తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?

ఆపిల్ లోగో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

యాపిల్ మరో 10ఏళ్ల తరవాత కూడా ఇదే స్థానంలో ఉంటుందా?

ప్రపంచంలోనే లక్ష కోట్ల డాలర్ల విలువైన తొలి సంస్థగా అవతరించింది యాపిల్.

దీనికి ముందు 1987లో ఐబీఎం స్టాక్‌ మార్కెట్‌లో 10 వేల కోట్ల డాలర్ల విలువను దాటిన సంస్థగా గుర్తింపు సాధించింది. అంతకన్నా ముందు 1957లో జనరల్ మోటార్స్ తొలిసారి వేయి కోట్ల డాలర్ల కంపెనీగా రికార్డు సృష్టించింది.

యూఎస్ స్టీల్ 1901లో 100 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించింది.

30 ఏళ్ల తరువాత ఐబీఎంను గమనిస్తే, నాటి వైభవం ఇప్పుడా సంస్థకు లేదు. కంప్యూటర్ రంగంలో ఇప్పటికీ ఐబీఏంకు పేరున్నా, ఫార్చ్యున్-500 సంస్థల్లో కనీసం టాప్ 30 జాబితాలో కూడా అది కనిపించదు. ఈ ఫార్చ్యున్ ర్యాంకులను సంస్థల టర్నోవర్ ఆధారంగా బిజినెస్ మేగజీన్ ‘ఫార్చ్యున్’ లెక్కిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

30 ఏళ్ల తరవాత ఐబీఎంను గమనిస్తే, నాటి వైభవం ఇప్పుడా సంస్థకు లేదు.

అత్యంత సమర్థుడే మనుగడ సాగిస్తాడనే సూత్రం వ్యాపారాలకు కూడా వర్తిస్తుందంటారు విశ్లేషకులు. ఆ సూత్రం ప్రకారమే ఐబీఎం మునుపటి స్థానాన్ని కోల్పోయిందని చెబుతారు.

అమెరికాకు చెందిన ఇన్నోసైట్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం 1964లో ఓ సంస్థ సగటున 33 ఏళ్లపాటు ఫార్చ్యున్ 500 జాబితాలో కొనసాగితే, 2016 నాటికి అది 24 ఏళ్లకు పడిపోయింది. 2027నాటికి 12 ఏళ్లకు మించి సంస్థలు ఆ జాబితాలో కొనసాగలేకపోవచ్చని వాళ్లు భావిస్తున్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, దాని మీద ఆధారపడిన సంస్థల ప్రభావం అప్పటికే స్థిరపడిన సంస్థలపై తీవ్రంగా పడుతోంది. యాపిల్ సంస్థే దానికో పెద్ద ఉదాహరణ. 2007లో ఐఫోన్‌ను ప్రవేశపెట్టిన యాపిల్ 2018 నాటికి ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.

టర్నోవర్ పరంగా చూస్తే అమెరికాకు చెందిన రిటైల్ చెయిన్ వాల్‌మార్ట్... ఫార్చ్యున్ 500 జాబితాలో ముందుంది. కానీ, యాపిల్ ఆ జాబితాలో కూడా వడివడిగా ముందడుగేస్తోంది. 2005లో అదే జాబితాలో యాపిల్ 263వ స్థానంలో ఉంటే ఇప్పుడు మాత్రం నాలుగో స్థానంలో ఉంది.

వ్యాపారం ఎంత వేగంగా ఎదుగుతుందో, పతనం కూడా అంతే వేగంగా అరంభమవుతుందని వ్యాపార వర్గాల అంచనా. అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇదే విషయాన్ని చెబుతోంది.

రానున్న 5-10ఏళ్ల కాలంలో ఫార్చ్యున్ 500 జాబితాలో 75 శాతం సామాన్య ప్రజలకు తెలియని కంపెనీల పేర్లే కనిపిస్తాయని ఆ సంస్థ అంచనా వేస్తోంది.

‘ప్రస్తుతం ఓ ఎదురులేని శక్తికి, కదలలేని వస్తువుకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఆ శక్తి పేరు అత్యాధునిక టెక్నాలజీ. అది మార్కెట్‌ మీద తీవ్రంగా ప్రభావం చూపుతుంది’ అని బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూప్‌ అభివృద్ధి నిపుణుడు ప్యాట్రిక్ ఫోర్త్ 2014లో టెడ్‌ టాక్‌లో చెప్పారు. ఇప్పటికీ ఆ ప్రసంగం కార్పొరేట్ వర్గాల్లో తప్పక చూడాల్సిన వీడియోల జాబితాలో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2018 ముగిసే నాటికి వాట్సాప్‌ వల్ల గత ఆరేళ్లలో టెలికాం రంగానికి జరిగిన నష్టం దాదాపు 38,600 కోట్ల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు

ఈ అంచనాలను బట్టి చూస్తే ‘రేపటి యాపిల్’ ప్రస్తుతం ఫార్చ్యున్ జాబితాలో లేకపోవచ్చు కూడా.

