నల్ల జాతీయుడు ఆయనే. 1997 నుంచి 2006 మధ్య రెండు దఫాలు ఆయన ఆ బాధ్యతలు నిర్వహించారు.
తరువాత ఆయన సిరియాకు యూఎన్ ప్రత్యేక రాయబారిగా సేవలందించారు. ఆ క్రమంలో సిరియా యుద్ధానికి శాంతియుత పరిష్కారం కల్పించే దిశగా ప్రయత్నాలు చేశారు.
ఇరాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో, హెచ్ఐవీ/ఎయిడ్స్ విజృంభిస్తున్న రోజుల్లో అన్నాన్ ఐరాస చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఫొటో సోర్స్, AFP
కోఫీ అన్నాన్ ప్రస్థానం
- 1938లో ఆఫ్రికాలోని కుమాసి నగరంలో కోఫీ అన్నాన్తో పాటు ఆయన సోదరి ఎఫువా అటా కూడా జన్మించారు. ఆయన పూర్తి పేరు కోఫీ అటా అన్నాన్. ‘అటా’ అంటే కవలలు అని అర్థం.
- అన్నాన్ది చాలా సంపన్న కుటుంబం. ఆయన తాతలు తరతరాలుగా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన తండ్రి ప్రొవిన్షియల్ గవర్నర్‌గా పని చేశారు.
- అన్నాన్ 19వ పుట్టినరోజుకు సరిగ్గా రెండ్రోజుల ముందు ఆయన దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది, స్వతంత్ర ‘ఘనా’ ఏర్పడింది.
- అమెరికాలోని మాకాలెస్టర్ కాలేజీలో చదవుకున్న అన్నాన్, తన కెరీర్‌ను ఐరాసలోనే మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ)లో బడ్జెట్ ఆఫీసర్‌గా మొదలైన ఆయన ప్రస్థానం నాలుగు దశబ్దాల్లో ఐరాస జనరల్ సెక్రటరీగా ఎదిగే వరకూ సాగింది.
కోఫీ అన్నాన్ జీవితంలో ముఖ్యమైన తేదీలు
1938: కుమాసిలో జన్మించారు. ప్రస్తుతం అది ఘనాలో ఉంది.
1962: జెనీవాలోని ఐరాస కార్యాలయంలో పనిచేయడం మొదలుపెట్టారు.
1965: టీటీ అలాకిజాను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి.
ఫొటో సోర్స్, Getty Images
1984లో నానె లాగెర్గ్రెన్ను అన్నాన్ వివాహం చేసుకున్నారు.
1984: మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం నానె లాగెర్గ్రెన్ను వివాహం చేసుకున్నారు.
1991: ఆయన కవల సోదరి ఎఫువా చనిపోయారు.
1993: ఐరాస శాంతి పరిరక్షక కార్యకలాపాల విభాగానికి హెడ్‌గా మారారు.
1997: ఐరాస 7వ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు.
2001: నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.
2006: 10ఏళ్ల తరువాత ఐరాస సెక్రటరీ జనరల్ పదవి నుంచి వైదొలిగారు.
2007: కోఫీ అన్నాన్ ఫౌండేషన్‌ను స్థాపించారు.
2012: శాంతి, మానవ హక్కుల న్యాయవాదుల సంఘం ‘ది ఎల్డెర్స్’కు చైర్మన్‌గా మారారు.
2018 : ఆగస్టు 18న, 80ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)