వెనెజ్వేలా: శృంగార జీవితంపై సంక్షోభం ప్రభావం

ద్రవ్యోల్బణం కారణంగా కండోమ్స్ ధరలు పెరిగిపోయాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ద్రవ్యోల్బణం కారణంగా కండోమ్స్ ధరలు పెరిగిపోయాయి

ద్రవ్యోల్బణం ప్రభావం నిత్యావసరాలు, ఇతర వస్తువులపైనే కాదు మనిషి శృంగార జీవితంపైన కూడా ఉంటుంది. వెనెజ్వేలాలో పరిస్థితి ప్రస్తుతం అలానే ఉంది.

ఆ దేశంలో కొన్నాళ్లుగా తీవ్ర ద్రవ్యోల్బణం నెలకొంది. చాలా వస్తువులకు కొరత ఏర్పడింది. దానికి తోడు అందుబాటులో ఉన్న వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

వెనెజ్వేలాలో ఇప్పుడు తక్కువగా దొరుకుతున్న వస్తువుల జాబితాలో కండోమ్స్, ఇతర గర్భ నిరోధక ఉత్పత్తులు చేరాయి. దేశంలో కండోమ్స్ లభ్యత తీవ్రంగా తగ్గిపోవడంతో పాటు వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

వెనెజ్వేలాలో ఆగస్టు 20 నుంచి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే చర్యలను అధ్యక్షుడు నికొలస్ మడూరో చేపట్టారు. దానికి ముందు వెనెజ్వేలాలో పరిస్థితులు తెలుసుకునేందుకు అక్కడి పాత్రికేయురాలు మరియానా జునిగాతో బీబీసీ మాట్లాడింది.

‘నిన్న నేనొక స్టోర్‌కు వెళ్లాను. అక్కడ కొన్ని కండోమ్స్ డబ్బాలున్నాయి. వాటి ధర 10లక్షల బొలివర్లపైనే ఉంది. కానీ దేశంలో కనీస వేతనం 30లక్షల బొలివర్లు. అంటే కండోమ్స్ కొనాలంటే కనీసం రెండు వారాల జీతాన్ని ఖర్చు చేయాలి. అందరికీ అది సాధ్యం కాదు. అందుకే దేశ ఆర్థిక పరిస్థితి మనుషుల శృంగార జీవితంపైన చాలా ప్రభావం చూపుతోంది’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దేశాధ్యక్షుడు మడూరో ఇటీవలే కొత్త కరెన్సీని ప్రవేశపెట్టారు

ఇటీవలే వెనెజ్వేలా అధ్యక్షుడు మడూరో ప్రవేశపెట్టిన ఆర్థిక పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కనీస వేతనాలను 34రెట్లు పెంచింది. పాత కరెన్సీ స్థానంలో కొత్త సావరీన్ బొలివర్లను కూడా తీసుకొచ్చింది.

‘ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు శృంగార జీవితానికి దూరమవుతున్నారని నేను అనుకోవట్లేదు. కాకపోతే గర్భ నిరోధకానికి పాత పద్ధతులను వాడుతున్నట్లు అనిపిస్తోంది. నెలసరి రోజులను లెక్కబెట్టుకొని దానికి అనుగుణంగా శృంగారంలో పాల్గొనడం, స్కలనాన్ని నియంత్రించుకోవడం లాంటి చర్యలను పాటిస్తున్నారు’ అని మరియానా చెప్పారు.

కానీ వైద్య రంగానికి చెందినవారు మాత్రం మరోలా చెబుతున్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైననాటి నుంచి అవాంఛిత గర్భాలు పెరిగాయని, హెచ్‌ఐవీతో పాటు ఇతర సుఖ వ్యాధుల విస్తరణ ఎక్కువైందని, ఇదంతా కండోమ్స్ లాంటి నిరోధకాల కొరత వల్ల ఏర్పడిన పరిస్థితి అని వారు అంటున్నారు.

గర్భ నిరోధక మాత్రల ధర కూడా పెరగడంతో చాలా మంది గర్భం దాల్చకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారాలను అనుసరిస్తున్నారు. కొందరు యువతులు కూడా గర్భం దాల్చకుండా ఉండేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గర్భ నిరోధకాలు కొనలేక మహిళలు పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు

‘నేను కరకాస్ నగరంలోని ఓ క్లినిక్ యాజమాన్యంతో మాట్లాడాను. వాళ్లు గతేడాది 400మంది మహిళలకు గర్భం దాల్చే వీలు లేకుండా శస్త్ర చికిత్సలు చేశారు. ఈ ఏడాది మే నాటికే ఆ చికిత్సల సంఖ్య 400 దాటింది. కాబట్టి 2018 గర్భ నిరోధక శస్త్రచికిత్సల సంఖ్య గతేడాదితో పోలిస్తే రెట్టింపవుతుందని వారు అంచనా వేస్తున్నారు.