‘చరిత్రలో ఎప్పుడూ లేనంతగా చాలా తక్కువ మందే ఇంటర్నెట్ సాయంతో అత్యంత విలువైన సంస్థలను సృష్టించే పరిస్థితి ఇప్పుడుంది. వాట్సాప్ అందుకో అతి పెద్ద ఉదాహరణ. 2014లో ఫేస్‌బుక్ దాన్ని 1,900 కోట్ల డాలర్లకు కొన్నప్పుడు వాట్సాప్‌‌లో దాదాపు 50మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అందుకే, 20 ఏళ్ల తరవాత అత్యంత విలువైన సంస్థగా ఏది అవతరిస్తుందో చెప్పడం కష్టం’ అంటారు టెక్ నిపుణులు, కాన్‌స్టిలేషన్ రీసెర్చ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డియన్ హెన్‌క్లిఫ్.

వాట్సాప్‌ వల్ల టెలికామ్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 2018 ముగిసే నాటికి, గత ఆరేళ్లలో వాట్సాప్‌ వల్ల టెలికాం రంగానికి జరిగిన నష్టం విలువ 38,600 కోట్ల డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్, ఉబర్, ఎయిర్‌బీఎన్‌బీ, స్పాటిఫై, అమెజాన్ లాంటి సంస్థల ప్రభావం కూడా ఇతర రంగాలపై తీవ్రంగా పడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వీడియో క్యాసెట్లను అద్దెకిచ్చే 'బ్లాక్ బస్టర్' అనే సంస్థకు గతంలో అమెరికా వ్యాప్తంగా 8వేల స్టోర్లు ఉండేవి. కానీ, 2018 జూలై నాటికి ఒకేఒక్క స్టోర్ మిగిలుంది.

2025 నాటికి ఫార్చ్యున్ 500 జాబితాలో టాప్-25లో ఉంటాయని భావిస్తున్న సంస్థలకు, 2018 జాబితాకు చాలా తేడా ఉంది. వాల్‌మార్ట్, షెల్, టొయోటా, జనరల్ మోటార్స్ లాంటి సంస్థలు 2025లో టాప్‌ స్థానాల్లో ఉండవని భావిస్తున్నారు.

ప్రస్తుతం అందరి కళ్లూ కొత్తగా వస్తోన్న ఫుడ్ డెలివరీ కంపెనీ గ్రాబ్ హబ్, రొబోటిక్ సర్జరీ యంత్రాలను తయారు చేసే ఇంట్యుటివ్ సర్జికల్ లాంటి కొన్ని సంస్థలపైనే ఉన్నాయి. స్పేస్ ట్రావెల్, జెనిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగ సంస్థలకూ మంచి భవిష్యత్తు ఉన్నట్లు కనిపిస్తోంది.

నోకియా, కొడాక్ లాంటి సంస్థలు గుర్తున్నాయా? ఒకప్పుడు అవి మార్కెట్ లీడర్స్. కానీ విధ్వంసక ఆవిష్కరణల (disruptive innovations) పుణ్యమా అని అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1901లో యూఎస్ స్టీల్ 1 బిలియన్ డాలర్ల మార్కును అందుకుంది.

వీడియో క్యాసెట్లను అద్దెకిచ్చే ‘బ్లాక్ బస్టర్’ అనే సంస్థకు గతంలో అమెరికా వ్యాప్తంగా 8 వేల స్టోర్లు ఉండేవి. కానీ, 2018 జూలై నాటికి ఒకే ఒక్క స్టోర్ మిగిలింది.

1955 నుంచి ఫార్చ్యున్ 500 జాబితాను గమనిస్తే కేవలం 54 సంస్థలు మాత్రమే ప్రతి జాబితాలోనూ చోటు దక్కించుకున్నాయి.

‘కంపెనీలు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం ప్రస్తుత వ్యాపారం గురించి మాత్రమే ఆలోచించడం మంచిది కాదు. ముఖ్యంగా లాభాలు అందుతున్న సమయంలో భవిష్యత్తులో అవకాశాలుండే రంగంలో పెట్టుబడులు పెట్టాలి’ అంటారు షికాగోకు చెందిన పాల్ లీవండ్ అనే మార్కెట్ నిపుణుడు.

మరి తదుపరి ‘యాపిల్’ సంస్థ ఏది? భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా మారే కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)