షామీ పోకో ఎఫ్ 1: మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో ఇక ధరల యుద్ధమే

షామీ ఫోన్లు

ఫొటో సోర్స్, XIAOMI

హై ఎండ్ ఫీచర్స్ కలిగి, అందుబాటు ధరలో ఉన్న ఓ సరికొత్త మొబైల్‌ను షామీ కంపెనీ ఆవిష్కరించింది.

'పోకో ఎఫ్ 1' పేరుతో వచ్చిన ఈ మొబైల్ ఫోన్‌.. అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ చిప్, 4,000 ఎమ్.ఎ.హెచ్ బ్యాటరీ, గరిష్టంగా 8 జి.బి. ర్యామ్ కలిగి, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 మొబైల్‌తో సరిపోలుతోంది.

కానీ షామీ తన ఫోన్ ధరలను మాత్రం, ప్రత్యర్థి కంపెనీల కంటే తక్కువగానే నిర్ణయించింది. ఈ విషయమై ఒక నిపుణుడు మాట్లాడుతూ, సరికొత్త పోకో 1 మొబైల్ కారణంగా.. తక్కిన కంపెనీలు తమ మొబైల్ ఫోన్ ధరల గురించి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.

''షామీ పోకో 1 మొబైల్‌లో అత్యుత్తమ క్వాల్‌కోమ్ ప్రాసెసర్ ఉంది. ఇలాంటి ప్రాసెసర్ కలిగి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ ధరలో సగం ధరకే షామీ పోకో 1 వస్తుంది'' అని 'పాకెట్-లింట్' వెబ్‌సైట్ రివ్యూస్ ఎడిటర్ మైక్ లోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, XIAOMI

''4వేల ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ చాలా శక్తిమంతమైనది. అయితే ఈ ఫోన్ కాస్త బరువుగా ఉంటుంది. బరువు ఉన్నా పర్లేదు అనుకునే వినియోగదారులే షామీ లక్ష్యం. భారత మార్కెట్లో తన ఆధిక్యాన్ని కొనసాగించాలని, ఇతర ప్రాంతాలకూ తన మార్కెట్‌ను విస్తరించాలని షామీ భావిస్తోంది'' అని మైక్ లోవ్ అన్నారు.

భారత మార్కెట్లో 'పోకో ఎఫ్ 1' బేసిక్ మోడల్ ధర రూ.20,999గా నిర్ణయించారు. 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ దీని ప్రత్యేకతలు.

ఇందులోని హై ఎండ్ మోడల్ విషయానికి వస్తే, ఆ మోడల్ వెనుక భాగం సింథటిక్ ఫైబర్‌తో తయారు చేశారు. అందులో ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.29,999.

ఫొటో సోర్స్, ASUS/ONEPLUS

'వన్ ప్లస్ 6', 'ఎసూస్ జెన్‌ఫోన్ 5జెడ్' ఫోన్లు షామీ పోకో ఎఫ్ 1కు సమీప పోటీదార్లుగా నిలుస్తాయని భారత మీడియా అభిప్రాయపడింది.

ఈ ప్రత్యేకతలతో ఉన్న కొన్ని ఫోన్ల ధరలు గతంలో రూ.29,999-36,999 వరకు ఉండేవి. మరికొన్ని ఫోన్ల ధరలు అంతకు మించి.. రూ.34,999-43,999 వరకు ఉండేవి.

ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులు తమ కార్డు ద్వారా షామీ ఫోన్‌ను కొంటే రూ.1,000 డిస్కౌంట్ కూడా వస్తుంది.

ధరల విషయానికి వస్తే, ‘వావే’ కంపెనీకి చెందిన 'ఆనర్ ప్లే' ఫోన్ మాత్రమే ధరల విషయంలో షామీకి గట్టి పోటీ ఇవ్వగలదు. కానీ సాంకేతిక ప్రత్యేకతల విషయానికి వస్తే ఆనర్ ప్లే మొబైల్ షామీ కంటే వెనకబడి ఉంది.

'పోకో ఎఫ్ 1' ఫోన్లను భారత్‌లో ఆగస్ట్ 29న విడుదల చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. 50 ఇతర దేశాల్లో కూడా ఈ ఫోన్లను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. యూరప్‌లో కూడా ఈ ఫోన్లను విడుదల చేసే యోచనలో కంపెనీ ఉన్నట్లు ఒక నిపుణుడు తెలిపారు.

''ఈ ఫోన్లలో ఉన్న క్వాల్‌కామ్ చిప్‌సెట్లు మొబైల్ ఆపరేటర్లకు చాలా సౌకర్యవంతమైనవి. వారిని ఆకర్షించడంలో ఈ క్వాల్‌కామ్ చిప్‌సెట్లు ఉపయోగపడతాయి. ఆసియా, ఆగ్నేయాసియాలో చాలా మొబైల్ ఫోన్లను నేరుగా వినియోగదారులకే అమ్ముతారు. కానీ యూరప్ దేశాల్లో చాలా ఫోన్ల అమ్మకాలు ఇంకా మొబైల్ ఆపరేటర్ల ద్వారానే జరుగుతున్నాయి'' అని మొబైల్ రంగ విశ్లేషకుడు ఇయాన్ ఫాగ్ అన్నారు.

ఫొటో సోర్స్, XIAOMI

డిజైన్‌లో ఎక్కడ రాజీపడింది?

  • ఈ ఫోన్‌లో ఐదేళ్ల క్రితం వాడుకలో ఉన్న కార్నింగ్స్ గొరిల్లా డిస్‌ప్లే వాడారు.
  • వీటి కెమెరాలకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు.
  • ఈ ఫోన్లకు గ్రీజ్ మరకలు త్వరగా అంటుతాయని, వీటి శబ్దం కూడా చాలా చిన్నగా ఉంటుందని 'వర్జ్ న్యూస్ సైట్' పేర్కొంది.

కానీ ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడేటపుడు ఇబ్బంది పడాల్సిన పని లేదని, లిక్విడ్ కూలింగ్ విధానం వల్ల ఈ ఫోన్లు వేడి అవ్వవని, కొన్ని రివ్యూల్లో పేర్కొన్నారు.

''ఈ ఫోన్ మాత్రం సూపర్బ్.. దీనికి వెచ్చించే ధరకు మించిన ప్రత్యేకతలను వినియోగదారులకు అందిస్తోంది'' అని 'ఆండ్రాయిడ్ సెంట్రల్' విశ్లేషణ పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters

అమ్మకాలు జోరందుకుంటాయా?

2016లో భారతీయ మొబైల్ పోటీదారుల తాకిడికి కాస్త మందగించిన షామీ ఫోన్ల అమ్మకాలు తిరిగి జోరందుకుంటున్న తరుణంలో ఫోకో ఎఫ్ 1 మోడల్ మార్కెట్లోకి వస్తోంది.

ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) గణాంకాల ప్రకారం, షామీ అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ప్రపంచ మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో షామీ నాలుగో స్థానంలో ఉందని, భారత్‌లో అగ్రస్థానంలో ఉందని ఐడీసీ పేర్కొంది.

షామీ కంపెనీ ఆన్‌లైన్ అమ్మకాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూనే, మొబైల్ దుకాణాల్లో కూడా వీటి అమ్మకాలు పెరిగడమే షామీ విజయానికి కారణం అని ఐడీసీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)