గతంలో 30ఏళ్లు పైబడిన మహిళలు, ముగ్గురుకంటే ఎక్కువ సంతానం కలిగిన వాళ్లే ఈ శస్త్రచికిత్సలను ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు 20-24 ఏళ్ల మధ్య వయసున్న యువతులు కూడా ఈ శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని పోషించే శక్తి లేకపోవడం, గర్భ నిరోధకాల కొరతతో పాటు వాటిని కొనే స్థోమత లేకపోవడం వల్ల ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు’ అని మరియానా చెప్పారు.

అంటే అత్యధిక ద్రవ్యోల్బణం శస్త్ర చికిత్సల రూపంలో యువతుల శరీరాల్లో శాశ్వత మార్పులు తీసుకొస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ద్రవ్యోల్బణం శస్త్ర చికిత్సల రూపంతో యువతుల శరీరాల్లో శాశ్వత మార్పులు తీసుకొస్తోంది.

‘ద్రవ్యోల్బణానికి రకరకాల కారణాలుంటాయి. ఉదాహరణకు ఒక లైన్లో 100 మంది మనుషులుండీ, 10 వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటే వ్యాపారి ఆ వస్తువుల ధరను పెంచేస్తాడు. దాంతో, ఓ పది మంది ఆ లైన్‌ను వదిలి వెళ్లొచ్చు. కానీ ఇంకా 90మంది ఉంటారు.

ధరను ఇంకాస్త పెంచితే మరో 10మంది లైను వదిలి వెళ్లొచ్చు. చివరికి కేవలం 10మంది మాత్రమే మిగిలే వరకు వ్యాపారులు ధరను పెంచుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది. అలా వస్తువుల ధరలు స్థాయికి మించి పెరిగిపోతాయి. ఈ ఉదాహరణలో ఓ వస్తువుకు ఉన్న ఎక్కువ డిమాండ్ ద్రవ్యోల్బణానికి కారణమైంది’ అంటారు యూకేకు చెందిన రాజీవ్ ప్రభాకర్ అనే ఆర్థిక నిపుణుడు.

‘ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు పెంచాలనే ఆదేశాలందాయి. దాంతో సంస్థలపై భారం పడుతుంది. ఆ నష్టాన్ని పూరించడానికి సంస్థలు ఉత్పత్తుల ధరలు పెంచే అవకాశం ఉంటుంది. ఆ భారం వినియోగదారుడిపై పడుతుంది. దీని వల్ల కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది’ అంటారు ప్రభాకర్.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఎంత ఎక్కువ డబ్బు చలామణీలో ఉంటే దాని విలువ అంత తగ్గుతుంది

వెనెజ్వేలాలో వీటికి తోడు అనేక ఇతర కారణాలు కూడా ద్రవ్యోల్బణానికి దారి తీస్తున్నాయి. వ్యవస్థలో చాలా ఎక్కువ డబ్బు చలామణీలో ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతారు.

‘ప్రభుత్వం ఎక్కువ కరెన్సీని ముద్రిస్తే, ఎక్కువ డబ్బు చలామణీలోకి వస్తుంది. దాంతో ధరలు కూడా పెరుగుతాయి. ఆ తరవాత జరిగే పరిణామాలను ఊహించొచ్చు’ అని ప్రభాకర్ చెబుతారు.

అందరి దగ్గరా ఎక్కువ డబ్బు ఉంటే, ఆ డబ్బు విలువ తగ్గిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... డిమాండుకు సరఫరాకు మధ్య సమతుల్యతను పాటించకపోతే అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది.

కండోమ్స్‌ లాంటి గర్భ నిరోధకాల విషయంలో అదే జరుగుతోంది. డిమాండ్ ఎక్కువగా, సరఫరా తక్కువగా ఉండటంతో రేట్లు పెరిగాయి. వాటిని అత్యధిక శాతం మంది కొనలేకపోతున్నారు. దాంతో అది మహిళల జీవనశైలి, ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతోంది.

దేశ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించకపోతే అది శృంగారం లాంటి వ్యక్తిగత అంశాలపైన కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడానికి వెనెజ్వేలా సంక్షోభమే ఒక ఉదాహరణ.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)