హ్యాపీయెస్ట్ కంట్రీస్‌లో సంతోషం అంతంతేనా?

  • 27 ఆగస్టు 2018
happy Image copyright Getty Images

ఫిన్లాండ్, నార్వే వంటి నార్డిక్ దేశాలు ఏటా 'సంతోష సూచీ'లో ముందు వరుసలో ఉంటుంటాయి. కానీ, తాజా అధ్యయనమొకటి ఇందులో నిజానిజాల గురించి చర్చించింది.

నార్డిక్ దేశాల్లో జీవన చిత్రాన్ని పరిశీలిస్తూ కోపెన్‌హాగన్‌లోని 'హ్యాపీనెస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, నార్డిక్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్'లు ఒక అధ్యయన నివేదికను విడుదల చేశాయి.

సంతోషం పేరిట సాధిస్తున్న ఊహా ప్రపంచపు కీర్తి మాటున ఈ దేశాల్లోని యువత, కొన్ని వర్గాల జనాభాకు సంబంధించిన ప్రధాన సమస్యలను దాచిపెడుతున్నారని ఈ నివేదిక సూచిస్తోంది.

వీరు 2012-16 మధ్య అయిదేళ్ల కాలానికి సంబంధించిన డేటా సహాయంతో ఈ ఊహా ప్రపంచపు వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

ఇందులోభాగంగా వారు ప్రజలను తమ సంతృప్త స్థాయిని వెల్లడించమని కోరుతూ సర్వే చేశారు.

10 పాయింట్లను ప్రాతిపదికగా తీసుకుని మూడు వర్గాలుగా విభజించారు. 7 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు ఇచ్చినవారిని అభివృద్ధి కేటగిరీగా, 4 నుంచి 6 మధ్య స్కోర్ ఉంటే జీవనం కోసం పోరాడుతున్న కేటగిరీ, 4 కంటే తక్కువ పాయింట్లు ఇచ్చినవారిని కష్టాల కేటగిరీలో విభజించారు.

దీని ప్రకారం నార్డిక్ దేశాల్లోని 12.3 శాతం జనాభా కష్టాల కడలి ఈదుతూ జీవన పోరాటం చేస్తోందని తేల్చారు. ముఖ్యంగా 13.5 శాతం యువత ఇదే పరిస్థితిలో ఉన్నట్లు చెప్పారు.

శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండింటికీ సంతోష సూచీ ర్యాంకింగులతో సంబంధం ఉందని ఈ అధ్యయనం గుర్తించింది. నిరుద్యోగం, ఆదాయ లేమి, సామాజిక ఇబ్బందులు ఈ దేశాల ప్రజల్లో ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయని గుర్తించింది.

మానసిక ఆరోగ్యమే పెద్ద సమస్య

మనిషి సంతోషంగా లేకపోవడానికి మానసిక ఆరోగ్యం ప్రధాన కారణమని ఈ అధ్యయనం తేల్చింది. నార్డిక్ దేశాల యువత మానసిక ఆరోగ్యం సవ్యంగా లేనట్లు వెల్లడించింది.

యువతలో ఎక్కువమంది ఒంటరితనం, ఒత్తిళ్ల కారణంగా మానసిక సమస్యలకు గురవుతున్నారని ఈ అధ్యయనకర్తల్లో ఒకరైన మైఖేల్ బిర్కజీర్ 'గార్డియన్' పత్రికకు తెలిపారు.

డెన్మార్క్‌లో 16 నుంచి 24 ఏళ్ల మధ్యవయస్కుల్లో 18.3 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆయన చెప్పారు.

అదే వయోవిభాగానికి చెందిన డెన్మార్క్ యువతుల్లో 23.8 శాతం మందికి ఇలాంటి సమస్యలున్నాయట.

నార్వేలో గత అయిదేళ్లలో మానసిక సమస్యలకు చికిత్స చేయించుకోవడానికి వెళ్తున్న యువత 40 శాతం పెరిగారు. 2018 సంతోష సూచీలో మొదటి స్థానంలో ఉన్న ఫిన్లాండ్‌లో 16 నుంచి 24 ఏళ్ల లోపువారి మరణాలకు గల కారణాల్లో ఆత్మహత్యలది మూడో స్థానం. యువకుల కంటే యువతులు ఎక్కువగా ఒత్తిడి, కుంగుబాటు సమస్యలతో బాధపడుతున్నామని సర్వేలో చెప్పారు.

Image copyright Getty Images

ఇంకా ఏం గుర్తించారు..

ఉద్యోగం లేనివారంతా అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటివారిలో మానసిక సమస్యలున్నాయి.

పురుషుల్లో అత్యధికులు సంఘ జీవనానికి దూరంగా ఉన్నట్లు గుర్తించారు.

స్థానిక అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారిలో అత్యధికులు సంతోషంగా లేరు.

...అయితే, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలతో పోల్చినప్పుడు నార్డిక్ దేశాల ప్రజలు నిజంగానే సంతోషంగా ఉన్నారని అధ్యయనం తేల్చింది. కానీ, సంతోష సూచీల్లో చూపిస్తున్నంత ఆనందం మాత్రం లేదన్నది అధ్యయనకర్తల వాదన.

(డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, గ్రీన్‌లాండ్, ఫారో ఐలాండ్స్‌ను నార్డిక్ దేశాలంటారు)

మా ఇతర కథనాలు:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.