#BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు

  • 26 ఆగస్టు 2018
జ్ఞాపకశక్తి, ఆరోగ్యం Image copyright Getty Images

మీరు ఎవరైనా వ్యక్తి పేరు లేదా ఏదైనా స్థలం పేరును గుర్తు తెచ్చుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించిన సందర్భముందా?

వయసుతో పాటే మన జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. అలాగే వయసుతో పాటు మన వివేచనాశక్తి, ప్రతిస్పందనలూ మందగిస్తాయని కూడా విన్నాం. కానీ మన మెదడును తిరిగి ఉద్దీపనం చేసుకోవచ్చని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.

అందువల్ల మీ జ్ఞాపకశక్తిని పునరుద్ధరించుకోవాలనుకుంటే ఈ చిన్న చిన్న సలహాలు, సూచనలను ప్రయత్నించండి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వ్యాయామం వల్ల శరీరానికే కాదు, మెదడుకూ మేలే

1. మెదడు పరిమాణాన్ని పెంచే వ్యాయామం

ఇది నిజం. వ్యాయామం వల్ల మన మెదడు పరిమాణం పెరుగుతుంది. వ్యాయామం కారణంగా మెదడులో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అలాగే కొత్త కణాలు కూడా ఉత్పత్తి అవుతాయి.

మీ ఆరోగ్యం బాగుంటే దాని వల్ల మెదడుకు మరింత ఎక్కువ ఆక్సిజన్, గ్లూకోజ్ అందుతాయి. దాని వల్ల టాక్సిన్ల నిర్మూలన జరుగుతుంది.

వ్యాయామం ఆరు బయట చేస్తే మరీ మంచిది. దాని వల్ల శరీరానికి విటమిన్ డి కూడా లభిస్తుంది.

కొత్త వాతావరణంలో, కొత్త తరహాలో వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీకు గార్డెనింగ్ ఇష్టమైతే, ఒక్కరే గార్డెనింగ్ చేసే బదులు అలాంటి అలవాటున్న వాళ్లతో కలిసి పని చేయడానికి ప్రయత్నించండి. దీని వల్ల శరీరానికి వ్యాయామం లభించడంతో పాటు మెదడూ చురుగ్గా మారుతుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గార్డెనింగ్ వంటి వ్యాపకాలు మెదడుకు మేలు చేస్తాయి

2. నడుస్తూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి

ఒక పరిశోధన ప్రకారం, ఏవైనా పదాలను గుర్తు పెట్టుకోవాలనుకున్నపుడు లేదా ఏదైనా నేర్చుకోవాలనుకున్నపుడు, అటూఇటూ తిరుగుతూ ఆ ప్రయత్నం చేస్తే అది చాలా కాలం పాటు గుర్తుంటుంది.

నటీనటులు కూడా డైలాగ్‌లు గుర్తు పెట్టుకోవడానికి ఈ విధానాన్ని అనుసరిస్తారు.

ఈసారి మీరు ఏదైనా ప్రసంగం చేయాల్సి వచ్చినా లేదా ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినపుడు.. తిరుగుతూ లేదా డ్యాన్స్ చేస్తూ వాటిని గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నించి చూడండి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరం

3. జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి సరైన ఆహార పదార్థాలను తీసుకోండి

మన శరీరానికి అందే షుగర్, శక్తిలో 20 శాతం మెదడుకు వెళుతుంది. అంటే మెదడు పనితీరు పూర్తిగా గ్లూకోజ్ లెవల్స్ మీద ఆధారపడి ఉంటుంది.

అందువల్ల షుగర్ లెవల్స్‌ను సరిగా నియంత్రించకపోతే, మెదడు పనితీరు సరిగా ఉండదు.

మానవుని జీర్ణవ్యవస్థలో ఒక వంద ట్రిలియన్లకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పని చేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతౌల్యంతో ఉండేలా చూసుకోవడం అవసరం.

నిజానికి మన పొట్టను 'రెండో మెదడు'గా భావించవచ్చు. వైవిధ్యభరితమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఈ సూక్ష్మజీవులను సమతుల్యతతో ఉంచుతూ, మెదడు బాగా పని చేయదానికి సహాయపడతాయి.

