ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం ఏ దేశంలో విస్తరిస్తోంది?

  • 27 ఆగస్టు 2018
సోమాలియా, ఇస్లామిక్ స్టేట్, అల్ షబాబ్, అల్ కాయిదా

గత ఏడాది చివర్లో సిరియా, ఇరాక్‌లపై పట్టు కోల్పోయాక ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఇటీవల సోమాలియాలో దాడులను తీవ్రతరం చేసింది.

జులై 25న దక్షిణ సోమాలియాలోని లోయర్ షాబెల్ ప్రాంతంలో 14 మందిని చంపడమో, తీవ్రంగా గాయపరచడమో జరిగిందని ఐఎస్ ప్రకటించుకుంది.

సోమాలియాలో ఐఎస్ ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు చేసిన దాడులను బీబీసీ పరిశీలించినప్పుడు, ఆ దేశంలో ఐఎస్ కార్యకలాపాలు ఎంత పెరిగాయో తెలుస్తోంది.

ఈ దాడుల్లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్, భద్రతా సిబ్బందిపై చేశామని ఐఎస్ చెబుతోంది. అలాంటి దాడుల్లో కొన్నిటిని వీడియోల్లో కూడా చిత్రీకరించారు.

మొదట ఇలాంటి దాడులు సోమాలియాలోని నైరుతి ప్రాంతంలో ఉన్న అఫ్గుయి నగరంపై జరిగాయని ఐఎస్ ప్రకటించింది. అయితే ఇటీవల జరిగిన దాడులను పరిశీలించినప్పుడు అవి ఎక్కువగా రాజధాని మొగదిషు పరిసరాల్లో జరిగినట్లు తెలుస్తోంది.

Image copyright AFP

2018లో సోమాలియాలో 39 చోట్ల దాడులు

ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 31 వరకు ఐఎస్ సోమాలియాలో 39చోట్ల దాడులకు పాల్పడింది.

వాటిలో 27 దాడులు మే, జూన్, జులై నెలల్లోనే జరిగాయి. 2017లో 21 చోట్ల దాడులు చేశామని ఐఎస్ ప్రకటించుకుంది. అంటే సోమాలియాలో క్రమంగా ఐఎస్ దాడులు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఐఎస్ టార్గెట్‌లో ఇంటెలిజెన్స్ అధికారులు, సోమాలీ పోలీసులు, మిలటరీ సిబ్బంది ఉన్నారు.

సోమాలియాలో ఐఎస్‌కు ప్రత్యర్థిగా ఉన్న అల్ షబాబ్ కూడా సైన్యం, ప్రభుత్వం, ఆఫ్రికా బలగాల మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోంది.

నిజానికి అల్ షబాబే సోమాలియాలో ఐఎస్ వ్యాప్తికి ప్రధాన ఆటంకంగా మారింది.

Image copyright AFP

టార్గెట్ - మొగదిషు

మొదట సోమాలియాలోని ఈశాన్య ప్రాంతంలో ప్రవేశించిన ఐఎస్ మిలిటెంట్లు తర్వాత దేశంలోని దక్షిణ ప్రాంతానికి విస్తరించారు.

రాజధాని మొగదిషు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐఎస్ దాడులు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 39 దాడులు జరగ్గా, వాటిలో 23 మొగదిషులోనే జరిగాయి. వాటిలోనూ సోమాలియాకు గుండెకాయలా భావించే బకారా బజార్ పరిసరాల్లో ఎక్కువ దాడులు జరిగాయి.

ఐఎస్ దాడులను పరిశీలిస్తే ఈ ఏడాది మేలో దాడుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

మే నెలలో ఐఎస్ అఫ్గుయిలో తొమ్మిదిసార్లు, ఈశాన్య ప్రాంతంలోని బొసాసోలో మూడుసార్లు దాడులకు పాల్పడింది.

2015 నుంచి సోమాలియాలో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఐఎస్ అంటోంది.

ప్రస్తుతం ఐఎస్‌లో ఉన్నవారిలో ఎక్కువ భాగం దాని ప్రత్యర్థి అయిన అల్ షబాబ్ నుంచి చేరిన వాళ్లే.

అబ్దుల్ ఖాదిర్ ముమిన్‌ను సోమాలియాలోని ఐఎస్ మిలిటెంట్లకు లీడర్‌గా భావిస్తున్నారు. ముమిన్, మరికొంత మంది మిలిటెంట్లు 2015 అక్టోబర్‌లో అల్ షబాబ్ నుంచి వచ్చి ఐఎస్‌లో చేరారు.

ముమిన్ చివరిసారిగా 2016 ఏప్రిల్‌లో విడుదల చేసిన వీడియోలో కనిపించారు. 2016 ఆగస్టులో అమెరికా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో ముమిన్ పేరు ఉంది.

సోమాలియాలోని ఐఎస్ మిలిటెంట్లకు యెమెన్ నుంచి ఆయుధాలు అందుతున్నాయని అమెరికా విశ్వసిస్తోంది.

సోమాలియాలో ఐఎస్ కార్యకలాపాలు పెరిగినా, అల్ షబాబ్‌తో దానికి ఉన్న వైరమే రానున్న రోజుల్లో దాని భవిష్యత్తును తేల్చనుంది.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)