మెదడు కణాలు కొవ్వుతో తయారవుతాయి. అందువల్ల మీరు తినే ఆహారపదార్థాలలో కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోండి.

Image copyright Getty Images

4. ఒత్తిడి నుంచి ‘స్విచ్ ఆఫ్’

నిజానికి జీవితంలో కొంత ఒత్తిడి అవసరం. దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో తొందరగా ప్రతిస్పందించడం అలవాటవుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి జరిగి, దాని వల్ల మనకు శక్తి లభించి, లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం సాధ్యపడుతుంది.

అయితే ఎక్కువ కాలం ఒత్తిడి, ఆందోళనలు మెదడుకు మంచివి కావు.

అందువల్ల అప్పుడప్పుడు ఒత్తిడి నుంచి స్విచ్ ఆఫ్ చేసుకొని, మెదడుకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం.

ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం కష్టమైతే మెడిటేషన్‌లాంటి వాటిని ప్రయత్నించండి. దాని వల్ల ఒత్తిడి కలిగించే హార్మోన్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయి.

Image copyright Getty Images

5. మీతో మీరే సవాలు చేసుకోండి

జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి దానిని సవాలు చేయడం లేదా కొత్త అలవాట్లను నేర్చుకోవడం ఒక విధానం.

ఏదైనా కళలు లేదా కొత్త భాషను నేర్చుకోవడానికి ప్రయత్నించడం లాంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

మీ స్నేహితులు లేదా కుటుంబసభ్యులతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడండి. అవి మీ ఆలోచనలకు పదును పెడతాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సంగీతం మెదడును ఉద్దీపనం చేస్తుంది

6. సంగీతంపై ఇష్టం పెంచుకోండి

సంగీతం ఒక ప్రత్యేక విధానంలో మెదడును ఉద్దీపన చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఏదైనా సంగీతాన్ని వింటున్నపుడు వారి మెదడును స్కాన్ చేస్తే, అది మొత్తం చైతన్యవంతంగా ఉన్నట్లు గుర్తించారు.

సంగీతం మన సాధారణ గ్రహణశక్తిని మెరుగుపరుస్తుంది. డిమెన్షియాలాంటి వ్యాధుల్లో చివరిగా చెరిగిపోయేవి సంగీతపరమైన జ్ఞాపకాలే అని గుర్తించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి నిద్ర చాలా అవసరం

7. చదివి నిద్ర పోవాలా? లేచాక చదవాలా?

మీరు పగటి పూట ఏదైనా నేర్చుకుంటే, నిద్రపోయాక అది ఒక జ్ఞాపకంగా మారిపోతుంది. అందువల్ల జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి నిద్ర అనేది చాలా అవసరం.

మీరు ఎవరిరైనా పడుకునే ముందు ఒక జాబితాను ఇచ్చి పొద్దున్నే దాన్ని గుర్తు తెచ్చుకొమ్మని చెప్పండి. మరొకరికి పొద్దున్న ఆ జాబితా ఇచ్చి రాత్రి అప్పగించమని అడగండి. మొదటి సందర్భంలోనే బాగా గుర్తు ఉంటుందని పరిశోధనలలో తేలింది.

మీరు పరీక్షకు సిద్ధమవుతుంటే, జవాబులు నేర్చుకుని నిద్రపొండి. దాని వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అదే విధంగా నిద్రపోయే ముందు చెడ్డ అనుభవాలను లేదా జ్ఞాపకాలను గుర్తు చేసుకోకండి. నిద్రపోయే ముందు హారర్ సినిమాలు చూడడం లేదా హారర్ కథలు చదవడం కూడా చేయొద్దు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎలా మేల్కొంటున్నారన్నది కూడా ముఖ్యమే

8. ఎంత సేపు నిద్రపోవాలి?

ఐదు గంటలకన్నా తక్కువ సేపు నిద్రపోతే మన మెదడు చురుగ్గా ఉండదు. అదే విధంగా 10 గంటలకన్నా ఎక్కువ సేపు నిద్రపోవడం కూడా మంచిది కాదు.

చీకటిగా ఉండే గదిలో నిద్రపోవడం మేలు. మేలుకొనే సమయంలో కూడా వెలుతురు క్రమక్రమంగా పెరిగేలా చూసుకోవాలి.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)